ETV Bharat / bharat

'కఠిన సవాళ్లు వస్తున్నాయ్​.. భారత్​ మరింత శక్తిమంతం కావాలి'

author img

By

Published : Feb 28, 2022, 5:45 PM IST

PM Modi in UP: అంతర్జాతీయంగా ఎదురవుతోన్న కఠిన సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్​ మరింత శక్తిమంతం కావాల్సిన అవసరం ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉత్తర్​ప్రదేశ్​పై ఆ బాధ్యత ఎక్కువగా ఉందని సూచించారు. యూపీలోని మహరాజ్​గంజ్​ ఎన్నికల ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

PM Modi
ప్రధాని మోదీ

PM Modi in UP: ప్రపంచంలోని ప్రతిఒక్కరిని ప్రభావితం చేసే అంతర్జాతీయ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని భారత్​ మరింత శక్తిమంతంగా తయారు కావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఉత్తర్​ప్రదేశ్​లోని మహరాజ్​గంజ్​లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అతిపెద్ద రాష్ట్రంగా.. భారత్​ను బలంగా తయారు చేయటంలో యూపీదే కీలక బాధ్యతని పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు వైబ్రెంట్​ విలేజ్​ పేరుతో సరికొత్త పథకాన్ని కేంద్రం ప్రారంభించినట్లు చెప్పారు.

"ప్రస్తుతం ప్రపంచాన్ని చాలా సవాళ్లు పీడిస్తున్నాయి. ఏదో ఒక విధంగా ప్రపంచంలోని ప్రతి ఒక్కరిపై ఆ ప్రభావం పడుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో భారత్​ మరింత శక్తిమంతంగా తయారు కావాల్సిన అవసరం ఉంది. వ్యవసాయం నుంచి సైన్యం, సముద్రం నుంచి అంతరిక్షం వరకు ప్రతి రంగంలో భారత్​ ప్రబలశక్తిగా ఎదగాలి."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

నేపాల్​ సరిహద్దులోని మహరాజ్​గంజ్​కు​.. ఖుషీనగర్​లో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం పూర్తయితే పర్యటకుల సంఖ్య పెరుగుతుందన్నారు మోదీ. సరిహద్దుల్లోని గ్రామాల అభివృద్ధికి కేంద్ర బడ్జెట్​లో ప్రత్యేక ప్రణాళిక రచించినట్లు చెప్పారు. తాము వాగ్దానాలు మాత్రమే చేయమని, వాటికి నిధులు కేటాయించి పూర్తిచేస్తామన్నారు. కుటుంబ పాలకులు కరోనా వ్యాక్సిన్లపై ఆరోపణలు చేస్తూ.. దేశ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వారు ప్రతిసారీ తమ కుటుంబ బాగోగుల గురించే ఆలోచించారని, కానీ, భాజపా ప్రభుత్వం పేద ప్రజల కోసం పనిచేస్తోందన్నారు.

మహరాజ్​గంజ్​ సహా పరిసర ప్రాంతాల్లో మార్చి 3న ఆరో విడతలో పోలింగ్ జరగనుంది.

ఇదీ చూడండి: ఘర్షణల మధ్య మణిపుర్​ తొలి విడత ఎన్నికలు.. 67% ఓటింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.