ETV Bharat / bharat

నేడు యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌.. విజయ్​చౌక్​లో విపక్ష నేతల భేటీ

author img

By

Published : Jun 27, 2022, 6:42 AM IST

Updated : Jun 27, 2022, 6:56 AM IST

president election 2022: విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా సోమవారం మధ్యాహ్నం 12.15 గంటలకు నామినేషన్‌ వేయనున్నారు. ఆయన వెంట కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు ఉండనున్నారు.

president election 2022 news
యశ్వంత్‌ సిన్హా

president election 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా సోమవారం మధ్యాహ్నం 12.15 గంటలకు నామినేషన్‌ వేయనున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు పాల్గొనే అవకాశముంది. సిన్హాకు మద్దతుగా తెరాస తరఫున పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, తెరాస లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, చేవెళ్ళ, పెద్దపల్లి, మెదక్‌ ఎంపీలు రంజిత్‌ రెడ్డి, వెంకటేశ్‌ నేత, ప్రభాకర్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె.ఆర్‌.సురేశ్‌ రెడ్డి హాజరుకానున్నారు. యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌కు హాజరు విషయమై తెలంగాణ సీఎం, తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ ఆదివారం హైదరాబాద్‌లో తమ పార్టీ నేతలతో చర్చించారు. ఈ కార్యక్రమానికి ఆయనే స్వయంగా రావాలని తొలుత భావించినా, చివరకు కేటీఆర్‌ను పంపాలని నిర్ణయించారు. నామినేషన్‌కు ముందు- సిన్హాను బలపరుస్తున్న పార్టీల నేతలంతా రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ కార్యాలయం వద్ద సమావేశమవనున్నారు. మధ్యాహ్నం 1.10 గంటలకు విజయ్‌చౌక్‌లో విపక్ష నేతలతో కలిసి యశ్వంత్‌ సిన్హా విలేకరులతో మాట్లాడతారు.

నియంతృత్వ విధానాలపై పోరాటమిది: ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నిక వ్యక్తిగత పోటీ కాదని.. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ విధానాలను అడ్డుకునేందుకు జరుగుతున్న పోరాటమని యశ్వంత్‌ సిన్హా వ్యాఖ్యానించారు. పోటీ నుంచి తాను తప్పుకొనే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తన కుమారుడు, భాజపా ఎంపీ జయంత్‌ సిన్హా మద్దతును దక్కించుకోలేకపోవడంపై స్పందిస్తూ.. జయంత్‌ రాజధర్మాన్ని పాటిస్తారని, తాను దేశధర్మాన్ని పాటిస్తానని అన్నారు.

ఇప్పటికే 30 మంది నామినేషన్లు: రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధాన పోటీ ద్రౌపదీ ముర్ము, యశ్వంత్‌ సిన్హా మధ్యే ఉంది. అంతమాత్రాన బరిలో ఉన్నది వీరిద్దరే అనుకుంటే మాత్రం పొరపడినట్లే! ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటివరకు కనీసం 30 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో దిల్లీకి చెందిన ప్రొఫెసర్‌ దయాశంకర్‌ అగర్వాల్‌, ముంబయి మురికివాడల్లో నివసించే సంజయ్‌స్వాజీ దేశ్‌పాండే, బిహార్‌లోని సారణ్‌ జిల్లాకు చెందిన లాలూప్రసాద్‌ యాదవ్‌ (ఆర్జేడీ అధినేత కాదు), తమిళనాడుకు చెందిన టి.రమేశ్‌ అనే సామాజిక కార్యకర్త తదితరులు ఉన్నారు. అయితే- వీరిలో అత్యధికుల నామపత్రాల్లో తమను ప్రతిపాదించేవారి పేర్లుగానీ, సెక్యూరిటీ డిపాజిట్‌ కింద సమర్పించాల్సిన రూ.15 వేల బ్యాంక్‌ డ్రాఫ్ట్‌గానీ లేవు. కాబట్టి వారి నామినేషన్లు తిరస్కరణకు గురవనున్నాయి. ఇద్దరు అభ్యర్థులు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా తదితరుల పేర్లను ప్రతిపాదకులుగా పేర్కొన్నా.. వారి సంతకాలు మాత్రం లేవు. ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నానికి చెందిన రవికుమార్‌ కేసగాని, తిరుపతికి చెందిన కంకన్ల పెంచలనాయుడు కూడా నామినేషన్‌ దాఖలు చేసినవారిలో ఉన్నారు. 1967లో అత్యధికంగా రాష్ట్రపతి ఎన్నికల్లో 17 మంది పోటీ పడ్డారు.

1 నుంచి రాష్ట్రాల్లో పర్యటించనున్న ద్రౌపది: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చే నెల 1 నుంచి రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. గిరిజన జనాభా అధికంగా ఉన్న ఏదైనా ఒక రాష్ట్రం నుంచి తన ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టాలని ఆమె యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

విపక్షాల భేటీ: రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో ప్రతిపక్షాలు పోరుకు సిద్ధం అవుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్​ సిన్హా నామినేషన్​ దాఖలు చేయనుండగా.. అంతకుముందే పార్లమెంట్​లో ఉదయం 11:30 గంటలకు ప్రతిపక్షాలు సమావేశం కానున్నాయి. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా.. జులై 21 ఓట్లను లెక్కించనున్నారు.

ఇదీ చదవండి: యూపీలో యోగి మేజిక్.. ఎస్పీ కోటలు బద్దలు.. పంజాబ్​లో ఆప్​కు షాక్

Last Updated :Jun 27, 2022, 6:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.