ETV Bharat / bharat

శరద్ పవార్​ రాజీనామా తిరస్కరణ.. అధ్యక్షుడిగా​ కొనసాగాల్సిందేనని కోర్ కమిటీ తీర్మానం

author img

By

Published : May 5, 2023, 11:54 AM IST

Updated : May 5, 2023, 1:35 PM IST

ఎన్​సీపీ అధ్యక్ష పదవికి శరద్​ పవార్​ చేసిన రాజీనామాను తిరస్కరిస్తూ తీర్మానం చేసింది పార్టీ కోర్​ కమిటీ. అధ్యక్షుడిగా ఆయన కొనసాగాల్సిందేనని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని పవార్​కు తెలియజేయగా.. ఆలోచించుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని ఆయన పార్టీ నేతల్ని కోరారు.

ncp core committee rejected sharad pawar resignation
శరద్​ పవార్ రాజీనామాను తిరస్కరించిన ఎన్​సీపీ కోర్​ కమిటీ

ఎన్​సీపీ అధ్యక్ష పదవికి శరద్​ పవార్​ చేసిన రాజీనామాను తిరస్కరిస్తూ తీర్మానం చేసింది పార్టీ కోర్​ కమిటీ. పార్టీ సారథిగా ఆయన కొనసాగాల్సిందేనని స్పష్టం చేసింది. ముంబయిలో శుక్రవారం జరిగిన పార్టీ కోర్​ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శరద్​ పవార్​ రాజీనామా నిర్ణయం విషయంలో పునరాలోచించాలని కార్యకర్తలు సైతం డిమాండ్ చేశారు. 'ఐ యామ్ విత్ సాహెబ్' అనే సందేశంతో కూడిన టోపీలను ధరించి, సంఘీభావం తెలిపారు.

"శరద్ పవార్​ మే 2న తన రాజీనామాను ప్రకటించారు. తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకోవడం కోసం పార్టీ నాయకులతో కలిసి కోర్​ కమిటీని ఆయన నియమించారు. కమిటీ సభ్యులమంతా ఈరోజు సమావేశమయ్యాము. ఆయన నిర్ణయంపై పునరాలోచించాలని నాతో సహా పలువురు నాయకులు పవార్​ను కోరాం. ఎన్​సీపీ నాయకులే కాదు.. ఇతర పార్టీ నేతలు కూడా పార్టీ అధ్యక్షుడిగా ఆయన కొనసాగాలని కోరుకుంటున్నారు."
- ప్రఫుల్ పటేల్, ఎన్​సీపీ ఉపాధ్యక్షుడు

కోర్ కమిటీ నేతలు చేసిన తీర్మానం వివరాల్ని స్వయంగా వెళ్లి శరద్‌ పవార్‌కు తెలియజేశారు ఎన్​సీపీ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రఫుల్ పటేల్. పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరారు. అయితే.. తీర్మానంపై ఆలోచించి, నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కావాలని పవార్ కోరినట్లు ప్రఫుల్ పటేల్ వెల్లడించారు.

18 సభ్యులతో కోర్​ కమిటీ..
అంతకుముందు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్​సీపీ) తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ముంబయిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఉదయం కీలక సమావేశం నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశానికి సుప్రియా సూలే, అజిత్‌ పవార్‌, మాజీ కేంద్ర మంత్రి ప్రఫుల్‌ పటేల్‌, ఛగన్‌ భుజ్‌బల్‌ సహా 18 మంది సీనియర్​ నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో శరద్‌ పవార్‌ రాజీనామాను తిరస్కరిస్తూ ఓ తీర్మానం ప్రవేశపెట్టగా దాన్ని కమిటీ ఆమోదించింది. పార్టీ అధినాయకుడిగా పవార్‌ కొనసాగాలని అభ్యర్థిస్తూ మరో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. కమిటీ నిర్ణయంతో ఎన్‌సీపీ కార్యాలయం వెలుపల పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

కోర్​ కమిటీ నిర్ణయంపై పవార్‌ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోనున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్‌సీపీ అధ్యక్షుడిగా కొనసాగడంపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని గురువారం శరద్‌పవార్‌ ప్రకటించారు. అయితే, అధ్యక్షుడిగా పవార్‌ను కొనసాగిస్తూ.. కొత్తగా కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని తీసుకురావాలని ఎన్‌సీపీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ బాధ్యతలు చేపట్టే వారి జాబితాలో పవార్‌ కుమార్తె సుప్రియా సూలే పేరు బలంగా వినిపిస్తోంది.
శరద్ పవార్.. 1999లో కాంగ్రెస్‌ పార్టీని వీడి ఎన్​సీపీని స్థాపించారు. 24 ఏళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా సేవలందించిన పవార్​ మే 2న తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించడం వల్ల అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

ముఖ్యుల సలహా..
వచ్చే ఎన్నికల్లో అజిత్‌ పవార్‌ను మహా వికాస్ అగాఢీ తరఫున ముఖ్యమంత్రిగా ఉంచేందుకు ఇప్పటికే ఎన్​సీపీ నేతలు కాంగ్రెస్, ఉద్ధవ్ వర్గానికి చెందిన శివసేనతో చర్చలు జరుపుతున్నారు. తద్వారా అజిత్‌ పవార్ పార్టీను చీల్చి భాజపాలో చేరేందుకు వెనకడుగు వేస్తారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్న శరద్‌ పవార్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆప్ నేత సంజయ్ సింగ్, సీపీఐ నేత డి.రాజా జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా వంటి నేతలు శరద్‌ పవార్‌ను కోరారు.

Last Updated : May 5, 2023, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.