'దేశంలో ప్రజాస్వామ్యం పటిష్ఠం.. ఓర్వలేకే వారి దాడులు! అయినా ఆగేదే లే'

author img

By

Published : Mar 18, 2023, 10:58 PM IST

narendra modi india today conclave

దేశంలోని ప్రజాస్వామ్య సంస్థలన్నీ విజయవంతంగా నడుస్తున్నాయని, వాటిని చూసి ఓర్వలేకే కొందరు ఆరోపణలు చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఎలాంటి దాడులు జరిగినా.. దేశం తన లక్ష్య సాధన దిశగా ముందుకు వెళ్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

భారత ప్రజాస్వామ్యం, దేశంలోని సంస్థలు విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేని కొందరు అవి విధ్వంసం అవుతున్నాయని విమర్శలు చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఇండియా టుడే కాంక్లేవ్​లో మాట్లాడిన మోదీ.. ప్రజాస్వామ్య ఫలాలు అంటే ఏంటో ప్రపంచానికి భారత్ చూపించిందని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. అవినీతి ఆరోపణలపై విచారణ జరుపుతున్న సంస్థల చుట్టూ వివిధ పార్టీల నేతలు ర్యాలీలు చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇటీవల విపక్షాలు ఈడీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు చేసిన ప్రయత్నాన్ని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

"గతంలో లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు న్యూస్ పేపర్లలో హెడ్​లైన్లుగా వచ్చేవి. ఇప్పుడు.. అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న చర్యలను ఖండిస్తూ ఏకం కావడాన్ని పత్రికల్లో శీర్షికలుగా చూస్తున్నాం. దేశంలోని ప్రజాస్వామ్య సంస్థలు బలంగా ఉన్నాయి. అందుకే ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం పెరుగుతోంది. కరోనా సమయంలోనూ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు భాగమయ్యారు. బలమైన ఆర్థిక, బ్యాంకింగ్ వ్యవస్థలు ఉన్నాయి. ఈ విజయాలు కొందరిని బాధిస్తున్నాయి. అందుకే మన ప్రజాస్వామ్యాన్ని, సంస్థలను లక్ష్యంగా చేసుకున్నారు. దేశ ప్రజలంతా విశ్వాసంతో ఉన్నారు. ప్రపంచంలోని మేధావులంతా భారత దేశ వృద్ధి రేటు గురించి ఆశాజనకంగా ఉన్నారు. కానీ, దేశ స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు సైతం జరుగుతున్నాయి. ఏదైనా మంచి పని జరుగుతుంటే.. కాటుక పెట్టుకోవడం మన సంప్రదాయం. ఇప్పుడు కూడా కొందరు కాటుక పెట్టుకునే బాధ్యత తీసుకుంటున్నారు."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

పరిపాలనకు మానవీయ స్పర్శను జోడించామని ప్రధాని మోదీ చెప్పారు. గ్రామాలకు తగిన ప్రాధాన్యం కల్పించామని అన్నారు. ఈశాన్య ప్రాంతాలను తమ ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణించిందని వివరించారు. అక్కడ అభివృద్ధికి ఆస్కారం కల్పించిందని పేర్కొన్నారు. ఎలాంటి దాడులు జరిగినా.. దేశం తన లక్ష్య సాధనకు ముందుకు వెళ్తూనే ఉంటుందని మోదీ స్పష్టం చేశారు. భారత్.. ప్రపంచ శక్తిగా ఎదుగుతున్న ఈ సమయంలో.. దేశ మీడియా సైతం అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. 'గతంలో చాలా స్కామ్​ల గురించి ప్రసారం చేసినప్పుడు మీడియాకు చాలా టీఆర్​పీ వచ్చింది. ఇప్పుడు అవినీతికి పాల్పడిన వారిపై తీసుకుంటున్న చర్యలను చూపిస్తూ టీఆర్​పీ పెంచుకునే అవకాశం వచ్చింది. ఇలాంటి సమయంలో మీరు ఒత్తిడికి లోను కావద్దు. బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఈ అవకాశాన్ని కోల్పోవద్దు' అంటూ మీడియాకు పిలుపునిచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.