ETV Bharat / bharat

ముంబయికి 'మహా' రెబల్స్!.. శిందే, ఠాక్రే డైలాగ్​ వార్

author img

By

Published : Jun 28, 2022, 6:55 PM IST

Maharashtra Political Crisis: 'మహా వికాస్​ అఘాడీ' ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటుతో సర్కారు పతనం అంచుకు చేరింది. పొలిటికల్‌ గేమ్‌లోకి భాజపా ఎంట్రీతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఒకవైపు ఏక్‌నాథ్‌ శిందే వర్గంలోని ఎమ్మెల్యేలు శివసేనకు టచ్​లో ఉన్నట్లు.. మరోవైపు ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు సాయం చేయాలని ఫడణవీస్​కు ఉద్ధవ్​ ఠాక్రే ఫోన్​ చేసినట్లు.. ఇంకోవైపు ఫడణవీస్​​ గవర్నర్​ను కలిసేందుకు సిద్ధవుతున్నట్లు.. ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇంతకీ ఇందులో ఏది నిజం? శిందే వర్గం ఎప్పుడు ముంబయికి వచ్చే అవకాశం ఉంది? అసలు సంక్షోభం ఎప్పుడు ఓ కొలిక్కివస్తుంది.

maharashtra political crisis
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం

Maharashtra Political Crisis: శివసేన ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలో తిరుగుబాటుతో మొదలైన మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. జులై 11 వరకు అనర్హత వేటు వేయద్దని రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు ఊరట కల్పించిన వేళ వారిని బుజ్జగించేందుకు శివసేన అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మరో ప్రయత్నం చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా గువాహటి నుంచి ముంబయి తిరిగొచ్చి తనతో చర్చలు జరపాలని వారికి లేఖ రాశారు. అంతా కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. తాజా పరిణామాలపై మహారాష్ట్ర ప్రజలు, శివ సైనికుల్లో నెలకొన్న గందరగోళానికి తెరదించాలని కోరారు.

అంతకుముందు రెబల్ ఎమ్మెల్యేల్లో సగం మందికిపైగా తమను సంప్రదిస్తున్నారని శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ తెలిపారు. వారిని గువాహటిలో బలవంతంగా నిర్బంధించారన్న ఆయన వారు తప్పకుండా ఠాక్రే వర్గంలోకి తిరిగొస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందే మండిపడ్డారు. తనకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, శివసేన నాయకత్వంతో ఎవరూ సంప్రదింపులు జరపడం లేదంటూ తాము బస చేసిన హోటల్‌ నుంచి బయటకొచ్చి మీడియాకు వెల్లడించారు. ఎమ్మెల్యేలంతా స్వచ్చందంగానే తన వద్దకు వచ్చారని, వారిని ఎవరూ నిర్బంధించలేదని పేర్కొన్నారు. బాల్‌ ఠాక్రే విశ్వసించే.. హిందుత్వ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నదే వారి అభిమతమని తెలిపారు. త్వరలోనే ముంబయి వస్తామని ఆయన ప్రకటించారు.

భాజపా నిశితంగా.. మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులను భాజపా నిశితంగా పరిశీలిస్తోంది. 'మహా వికాస్​ అఘాడీ' కూటమిని దెబ్బ కొట్టేందుకు అదును కోసం వేచి చూస్తోంది. ఇందుకోసం కార్యాచరణను సిద్ధం చేసేందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడణవీస్​ రంగంలో దిగినట్లు తెలుస్తోంది. దీనిపై చర్చించేందుకు అగ్రనేతలను కలుస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. సంక్షోభం విషయంలో ఫడణవీస్ జోక్యం చేసుకోవద్దని స్వయంగా శివసేన కీలక నేత సంజయ్​ రౌత్​ చెప్పడం వల్ల.. భాజపా వ్యూహాలు రచిస్తోందని ఇంకా స్పష్టమవుతోంది. మొదట గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని కలవడం ద్వారా.. అఘాడీ కూటమిని మరింత ఇరకాటంలో పెట్టే వ్యూహాంతో ముందుకెళ్లాలని భాజపా భావిస్తోంది.

రాష్ట్రంలో పరిస్థితులను చక్కబెట్టాక.. రెబల్​ ఎమ్మెల్యేలను రప్పించి, ప్రభుత్వాన్ని పడగొట్టేలా భాజపా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఫడణవీస్​ గవర్నర్​ను కలిసే అవకాశం ఉందని ఊహాగానాలు వెలువడిన కొద్దిగంటలకే.. తిరుగుబాటు ఎమ్మెల్యేమంతా.. అతి త్వరలో ముంబయి వస్తున్నట్లు సందేశం పంపడం.. ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
ఇదిలా ఉంటే.. సంక్షోభ పరిస్థితులపై చర్చించేందుకు మంగళవారం 2.30 గంటలకు కేబినెట్​ మీటింగ్​ నిర్వహించారు. అయితే కరోనా సోకడం వల్ల సీఎం ఉద్ధవ్​ ఠాక్రే, డిప్యూటీ సీఎం అజిత్​ పవార్​ వర్చువల్​గా హాజరయ్యారు.

మరోవైపు శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల దారిలో ఆ పార్టీ ఎంపీలు కూడా పయనిస్తున్నట్లు తెలుస్తోంది. సుమారు 14 మంది శివసేన ఎంపీలు రెబల్స్‌లో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. శివసేనకు లోక్‌సభలో 19 మంది ఎంపీలు ఉండగా వారిలో 14 మంది ఏక్‌నాథ్‌ శిందే, భాజపాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అదే జరిగితే శివసేన పార్టీ, ఎన్నికల గుర్తు కోసం ప్రయత్నిస్తున్న శిందేకు మరింత బలం చేకూరుతుంది. మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేనకు 55 మంది సభ్యులుండగా వీరిలో 39 మంది తిరుగుబాటు చేశారు. వీరికి శిందే నాయకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలైన శివసేన పార్టీ తమదేనని, అసెంబ్లీలో తమ వర్గాన్నే శివసేనగా గుర్తించాలని.. శిందే కోరుతున్నారు. ఈ అంశంపై.. గవర్నర్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఎంపీలు కూడా శిందేకు మద్దతిచ్చేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.

ఫడణవీస్​కు ఠాక్రే కాల్​ చేశారా?
సంక్షోభం నేపథ్యంలో ఆసక్తికరమైన వార్త ఒకటి ప్రచారం జరిగింది. ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. భాజపా నాయకుడు దేవేంద్ర ఫడణవీస్​కు ఫోన్ చేసినట్లు వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే ఈ వార్తలను శివసేన ఖండించింది. తప్పుదోవ పట్టించే ఇలాంటి వార్తలను నమ్మొద్దని శివసేన అధికార ప్రతినిధి హర్షల్ ప్రధాన్ వెల్లడించారు. జూన్ 22 తేదీనే రాజీనామా చేసేందుకు ఠాక్రే నిర్ణయించుకున్నారని, మిత్రపక్షాల విజ్ఞప్తి మేరకే ఆయన.. రాజీనామా చేయకుండా ఆగారని వెల్లడించారు. ఇలాంటి అసత్యాలను నమ్మొద్దని సూచించారు.

సంజయ్‌ రౌత్​కు ఈడీ ఉచ్చు!
శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌కు.. ఎన్‌ఫోర్స్‌మెంట్​ డైరెక్టరేట్​ మరోసారి సమన్లు పంపింది. జులై 1న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. మహారాష్ట్రలో అనూహ్య పరిణామాల నేపథ్యంలో తాను విచారణకు హాజరు కాలేనని చెప్పారు. ఈడీకి మంగళవారం తన లాయర్ల ద్వారా సమాచారం అందజేశారు రౌత్​. విచారణకు హాజరయ్యేందుకు రెండు వారాల గడువును కోరారు. అయితే అయితే ఈడీ అందుకు ఒప్పుకోలేదు. ఈ నెలాఖరు వరకు మాత్రమే అనుమతులు ఇచ్చి.. జులై 1న విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ముంబయిలోని ఓ భవనం రీ-డెవలప్‌మెంట్‌తోపాటు ఇతర ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఈ కేసులో రౌత్‌ సతీమణి, స్నేహితులకు కూడా ఈడీ సమన్లు పంపింది.

ఇదీ చదవండి: కోతికి చిప్స్ ఇస్తూ 100అడుగుల లోయలో పడిపోయిన టూరిస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.