ETV Bharat / bharat

ఆర్థిక విధ్వంసమే అసలు లక్ష్యం.. సీఐడీ చీఫ్‌ ఆరోపణలపై మార్గదర్శి ప్రకటన

author img

By

Published : Apr 13, 2023, 7:11 AM IST

Margadarsi Statement on CID ADG Allegations:సీఐడీ ఆరోపణలను ఖండిస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ ప్రకటన విడుదల చేసింది. బలహీనులు, అమాయక చందాదారులను దోచుకొని చిట్‌ఫండ్‌ కార్యకలాపాల పేరుతో దేశంలో జరుగుతున్న అతిపెద్ద మోసాన్ని నిరోధించేందుకు సీఐడీ పనిచేస్తోందనే నాటకీయమైన ఆరోపణలతో... సీఐడీ అడిషినల్‌ డైరెక్టర్‌ జనరల్‌ దిల్లీలో పత్రికా ప్రకటన విడుదల చేశారని ఖండనలో పేర్కొంది. సీఐడీ ఆరోపణలకు మార్గదర్శి సవివర సమాధానాలు ఇచ్చింది.

Margadarsi Statement On CID ADG Alligations
Margadarsi Statement On CID ADG Alligations

సీఐడీ చీఫ్‌ ఆరోపణలపై మార్గదర్శి ప్రకటన

Margadarsi Statement on CID ADG Allegations: మార్గదర్శి చిట్‌ఫండ్‌ను ఆర్థికంగా దెబ్బతీయాలన్న భారీ కుట్రలో భాగంగానే ఆ సంస్థలో ఏదో జరిగిపోతున్నట్లు ఆరోపిస్తూ ఏపీ సీఐడీ చీఫ్‌ ఎన్‌.సంజయ్‌ దిల్లీలో విలేకర్ల సమావేశం పెట్టి, పత్రికా ప్రకటన విడుదల చేశారని మార్గదర్శి సంస్థ పేర్కొంది. సంస్థ యాజమాన్యం, సిబ్బందిని బెదిరించి చందాదారుల్లో భయాందోళనలు రేకెత్తించేందుకు సీఐడీ ప్రయత్నిస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘బలహీనులు, అమాయక చందాదారులను దోచుకొని చిట్‌ఫండ్‌ కార్యకలాపాల పేరుతో దేశంలో జరుగుతున్న అతిపెద్ద మోసాన్ని నిరోధించేందుకు సీఐడీ పనిచేస్తోందనే నాటకీయమైన ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ దిల్లీలో ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఇంటి పేరుగా మారి రెండు తెలుగు రాష్ట్రాల్లో 2 లక్షల మందికి పైగా చందాదారులున్న మార్గదర్శి చిట్‌ఫండ్‌ కంపెనీపై వారు దృష్టిపెట్టారు. 60 ఏళ్ల క్రితం ఈ సంస్థను స్థాపించిన రామోజీరావు తెలుగులో అత్యధిక సర్క్యులేషన్‌ ఉన్న ‘ఈనాడు’ దినపత్రిక వ్యవస్థాపక సంపాదకులు కూడా. ఈ పత్రిక స్వతంత్రతకు మారుపేరు. ప్రభుత్వాలు తప్పులు చేస్తున్నప్పుడు విమర్శిస్తుంది. ఈ నేపథ్యంలోనే మార్గదర్శి చిట్‌ఫండ్‌కు ఉన్న గౌరవాన్ని దిగజార్చి, దానికున్న ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ఏపీ ప్రభుత్వం 2022 నవంబరులో ప్రయత్నాలు ప్రారంభించింది. 1982 చిట్‌ఫండ్‌ యాక్ట్‌ కింద రిజిస్ట్రార్‌ ఆఫ్‌ చిట్స్‌ నవంబరు 15న ఏకకాలంలో 17 బ్రాంచ్‌ల్లో తనిఖీలు ప్రారంభించి అక్కడి నుంచి అన్ని డాక్యుమెంట్లకు సంబంధించిన కాపీలు తీసుకున్నారు.

కంపెనీ దైనందిన వ్యవహారాలకు ఆటంకం: కొత్త చిట్‌ల ప్రారంభానికి వచ్చిన దరఖాస్తులపై చర్యలు తీసుకోలేదు. దానివల్ల కంపెనీ రోజువారీ వ్యవహారాలకు ఆటంకం ఏర్పడింది. చిట్‌లు పూర్తయిన తర్వాత రిజిస్ట్రార్‌ వద్ద ఉన్న చిట్‌ సెక్యూరిటీ డిపాజిట్లను రిఫండ్‌ చేయాలి. చిట్‌ పూర్తయిన తర్వాత కూడా రిజిస్ట్రార్లు వాటిని తమ వద్దే ఉంచుకున్నారు. చిట్‌ల కాలపరిమితి పూర్తయినా రిఫండ్‌ చేయకపోవడం వల్ల రిజిస్ట్రార్ల వద్ద నిలిచిపోయిన మొత్తం రూ.48.81 కోట్ల మేర ఉంది. చిట్‌ఫండ్‌ చట్టం ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తూ సంబంధిత రిజిస్ట్రార్లు వివరణలు కోరారు. వాటన్నింటికీ మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ సమాధానాలు ఇచ్చింది. అయితే వాటిన్నింటినీ పక్కన పెట్టారు.

జ్యురిస్‌ డిక్షనల్‌ రిజిస్ట్రార్ల ఫిర్యాదుల ఆధారంగా కేవలం చిట్‌ఫండ్‌ చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపైనే కాకుండా ఐపీసీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డిపాజిటర్స్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ కింద కూడా 7 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ముగ్గురు బ్రాంచి మేనేజర్లను అరెస్ట్‌ చేసి, జ్యుడిషియల్‌ కస్టడీకి పంపారు. ప్రముఖ ఆడిటింగ్‌ కంపెనీ బ్రహ్మయ్య అండ్‌ కొ భాగస్వామిని అరెస్ట్‌ చేసి, జ్యుడిషియల్‌ కస్టడీకి పంపారు. కంపెనీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయకపోతే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చిట్స్‌ వేస్తున్న చందాదారులను బెదిరించారు. ఎలా ఫిర్యాదు చేయాలో కూడా వారే చెప్పారు.

హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ కార్యాలయంతో పాటు వివిధ ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించి, సమాచార ప్రతులు, డాక్యుమెంట్లు తీసుకున్నారు. ఈ నెల 12న కూడా సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ కార్యాలయానికి వచ్చారు. ఆరోపిత నేరాలకు సంబంధించి రామోజీరావును విచారించాలని సీఐడీ డిమాండ్‌ చేసింది. ఆరోగ్యం సరిగా లేకపోయినప్పటికీ ఆయన అందుకు అంగీకరించి ఏప్రిల్‌ 3న విచారణకు హాజరయ్యారు. మంచంపై ఉన్న రామోజీరావు ఫొటోను సీఐడీ సిబ్బంది తీసుకొని ఏపీ ముఖ్యమంత్రి యాజమాన్యంలో నడుస్తున్న సాక్షి మీడియాకు ఇచ్చారు. దాన్ని వెంటనే ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రసారం చేయడం పూర్తిగా ఆయన వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడమే. సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అయిన రామోజీరావు కోడలు శైలజను కూడా సీఐడీ ఈ నెల 6న విచారించింది. ఆ వెంటనే సీఐడీ మీడియాతో మాట్లాడుతూ రామోజీరావు, శైలజలను అమరావతిలో విచారించాలనుకుంటున్నట్లు ప్రకటించింది.

అందుకే అడ్డగోలు ఆరోపణలు: ఇక్కడ మనీలాండరింగ్‌, నిధుల మళ్లింపు, కార్పొరేట్‌ మోసం, బినామీ లావాదేవీలు, ఆదాయపన్ను ఎగవేత జరుగుతోందని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఫిర్యాదు చేయడానికి రెండు రోజులు దిల్లీలోనే ఉన్నామని ఏపీ సీఐడీ చెప్పుకొంది. ఇంతకు మించిన దారుణమైన ఆరోపణలు ఇంకేమీ ఉండవు.

ఈ మొత్తం వ్యవహారం వెనుక ప్రధాన ఉద్దేశం మార్గదర్శి సంస్థను ఆర్థికంగా దెబ్బతీయడం, యాజమాన్యం, మేనేజ్‌మెంట్‌, సిబ్బందిని బెదిరించడం, చందాదారులను ఆందోళనకు గురిచేయడమేనని స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకోసమే పత్రికా ప్రకటనలో అలాంటి ఆరోపణలు చేశారు. అవన్నీ ఆశ్చర్యచకితుల్ని చేసే కల్పితాలు. మా ప్రయోజనాలను రక్షించుకోవడానికి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం’ అని మార్గదర్శి సంస్థ ఈ ప్రకటనలో పేర్కొంది.

సీఐడీ ఆరోపణలకు మార్గదర్శి సమాధానాలు

* ఆరోపణ: అమల్లో ఉన్న చట్టాలకు విరుద్ధంగా పెద్ద చిట్‌ మొత్తాలను నగదు రూపంలో తీసుకోవడం మనీలాండరింగ్‌ కిందికి వస్తుంది.

సమాధానం: మార్గదర్శి చిట్‌ఫండ్‌ వ్యాపారంలో ఉంది. వ్యాపార లావాదేవీల్లో భాగంగా చందాదారులు చెల్లించే సబ్‌స్రిప్షన్స్‌ను వారికి అనుకూలంగా చెక్కులు, నగదు రూపంలో తీసుకుంటుంది. వారు కూడా క్రమం తప్పకుండా పన్ను చెల్లింపుదారులే కాబట్టి ఇన్‌కం ట్యాక్స్‌ చట్టం నిబంధనలకు కట్టుబడి నడుచుకుంటారు. అందువల్ల ఇది మనీలాండరింగ్‌ అనడం పూర్తిగా అబద్ధం.

* ఆరోపణ: సెక్యూరిటీగానో, లేదంటే వడ్డీ ఇస్తామని చెప్పి చందాదారుల డబ్బు నిరంతరం కంపెనీలో ఉండేలా వారిపై ఒత్తిడి చేయడం, చట్టవిరుద్ధంగా సెక్యూరిటీని స్వీకరించడం.

సమాధానం: చిట్‌ పాడుకున్న తర్వాత వారు తీసుకొనే మొత్తానికి సరిపడా సెక్యూరిటీలు సమర్పించలేని చందాదారులు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసినప్పుడు అలాంటి కేసుల్లో భవిష్యత్తులో చెల్లించాల్సిన వాయిదాలకు సంబంధించిన మొత్తాన్ని మాత్రమే మేం సెక్యూరిటీగా పరిగణనలోకి తీసుకుంటున్నాం. అప్పటి వరకు చిట్‌ పాడుకోని చందాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ చర్య తీసుకుంటున్నాం. అందువల్ల డిపాజిట్లు స్వీకరించడం అన్నదే ఉత్పన్నం కాదు. ఈ ఆరోపణ పూర్తిగా అబద్ధం, కుట్రపూరితం, బురదచల్లే వ్యవహారం. చిట్‌ఫండ్‌ కార్యకలాపాలు చిట్‌ఫండ్‌ యాక్ట్‌ పరిధిలోకి, ఆర్‌బీఐ జారీ చేసిన మిసిలేనియస్‌ నాన్‌ బ్యాంకింగ్‌ కంపెనీ డైరెక్షన్స్‌ పరిధిలోకి వస్తాయి.

* ఆరోపణ: బ్రాంచ్‌ల స్థాయిలో చేతిలో చెక్కులు, నగదు ఉన్నాయన్న పేరుతో నగదు నిల్వలను పెంచి చూపడం.

సమాధానం: చిట్‌ఫండ్‌, ఇన్సూరెన్స్‌ వ్యాపారంలో ఉన్న కంపెనీలకు చివరి రోజుల్లో చెక్కులు రావడం అన్నది సర్వసాధారణం. సహజంగానే అవి తదుపరి నెలలో బ్యాంకులకు సమర్పించిన తర్వాత నగదుగా మారతాయి. రిజిస్ట్రార్లు, స్థానిక పోలీసులకు ఎన్నోసార్లు దీనిపై వివరణ ఇచ్చినప్పటికీ వారు అర్థం చేసుకోవడానికి సుముఖత చూపకుండా అదే ఆరోపణలను పునరుద్ఘాటిస్తున్నారు. చేతుల్లో ఉన్నట్లు చూపిన రూ.254.90 కోట్ల చెక్కుల్లో రూ.211.54 కోట్ల చెక్కులు తక్షణం తదుపరి నెలలోనే వసూలయ్యాయి. మిగిలినవి చెక్కు ఎప్పుడు పంపితే అప్పుడు వసూలయ్యాయి.

* ఆరోపణ: చిట్‌ఫండ్‌ చట్ట ప్రకారం బ్రాంచి స్థాయిలో కానీ, రాష్ట్రస్థాయిలోని రిజిస్ట్రార్‌ ఆఫ్‌ చిట్స్‌ వద్ద కానీ బ్యాలెన్స్‌ షీట్లు, అకౌంట్లు దాఖలు చేయలేదు.

సమాధానం: ఇది పచ్చి అబద్ధం. కంపెనీ ఏటా క్రమం తప్పకుండా బ్యాలెన్స్‌షీట్లు సమర్పిస్తోంది. చిట్‌ఫండ్‌ చట్టం కింద అవసరమైన మరింత సమాచారం ఉన్న ఆడిటెడ్‌ ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్లను ఇచ్చాం. వారు తనిఖీలు మొదలుపెట్టిన నాటి నుంచే వివరణ కూడా ఇచ్చాం. వారు తాజా వేధింపులకు దిగేవరకూ ఏ రిజిస్ట్రార్‌ నుంచి దీనిపై ఎలాంటి ఫిర్యాదూ రాలేదని స్పష్టంగా చెబుతున్నాం.

* ఆరోపణ: ఎక్కువ నష్టభయం ఉన్న స్టాక్‌మార్కెట్‌ స్పెక్యులేషన్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ లాంటి వాటికి మార్గదర్శి గ్రూప్‌ చందాదారుల డబ్బును మళ్లిస్తోంది.

సమాధానం: ఇది పూర్తిగా నిరాధారం. చందాదారులను రక్షించే ముసుగులో, దురుద్దేశపూరితమైన ఆలోచనలతో వాళ్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. చిట్‌ఫండ్‌ చట్టం-1982లోని సెక్షన్‌ 14 కింద పొందుపరిచిన నిబంధనల ప్రకారం తమకు వచ్చే కమీషన్‌, ఇతర ఆదాయాన్ని ఎక్కడైనా పెట్టుబడి పెట్టే అధికారం కంపెనీకి ఉంది.

* ఆరోపణ: బ్యాలెన్స్‌ షీట్‌ను విండో డ్రెసింగ్‌ చేయడం, సరైన సమాచారం సమర్పించకుండా మార్గదర్శి గ్రూప్‌ తన బుక్కులు, ఖాతాలను ఫడ్జింగ్‌ చేస్తోంది.

సమాధానం: పద్ధతులు, వ్యాపార కార్యకలాపాలను వ్యవస్థీకృతం చేసిన 60 ఏళ్ల కంపెనీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి దుర్బుద్ధితో చేసిన ఆరోపణలు ఇవి. తన ఖాతా పుస్తకాల ప్రజెంటేషన్‌లో కంపెనీ ఎప్పుడూ అలాంటి తప్పుడు, చట్టవిరుద్ధమైన విధానాలకు పాల్పడలేదు. ఆమోదిత అకౌంటింగ్‌ సూత్రాల ప్రకారం ఇన్నేళ్లలో ప్రతిదాన్నీ పారదర్శకంగా చూపుతూ వస్తోంది. గత 60 ఏళ్లుగా ఎలాంటి మచ్చలేకుండా, సంపూర్ణమైన ఆర్థిక బలంతో నడుస్తున్న కంపెనీ ప్రతిష్ఠను దెబ్బతీయాలన్న ఏకైక లక్ష్యంతో ప్రభుత్వ అధికారులు రోజూ ఒక కల్పిత కథను తయారుచేయడంలో మునిగిపోయారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.