ETV Bharat / bharat

మహువాకు ఎదురుదెబ్బ- లోక్​సభ నుంచి బహిష్కరణకు ఎథిక్స్ కమిటీ సిఫార్సు- గెలిచి మళ్లీ వస్తానని ఎంపీ ధీమా

author img

By PTI

Published : Nov 9, 2023, 6:47 PM IST

Updated : Nov 10, 2023, 7:05 AM IST

Mahua Moitra Cash For Question : డబ్బులు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వం రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమెను లోక్‌సభ నుంచి బహిష్కరించాలంటూ ఎథిక్స్​ కమిటీ సిఫార్సు చేసింది. అయితే, తనను బహిష్కరించినా.. భారీ మెజారిటీతో గెలిచి మళ్లీ పార్లమెంట్​లో అడుగుపెడతానని మహువా మొయిత్రా ధీమా వ్యక్తం చేశారు.

mahua moitra cash for question
mahua moitra cash for question

Mahua Moitra Cash For Question : ప్రశ్నలకు ముడుపుల వ్యవహారంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని ఎథిక్స్‌ కమిటీ సిఫార్సు చేసింది. బీజేపీ ఎంపీ వినోద్‌ కుమార్ సోంకర్‌ నేతృత్వంలో గురువారం సమావేశమైన కమిటీ.. బహిష్కరణకు సిఫార్సు చేస్తూ రూపొందించిన ముసాయిదా నివేదికను ఆమోదించింది. ఈ కమిటీలో మొత్తం 10 మంది సభ్యులు ఉండగా.. ఆరుగురు మహువాను బహిష్కరించాలన్న ప్రతిపాదనను సమర్థించారని సమావేశం తర్వాత వినోద్‌ కుమార్‌ తెలిపారు. నలుగురు సభ్యులు వ్యతిరేకించారని వివరించారు.

6-4 తేడాతో కమిటీ ఆమోదించిన నివేదికను తదుపరి చర్యల కోసం లోక్‌సభ స్పీకర్‌కు పంపనున్నారు. అదానీ గ్రూప్, ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందని నుంచి ముడుపులు స్వీకరించినట్లు TMC ఎంపీ మహువా మొయిత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఈ ఆరోపణలు చేయగా.. విచారణ అనంతరం ఎథిక్స్‌ కమిటీ తృణమూల్‌ ఎంపీని బహిష్కరించాలని స్పీకర్‌కు సిఫార్సు చేసింది.

మహువా ఫైర్​..
తనను లోక్​సభ నుంచి బహిష్కరించాలని ఎథిక్స్ కమిటీ నిర్ణయించడంపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మండిపడ్డారు. లోక్​సభ బహిష్కరణ సిఫార్సును పెద్ద మనుషుల పంచాయతీ( కంగారూ కోర్టు) ముందుగానే నిర్ణయించుకుని ఇచ్చిన తీర్పుగా అభివర్ణించారు. ఇలాంటి ఘటనలు భారత దేశానికి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మరణంతో సమానమని వ్యాఖ్యానించారు. ఈ పరిణామం తనకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదన్నారు. పార్లమెంటు నుంచి తనను బహిష్కరిస్తే.. వచ్చేఎన్నికల్లో పెద్ద మెజారిటీతో తిరిగి లోక్​సభలో అడుగుపెడతానని ధీమా వ్యక్తం చేశారు. నివేదికలోని అంశాలు కమిటీ ఆమోదానికి ముందే మీడియాలో రావడంపై మహువా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని లోక్ సభ స్పీకర్​కు లేఖ రాశారు.

'ఆరోపణలు రుజువు కాకముందే చర్యలా?'
మరోవైపు ఎంపీ మహువా మొయిత్రాకు అండగా ఉంటామని టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ తెలిపారు. ఎన్‌డీఏ సర్కార్​ను ఎవరైనా ప్రశ్నిస్తే వారిని వేధిస్తోందని మండిపడ్డారు. మహువాను లోక్​సభ నుంచి బహిష్కరించాలని ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేయడం ప్రతీకార రాజకీయమని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసేవారి గొంతులను అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. మొయిత్రాపై ఆరోపణలు రుజువు కాకముందే పార్లమెంటరీ ఎథిక్స్​ కమిటీ ఆమెపై ఎలా చర్య తీసుకుంటుందని ప్రశ్నించారు. అదానీ అంశంపై కేంద్రాన్ని ఎవరూ ప్రశ్నించినా వేధింపులకు గురవుతున్నారని అన్నారు. మొయిత్రా తనను తాను రక్షించుకోగల పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని అభిషేక్ బెనర్జీ తెలిపారు.

'పరువు నష్టం కలిగేలా ప్రశ్నలు- వస్త్రాపహరణ చేశారు' ఎంపీ మహువా​ సంచలన ఆరోపణలు

'ప్రశ్నకు నోటు కేసు విచారణలో వ్యక్తిగత విషయాలెందుకు?' భేటీ నుంచి మహువా, విపక్ష ఎంపీల వాకౌట్

Last Updated :Nov 10, 2023, 7:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.