ETV Bharat / bharat

'జాతీయాంశంగా 'ఉమ్మడి పౌరస్మృతి'.. త్వరలోనే అన్ని రాష్ట్రాల్లో అమలు'

author img

By

Published : Nov 27, 2022, 6:42 PM IST

ఉమ్మడి పౌరస్మృతి.. జాతీయాంశం అని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. దీన్ని వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. గుజరాత్​ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్​, ఆప్​ బడ్జెట్​తో సంబంధం లేకుండా ఎన్నికల హామీలను ప్రకటిస్తున్నాయని ఆరోపించారు.

bjp chief jp nadda in gujarat election
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

2024 సార్వత్రిక ఎన్నికలు ముందే దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్​ కోడ్​ను అమలు చేయడానికి భాజపా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. ఈ ఉమ్మడి పౌరస్మృతినే హిమాచల్​ప్రదేశ్​, గుజరాత్​ ఎన్నికల్ల మేనిఫెస్టోల్లో ఆ పార్టీ ప్రస్తావించింది. ఈ రెండు రాష్ట్రాల్లో భాజపా అధికారంలోకి వస్తే యూసీసీని తప్పని సరిగా అమలు చేస్తామని హామీ ఇచ్చింది. గుజరాత్​​లోని అహ్మదాబాద్​లో ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జేపీ నడ్డా యూనిఫాం సివిల్​ కోడ్​ అన్నది జాతీయ అంశం అని అన్నారు. దీన్ని వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. యాంటీ రాడికలైజేషన్​ సెల్ ఏర్పాటు వేర్వేరు భాజపా మేనిఫెస్టోలోని వేర్వేరు హామీల్ని సమర్థించుకున్నారు.

'ఉమ్మడి పౌరస్మృతి అనేది జాతీయ అంశం.. దేశంలోని వనరులు ప్రజలందరికీ సమానం. అందువల్ల యూసీసీ అన్నది దేశవ్యాప్తంగా స్వాగతించదగిన చర్య. దీన్ని వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో అమలు చేయాలనుకుంటున్నాము. సమాజానికి వ్యతిరేకంగా పనిచేసే దుష్టశక్తులను అదుపుచేయడం దేశం బాధ్యత. మానవ శరీరంలో యాంటీబాడీలు పనిచేసే విధంగా.. సంఘ వ్యతిరేక శక్తులను నియంత్రించడం దేశ బాధ్యత. కొందరు అజ్ఞాతంలో ఉండి దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. వారిని అదుపు చేయడం కోసం యాంటీ-రాడికలైజేషన్​​ సెల్​ అవసరం.'
--జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

గుజరాత్​లో ఒక్క ముస్లిం అభ్యర్థినీ ఎన్నికల్లో నిలబెట్టకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్న విషయంపై నడ్డా స్పందించారు. తమ ప్రభుత్వం దేశ ప్రజలందరికీ సమన్యాయం చేయడం కోసం 'సబ్కా సాత్.. సబ్కా వికాస్' సూత్రాన్ని అమలుచేస్తోందని అన్నారు. దివంగత డాక్టర్​ అబ్దుల్​ కలాం భాజపా మద్దతుతోనే రాష్ట్రపతి అయ్యారని గుర్తు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన భాజపా చాలామంది ముస్లింలను వివిధ రాష్ట్రాలకు గవర్నర్​లుగా నియమించిందని వివరించారు. కాంగ్రెస్​, ఆమ్​ ఆద్మీ పార్టీలకు గుజరాత్​లో అధికారంలోకి రాలేమని ముందుగానే తెలుసని.. అందుకే ఆ పార్టీలు నిధులు, బడ్జెట్​తో సంబంధం లేకుండా ఉచితాలను ప్రకటిస్తున్నాయని మండిపడ్డారు నడ్డా. ప్రజలు సాధికారత, ఆకర్షణల మధ్య తేడాను గుర్తించాలని సూచించారు. భాజపా అందించే పథకాలు ఉచితాలు కావని, అవి ప్రజల్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాయని అన్నారు. ఈ హామీలు దేశ ఆర్థిక వ్యవస్థకు సహకారం అందిస్తాయని తెలిపారు. మోదీ ప్రజలందరి హృదయాల్లో ఉన్నందున.. గుజరాత్​లో మరోసారి భాజపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు జేపీ నడ్డా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.