ETV Bharat / bharat

సరిహద్దు వద్ద భారత్​ అప్రమత్తం.. 'సుఖోయ్‌' బలోపేతంతో శత్రుదేశాల్లో కలవరం!

author img

By

Published : Jan 9, 2023, 2:03 PM IST

india developed sukoi 30 mki fighter jet
సుఖోయ్‌ 30 mki

సరిహద్దుల్లో ముప్పు పొంచి ఉన్న వేళ ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత వైమానిక దళం నిరంతరం అప్రమత్తంగా ఉంటోంది. చైనా కవ్వింపులను, పాక్‌ నిబంధనల ఉల్లంఘనలను దృష్టిలో ఉంచుకుని తన బలాన్ని మరింత పెంచుకుంటోంది. సుఖోయ్‌ 30 యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్‌, అస్త్ర క్షిపణుల ప్రయోగం.. శత్రు దేశాలతో పోలిస్తే గగనతలంలో భారత్‌ను దుర్భేధ్యంగా నిలబెడుతోంది.

సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్‌ కవ్వింపుల నేపథ్యంలో వైమానిక దళాన్ని భారత్‌ మరింత పటిష్టంగా మారుస్తోంది. తన బ్రహ్మాస్త్రాలకు పదును పెడుతూ.. సరిహద్దు ఆవలి దేశాలకు సవాల్‌ విసురుతోంది. స్వదేశీగా తయారుచేసిన బ్రహ్మోస్ సూపర్‌ సోనిక్ క్రూయిజ్ క్షిపణి, అస్త్ర క్షిపణులను సుఖోయ్‌ 30MKI యుద్ధ విమానాల నుంచి ప్రయోగించేలా అభివృద్ధి చేయడం.. గగనతలంలో భారత బలాన్ని మరింత పెంచింది.ఈ విశిష్టతే..చైనా, పాక్‌ యుద్ధ విమానాల కంటే భారత సుఖోయ్‌ 30 విమానాన్ని ప్రత్యేకంగా నిలుపుతోందని సుఖోయ్‌ 30MKI ఫైటర్ పైలట్ గ్రూప్ కెప్టెన్ అర్పిత్ కాలా వెల్లడించారు.

భారత్ వద్ద ఉన్న సుఖోయ్‌ ఎంకేఐ యుద్ధ విమానాలు.. ప్రపంచంలోని ఇతర యుద్ధ విమానాలతో పోలిస్తే చాలా భిన్నమైనవి. ఈ విమానం నుంచి దీర్ఘ శ్రేణి క్షిపణులను ప్రయోగించవచ్చు. గగనతలం నుంచి గగనతలానికి, గగనతలం నుంచి భూమిపైకి బ్రహ్మోస్‌, అస్త్ర క్షిపణులను ప్రయోగించవచ్చు. ఇదే ఈ విమానాలను ప్రత్యేకంగా నిలుపుతాయి. ఇది ప్రపంచంలోని అత్యుత్తమ విమానాలలో ఒకటి.

చైనా, రష్యా, అర్మేనియా, ఇండోనేషియా, అల్జీరియా సహా.. దాదాపు 15 దేశాల వద్ద సుఖోయ్‌ 30 యుద్ధ విమానాలు ఉన్నాయి. కానీ వీటిలో ఏ దేశానికి లేని ప్రత్యేకత భారత్‌ దగ్గర ఉన్న సుఖోయ్‌ యుద్ధ విమానాలకు ఉంది. బ్రహ్మోస్‌, అస్త్ర క్షిపణులే అందుకు కారణం. ఈ విమానాల నుంచి కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగల క్షిపణులను గగనతలం నుంచి గగనతలంలోకి.... గగనతలం నుంచి భూమిపైకి ప్రయోగించవచ్చని అర్పిత్‌ కాలా వెల్లడించారు. భారత వైమానిక దళం వద్ద సుమారు 272 సుఖోయ్‌ యుద్ధ విమానాలు ఉన్నట్లు సమాచారం. భారత్‌ వద్ద ఉన్న సుఖోయ్‌ SU 30 MKI యుద్ధ విమానాలు.. అత్యుత్తమ సాంకేతికత, ఆధునిక ఆయుధాలను కలిగి ఉండడం వల్ల ఇవి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకమైనవని అర్పిత్‌ కాలా వెల్లడించారు.

ఇండియన్ సుఖోయ్‌ యుద్ధ విమానాలు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యుద్ధ విమానాలతో పోలిస్తే చాలా భిన్నమైవని అర్పిత్‌ కాలా తెలిపారు. భారత్‌ వద్ద ఉన్న సుఖోయ్‌ యుద్ధ విమానం నుంచి.. బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ప్రయోగిస్తే అది 700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలుగుతుందని వివరించారు. అస్త్రా క్షిపణి 11 వందల కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగలదని అర్పిత్‌ కాలా వెల్లడించారు. వీటి పరిధిని మరింత పెంచేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.