శ్రద్ధ హత్య కేసులో మరిన్ని అధారాలు.. నార్కో టెస్టుకు ముందే పాలిగ్రాఫ్‌!

author img

By

Published : Nov 21, 2022, 8:41 PM IST

Shraddha walkar murder case

సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో దవడ ఎముక సహా మరికొన్ని మానవ అవశేషాలను దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. వాటిని ఫోరెన్సిక్‌కు పంపాయి. ఛత్రపూర్‌లోని ఓ చెరువులో శ్రద్ధా తల భాగాన్ని అఫ్తాబ్‌ విసిరినట్లు సమాచారం అందింది. మరోవైపు నిందితుడు అఫ్తాబ్‌కు నార్కో టెస్టు కంటే ముందు ఫాలిగ్రాఫ్‌ టెస్టు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు కోర్టుకు దరఖాస్తు చేశారు.

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో కీలక సాక్ష్యాలు దర్యాప్తు సంస్థలకు లభించాయి. అఫ్తాబ్‌ పూనావాలాను విచారించే కొద్దీ కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. దర్యాప్తు అధికారులు ఒక దవడ ఎముక, మరికొన్ని మానవ అవశేషాలను ఒక ప్రదేశం నుంచి వెలికి తీశారు. వాటిని ఒక డెంటిస్ట్‌కు చూపించి అవి 27 ఏళ్ల వయసున్న యువతికి చెందినవేనా అని ఆరా తీశారు. దీనిపై మరింత సమాచారం కావాలని దంతవైద్యుడు అడిగినట్లు తెలుస్తోంది.

ఛత్రపూర్‌లోని మైదాన్‌ ఘర్‌లోని ఉన్న ఓ పెద్ద చెరువులో నీటిని కూడా పూర్తిగా తోడేసి పోలీసులు వెతికేందుకు యత్నించారు. శ్రద్ధ తల భాగాన్ని అఫ్తాబ్‌ ఇక్కడి చెరువులో విసిరినట్లు సమాచారం లభించినందున ఈ ప్రయత్నాలు చేశారు. కానీ, ఇది కష్టతరం కావడం వల్ల.. గజ ఈతగాళ్లను తెప్పించి నీటిలో గాలించాలని నిర్ణయించారు.

శ్రద్ధాను హత్య చేసిన కొన్ని వారాల తర్వాత ఆఫ్తాబ్‌ ముంబయి నుంచి సామగ్రిని దిల్లీకి చేర్చాడు. దాదాపు 37 బాక్సుల్లో పాల్ఘర్‌లోని ఇంటి వస్తువులను గుడ్‌లక్‌ ప్యాకర్స్‌ ద్వారా వీటిని తరలించారు. దీనికి అతడు రూ.20 వేలు చెల్లించినట్లు పోలీసులు తెలిపారు. మరో వైపు శ్రద్ధ హత్య వెలుగులోకి రావడానికి 15 రోజుల ముందే అఫ్తాబ్‌ కుటుంబం పాల్ఘర్‌లోని ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయింది.

అఫ్తాబ్‌కు ఫోరెన్సిక్‌ సైన్స్‌ పరిశోధనశాల ..ఎఫ్​ఎస్​ఎల్ లో సోమవారం నార్కో టెస్టు నిర్వహించలేదు. నార్కో టెస్టు కంటే ముందు పాలిగ్రాఫ్‌ టెస్టును అఫ్తాబ్‌కు నిర్వహించాలని భావిస్తున్నారు. నార్కో టెస్టుకు అఫ్తాబ్‌ అనుమతి కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు పోలీసులు అతడికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు అఫ్తాబ్‌కు పాలిగ్రాఫ్‌ టెస్టు కోసం పోలీసులు కోర్టు అనుమతి కోరుతూ దరఖాస్తు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.