ETV Bharat / bharat

Pawan Comments: విపక్షాలు వస్తే గానీ ధాన్యం కొనరా?.. రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాడతాం: పవన్​

author img

By

Published : May 11, 2023, 6:48 AM IST

Pawan Kalyan Tour: అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ పరిశీలించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన.. పంటలను పరిశీలించి, రైతులకు భరోసా ఇచ్చారు.

Pawan Kalyan Tour
Pawan Kalyan Tour

విపక్షాలు వస్తే గానీ ధాన్యం కొనరా?.. రైతుకు న్యాయం జరిగే వరకూ పోరాడతాం

Pawan Kalyan Tour: అకాల వర్షాలకు తడిసిన ప్రతి గింజ ప్రభుత్వం కొనే వరకు పోరాడతామని పవన్‌ కల్యాణ్ ప్రకటించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించి, అండగా ఉంటామని రైతులకు భరోసా ఇచ్చారు. విపక్షాలు గళమెత్తితే తప్ప ప్రభుత్వంలో చలనం లేదని, తాము పర్యటనకొస్తే హడావుడిగా ధాన్యం కొంటున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు లేని గోనె సంచులు.. రాత్రికి రాత్రి ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.

అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రైతులను.. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ పరామర్శించారు. రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం కడియం ఆవ వద్ద... వర్షాలకు దెబ్బతిన్న ధాన్యాన్ని పవన్ పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల వర్షాలకు తడిసిపోయి.. తీవ్రంగా నష్టపోయామని రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. తేమ శాతం పేరిట మిల్లర్లు దోచుకుంటున్నారని.. ఎదురు డబ్బులు కడితేనే ధాన్యం లోడు దించుతున్నారని పవన్‌ దృష్టికి తెచ్చారు. ధాన్యం నింపేందుకు చిరిగిన గోతాలు ఇస్తున్నారని వాపోయారు. ఆవ డ్రైయిన్‌లో నీరు దిగువకు కదలడం లేదని... కనీసం గుర్రపు డెక్క కూడా తీయకపోవడం వల్ల పొలాలను ముంచేస్తోందని పవన్​ కల్యాణ్​కు రైతులు వివరించారు.

"మేము దొంగతనాలు చేయట్లేదు. దోపిడీలు చేయట్లేదు. కాంట్రాక్ట్స్​లో అవినీతి చేయడం లేదు. కష్టపడి, చెమట్చోడి ప్రజలకు అన్నం పెట్టే తమను ప్రభుత్వం ఆదుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే ప్రభుత్వం పంటను కొనుగోలు చేస్తే అకాల వర్షాల వల్ల నష్టపోవాల్సిన పరిస్థితి రాకపోయేదని తమ బాధను మాకు చెప్తున్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వం కూడా కేవలం ప్రతిపక్ష పార్టీలు వస్తేనే ధాన్యం కొనుగోలు చేయడం చేస్తున్నారు. అలాకాకుండా నష్టపోయిన ప్రతీ రైతు పంటను కొనుగోలు చేయాలి. అలాగే రైతులందరికి జనసేన పార్టీ అండగా ఉంటుంది. రైతుకు గిట్టుబాటు ధర కల్పించేవరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం"-పవనకల్యాణ్​, జనసేన అధినేత

ఆ తర్వాత కోనసీమలోని కొత్తపేట నియోజకవర్గం అవిడిలో పవన్‌ పర్యటించారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే తప్ప ధాన్యం కొనడానికి ప్రభుత్వం ముందుకు రాలేదని విమర్శించారు. ఆఖరి గింజ వరకు కొనడంతో పాటు నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం ఆదుకునే వరకూ పోరాడతామని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత పి.గన్నవరం మండలం రాజులపాలెం చేరుకొనేసరికే రాత్రి కావడంతో.... స్థానికులకు అభివాదం చేసి పవన్ వెనుదిరిగారు. అక్కడి నుంచి రాజమహేంద్రవరం వెళ్లి బస చేశారు. వర్షాలకు నష్టోపోయిన రైతులతో నేడు పార్టీ కార్యాలయంలో పవన్‌ ముఖాముఖి మాట్లాడనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.