IT Raids in Telangana : తెలుగు రాష్ట్రాల్లో.. కొనసాగుతున్న ఐటీ సోదాలు

author img

By

Published : May 24, 2023, 11:17 AM IST

Updated : May 24, 2023, 8:29 PM IST

IT Raids

IT Raids in Telangana : తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో పలుచోట్ల సుమారు 50కి పైగా బృందాలు, విశాఖలో 15 ఐటీ బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. ఓ స్థిరాస్తి సంస్థకు చెందిన డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. తెలంగాణ, ఒడిశాకు చెందిన ఐటీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు.

IT Raids in Telangana Today : తెెలుగు రాష్ట్రాల్లో మరోసారి కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు అలజడి రేపుతున్నాయి. ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ సోదాలతో.. ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్​లో కలకలం రేగుతోంది. ఈ క్రమంలోనే నగరంలోని పలు స్థిరాస్తి సంస్థలపై ఆదాయపన్ను శాఖ భారీ ఎత్తున దాడులు చేస్తోంది. కె.ఎం.కోహినూర్‌ గ్రూపు స్థిరాస్తి సంస్థతోపాటు.. ఏడు రియల్‌ఎస్టేట్‌ సంస్థల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

ఉదయం 7 గంటల ప్రాంతంలో ఏకకాలంలో మొదలైన ఈ సోదాల్లో.. 50కిపైగా ఐటీ బృందాలు పాల్గొన్నట్లు ఆదాయపన్ను శాఖ వర్గాలు వెల్లడించాయి. స్థానిక పోలీసులతో సంబంధం లేకుండా.. పూర్తిగా కేంద్ర బలగాల బందోబస్తు మధ్య దాడులు కొనసాగుతున్నాయి. కె.ఎం. కోహినూర్‌ గ్రూపు స్థిరాస్తి సంస్థతో అనుబంధం కలిగిన.. మరో ఏడు రియల్ఎస్టేట్‌ సంస్థల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఫలక్‌నుమా ప్రాంతంలోని కింగ్స్ గ్రూప్ యజమాని షా నవాజ్ ఇంటిపై.. పాతబస్తీ, బండ్లగూడ, మొయిన్‌బాగ్ ప్రాంతాల్లోని ఆర్ఆర్‌గ్రూప్ కార్యాలయాల్లో ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. ఏజే ప్రాజెక్టు ఇన్‌ఫ్రా, క్రిస్టల్‌ మెన్షన్‌.. కాకతీయ మెన్షన్‌, శిల్పా ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ తదితర సంస్థలకు.. చెందిన కార్యాలయాలు, మేనేజింగ్‌ డైరెక్టర్లు, సీఈవోల ఇళ్లలోనూ సోదాలు జరుపుతున్నారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఈ సోదాల్లో.. తెలంగాణ, ఒడిశాలకు చెందిన ఆదాయపన్ను శాఖ అధికారులు.. ఈ తనిఖీల్లో పాల్గొన్నట్లు ఐటీ వర్గాలు తెలిపాయి.

చెల్లిస్తున్న పన్నులకు.. ఆ వ్యాపారాలకు భారీగా వ్యత్యాసం : ఈ క్రమంలోనే ఆయా సంస్థలు చెల్లిస్తున్న పన్నులకు.. ఆ వ్యాపారాలకు భారీగా వ్యత్యాసం ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు కేసులు నమోదు చేసి సోదాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు పలు సంస్థల నుంచి విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. దాడుల్లో పాల్గొనే అధికారులకు కూడా వివరాలు తెలియకుండా సీల్డ్‌ కవర్లు అందచేసి.. వాటిని నిర్దేశించిన చిరునామాకు వెళ్లిన తర్వాత.. ఓపెన్‌ చేసేలా ఐటీ సోదాల విభాగం అదనపు సంచాలకులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే మాదన్నపేట్, శాస్త్రిపురం, బంజారాహిల్స్‌లో తనిఖీలు జరుపుతున్నారు. ఉదయం నుంచే శంషాబాద్, అత్తాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు చేపట్టారు.

విశాఖలోని పలు ఫార్మా సంస్థలపై ఐటీ దాడులు : మరోవైపు ఏపీలోని విశాఖలోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. నగరంలోని పదికి పైగా ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఈ తనిఖీల్లో 15 ఐటీ బృందాలు పాల్గొన్నాయి. పలు ఫార్మా సంస్థలతో పాటు ఆయా కంపెనీల డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయపన్ను చెల్లింపుల విషయంలో అవకతవకలు జరిగాయన్న అనుమానంతో సోదాలు చేస్తున్న అధికారులు తెలిపారు.

సాహితి సంస్థపై ఈడీ సోదాలు : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ దర్యాప్తు సంస్థలు నగరంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. స్థిరాస్త సంస్థలు, ఫార్మా కంపెనీలపై ఒక వైపు ఈడీ దాడులు, మరోవైపు ఐటీ సోదాలు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఇదిలా ఉంటే మంగళవారం నగరంలో ఉన్న ప్రీ లాంచింగ్‌ ఆఫర్‌ పేరుతో ప్రజల నుంచి పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేసి మోసానికి పాల్పడుతుందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సాహితి సంస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సోదాలు జరిపింది. భారీగా నిధులను మళ్లించిందని దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కీలక పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సంస్థలో ఒక డైరెక్టర్‌ ఏకంగా రూ.100 కోట్లను దారిమళ్లించినట్లు తెలిసింది. దానికి సంబంధించిన ఆధారాలూ సోదాల్లో లభించడంతో ఈడీ పట్టు బిగిస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated :May 24, 2023, 8:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.