ETV Bharat / bharat

'ఫేక్​ ఎన్​కౌంటర్​ కేసులో మోదీ పేరు చెప్పమన్నారు'.. కాంగ్రెస్​పై అమిత్ షా సంచలన ఆరోపణలు

author img

By

Published : Mar 30, 2023, 1:27 PM IST

Updated : Mar 30, 2023, 2:03 PM IST

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో మోదీని ఇరికించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ మోదీ పేరు చెప్పాలంటూ.. తనపై ఒత్తిడి తెచ్చిందని అమిత్‌ షా ఆరోపించారు. రాహుల్‌ గాంధీ అనర్హత వేటుపైనా స్పందించిన షా.. ఎంపీగా కొనసాగాలనుకుంటున్న వ్యక్తి దానిపై పైకోర్టుకు ఎందుకు వెళ్లరని ప్రశ్నించారు.

amit shah on rahul gandhi
amit shah on rahul gandhi

ఫేక్​ ఎన్​కౌంటర్​ కేసులో నిందితుడిగా నరేంద్ర మోదీ పేరు చెప్పాలని.. కాంగ్రెస్​ హయాంలో CBI తనపై ఒత్తిడి తెచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి మోదీని ఇరికించాలని CBI తనపై ఒత్తిడి తెచ్చిందన్న అమిత్‌ షా.. అయినా దానిపై బీజేపీ ఎప్పుడూ నోరు విప్పలేదని గుర్తు చేశారు. క్రిమినల్‌ పరువు నష్టం కేసులో లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన రాహుల్‌ గాంధీ.. పై కోర్టుకు వెళ్లే బదులు మోదీపై నిందలు మోపుతున్నారని అమిత్‌ షా మండిపడ్డారు. మోదీపై నిందలు మోపే బదులు.. పరువు నష్టం దావా కేసుపై చట్టపరంగా పోరాడాలని హితవు పలికారు. ఎంపీగా కొనసాగాలనుకుంటున్న వ్యక్తి.. దానిపై కోర్టుకు ఎందుకు వెళ్లరని అమిత్ షా ప్రశ్నించారు. ఓ ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న షా.. ఈ ఆరోపణలు చేశారు.

లాలూ ప్రసాద్ యాదవ్‌, జయలలిత, రషీద్ అల్వీ సహా 17 మంది ప్రముఖ నేతలు.. దోషీగా తేలిన తర్వాత చట్టసభల సభ్యత్వాన్ని కోల్పోయారని అమిత్‌ షా గుర్తు చేశారు. అయినా వారెవ్వరూ నల్ల వస్త్రాలు ధరించి నిరసన వ్యక్తం చేయలేదని అమిత్‌ షా గుర్తు చేశారు. కోర్టులో దోషిగా తేలిన తర్వాత పదవి కోల్పోయిన తొలి వ్యక్తి రాహుల్‌ కాదని స్పష్టం చేశారు. రాహుల్‌ ఉంటున్న బంగ్లా ఖాళీ చేయించడంపై స్పందించిన షా.. రాహుల్‌కు ప్రత్యేక అనుకూలత ఎందుకని ప్రశ్నించారు. గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి ప్రమాదంలో పడ్డప్పుడే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందా అని అమిత్ షా ప్రశ్నించారు.

దేశంలో చట్టం చాలా స్పష్టంగా ఉందన్న అమిత్‌ షా.. ప్రతీకార రాజకీయాల ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతలపై దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రి ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో.. తాము ఎప్పుడూ దర్యాప్తు సంస్థలను నిందించలేదని గుర్తు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందన్నారు. తమ హయాంలో ED లక్షా పది వేల కోట్ల ఆస్తులు జప్తు చేసిందని.. ఇందులో రాజకీయ నేతలకు చెందినది ఐదు శాతం కూడా లేదని స్పష్టం చేశారు. అవినీతిపై పోరాటాన్ని ఆపేద్దామా.. అని అమిత్‌షా ప్రశ్నించారు. నిందితుడు రాజకీయ నాయకుడైతే చర్యలు తీసుకోకూడదా అని నిలదీశారు.

ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రతి మూడు నెలలకోసారి పంజాబ్ ముఖ్యమంత్రిని కలుస్తానన్న అమిత్‌ షా.. దేశ భద్రత విషయంలో భగవంత్‌ మాన్‌కు అండగా ఉంటామని తెలిపారు. అమృత్​పాల్​ కేసుకు సంబంధించి పలువురిని అరెస్టు చేశామన్న షా.. పోలీసులు, నిఘా వర్గాలు ఈ కేసుపై కసరత్తు చేస్తున్నాయని తెలిపారు. న్యాయవ్యవస్థ, కేంద్రానికి మధ్య ఎలాంటి ఘర్షణలు లేవని హోంమంత్రి స్పష్టం చేశారు.

ఇవీ చదవండి : 'రాహుల్​ గాంధీని బ్రిటన్​ కోర్టుకు లాగుతా'.. లలిత్ మోదీ తీవ్ర విమర్శలు

చనిపోయిన రైతుకు లోన్​.. డబ్బులివ్వకుండానే రుణం కట్టాలంటూ నోటీసులు

Last Updated : Mar 30, 2023, 2:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.