ETV Bharat / bharat

విజయంపై డౌట్.. హిమాచల్​లో 'ప్లాన్​-బి'తో భాజపా రెడీ!

author img

By

Published : Dec 7, 2022, 5:12 PM IST

Updated : Dec 7, 2022, 6:01 PM IST

గుజరాత్​లో భాజపాదే పీఠమని అంచనా వేసిన ఎగ్జిట్​పోల్స్.. హిమాచల్​ ప్రదేశ్​లో మాత్రం కమలదళం, కాంగ్రెస్​ మధ్య హోరాహోరీ పోటీ ఉందని తెలిపింది. దీంతో అధికార భాజపా రాష్ట్రంలో అప్పుడే ప్లాన్​-బి మొదలుపెట్టిందని సమాచారం. స్వతంత్ర అభ్యర్థులు, రెబల్స్​తో విస్తృత చర్చలు జరుపుతున్నట్లు, వారి విశ్వాసాన్ని పొందేందుకు రాష్ట్ర నేతలు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

Himachal Pradesh Elections 2022 Results and bjp working on plan b in himachal mission
Himachal Pradesh Elections 2022 Results and bjp working on plan b in himachal mission

Himachal Pradesh Elections 2022 Results: ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాలను మార్చే సంస్కృతి ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌లో ఈ సారి ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎగ్జిట్‌పోల్స్‌లో భాజపా, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు ఉందని వెల్లడవగా.. కమలదళం కాస్త ముందంజలో ఉన్నట్లు కనిపించింది. ఈ నేపథ్యంలో గురువారం హిమాచల్‌ప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపునకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.

  • మొత్తం స్థానాలు- 68
  • కౌంటింగ్​ కేంద్రాలు- 68
  • అభ్యర్థుల సంఖ్య- 412

ఎగ్జిట్‌పోల్స్‌ తర్వాత విజయంపై అధికార భాజపాతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూడా ధీమాగా ఉన్నాయి. మహిళలు, యువత ఓట్లపై ఎక్కువ ఆశలు పెట్టుకున్న భాజపా.. వారికి ఎన్నికల్లో భారీ హామీలనే ఇచ్చింది. మహిళలకు ప్రత్యేకంగా మ్యానిఫెస్టో కూడా ప్రకటించింది. మోదీ విస్త్రత ప్రచారం కూడా కలిసొస్తుందని భావిస్తోంది. మరోవైపు ఐదేళ్లకోసారి అధికార మార్పిడి సంప్రదాయం, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలతోపాటు పాత పింఛను విధానం హామీ తమకు లాభిస్తాయని కాంగ్రెస్‌ నమ్ముతోంది. ఆమ్‌ఆద్మీ కూడా హిమాచల్‌ప్రదేశ్‌పై ఆశలు పెట్టుకుంది. అయితే ఎగ్జిట్‌పోల్స్‌లో ఆ పార్టీ ఉనికి ఏమాత్రం కనిపించలేదు.
2017 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 44 సీట్లు గెల్చుకోగా.. కాంగ్రెస్‌ 21, సీపీఎం 1, స్వతంత్రులు రెండు చోట్ల గెలిచారు.

హిమాచల్​ప్రదేశ్​ ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలు
హిమాచల్​ప్రదేశ్​ ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలు

ప్లాన్​-బిలో బిజీగా భాజపా!
గుజరాత్​లో భాజపాదే పీఠమని అంచనా వేసిన ఎగ్జిట్​పోల్స్.. హిమాచల్​ ప్రదేశ్​లో మాత్రం కమలదళం, కాంగ్రెస్​ మధ్య హోరాహోరీ పోటీ ఉందని తెలిపింది. దీంతో అధికార భాజపా అప్పుడే రాష్ట్రంలో 'ప్లాన్​-బి' మొదలుపెట్టిందని సమాచారం. స్వతంత్ర అభ్యర్థులు, రెబల్స్​తో రాష్ట్ర నేతలు విస్తృత చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వారి విశ్వాసాన్ని పొందేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని వినికిడి. రాష్ట్రంలో మరోసారి భాజపా అధికారంలోకి రావడం అంత సులువు కాదని గ్రౌండ్​ రిపోర్ట్​ సూచించడం వల్లే భాజపా ముందుస్తుగా ప్లాన్​-బి​ ప్రారంభించిందని సమాచారం.

ఒకవేళ గురువారం వెలువడే ఫలితాల్లో భాజపా, కాంగ్రెస్​ చెరో 32 సీట్లు గెలుచుకుంటే స్వతంత్ర ఎమ్మెల్యేలు కింగ్​ మేకర్స్​ అవుతారు. వారు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే వారిదే అధికార పీఠం. అందుకే కౌంటింగ్​కు​ ముందు నుంచే భాజపా రాష్ట్రంలో ఆపరేషన్​ ఆకర్ష్​ ప్రారంభించిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఎన్నికల ప్రచార సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్​ పార్టీ లేవనెత్తిన కొత్త పెన్షన్​ పథకం, ద్రవ్యోల్బణం అంశాలు.. తమ ఓటు బ్యాంక్​ను బాగా దెబ్బతీశాయని భాజపా నేతలు అంచనా వేస్తున్నారు. కొన్నిశాఖల్లో ఉద్యోగాలకు సంబంధించిన కేసులు కోర్టులో పెండింగ్​లో ఉండడం.. యువతను తీవ్ర ఆగ్రహానికి గురిచేసిందని, అందుకే వారి ఓట్లు ప్రతిపక్షాల వైపు మళ్లాయని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఏదేమైనా గురువారం వెలువడే ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సంప్రదాయమా? సరికొత్త చరిత్రా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Last Updated :Dec 7, 2022, 6:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.