ETV Bharat / bharat

మంచుకొండల్లో అధికారం చేపట్టాలంటే.. కాంగ్రాపై గురి పెట్టాల్సిందే..!

author img

By

Published : Nov 9, 2022, 7:49 AM IST

ప్రధాని నరేంద్రమోదీ, నడ్డా, రాజ్‌నాథ్‌ సింగ్‌, అనురాగ్‌ఠాకుర్‌.. ప్రియాంక గాంధీ, కేజ్రీవాల్‌.. ఇలా ఏ పార్టీ కీలక నేతలైనా ఇక్కడ ప్రచారానికి రావల్సిందే.. అదే కాంగ్రా జిల్లా. హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీలో అత్యధిక సీట్లున్న జిల్లా. అక్కడ అధికారాన్ని నిర్ణయించటంలో కీలకమైన స్థానం. మరి ఈసారి కాంగ్రాను ఎవరు గెల్చుకునేను?

himachal pradesh election
కాంగ్రా జిల్లా

Himachal Pradesh Election 2022 : 68 సీట్లున్న హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీలో కాంగ్రా జిల్లా నుంచే 15 మంది ప్రవేశిస్తారు. 1993 నుంచీ కాంగ్రా జిల్లాలో అధిక సీట్లు గెల్చుకుంటున్న పార్టీయే రాష్ట్రంలో పగ్గాలు చేపడుతోంది. అందుకే.. ఈ హిమచల అధికారానికి దీన్ని రహదారిగా భావిస్తుంటారు. 15 సీట్లలో కనీసం 9 వచ్చిన వారు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. 2017 ఎన్నికల్లో భాజపా 11 సీట్లు గెల్చుకుంది. 2012లో కాంగ్రెస్‌ 10 సీట్లు గెలవటం వల్ల వీరభద్రసింగ్‌ ఆరోసారి ముఖ్యమంత్రిగా పీఠమెక్కారు.

కాంగ్రా జిల్లాలో రాజ్‌పుత్‌ల (34%) ప్రాబల్యం ఎక్కువ. ఓబీసీలు కూడా (32%) గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఎన్నికల్లో కుల ప్రాధాన్యం ఉన్నా.. రాష్ట్రం ఎదుర్కొంటున్న అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. ఏదో ఒకపార్టీ వైపు సూటిగా నిలవటం ఈ జిల్లా ప్రత్యేకత. ప్రధాని నరేంద్రమోదీ పట్ల రాష్ట్రంలో ఆదరణ ఉన్నా.. స్థానిక భాజపా ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా కనిపిస్తోంది.

ముఖ్యంగా పెరిగిన ధరలు భాజపాను ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశాలు లేకపోలేదు. వీటికి తోడు సైన్యంలో ప్రవేశాలకు కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకం కూడా ఈ ఎన్నికల్లో ప్రధానాంశం అవుతోంది.ఈ కారణంగా.. కాంగ్రాతో పాటు పక్కనున్న హమీర్‌పుర్‌, ఉనా, మండి జిల్లాల నుంచి వేల సంఖ్యలో యువత సైన్యంలో భర్తీ అవుతుంటారు. ఈ జిల్లాల్లో కలిపి మొత్తం 35 అసెంబ్లీ సీట్లున్నాయి. అగ్నిపథ్‌ పథకంతో హిమాచల్‌ వాసులకు సైన్యంలో ప్రవేశం గతంలో కంటే తగ్గిపోతుందనే ఆందోళన నెలకొంది. విపక్షాలకిది బలమైన అస్త్రంగా దొరికింది. భాజపా నేతలు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. యువతలో ఎలాంటి ఆందోళన లేదంటున్నారు. వేల సంఖ్యలో హిమాచల్‌ యువతరం అగ్నిపథ్‌ ర్యాలీల్లో పాల్గొనటాన్ని వారు ఉదాహరణగా చూపుతున్నారు.

తిరుగుబాట్ల బెడద..
15 సీట్లకు 91 మంది పోటీలో ఉన్నారు. అన్ని పార్టీలకూ ఇక్కడ తిరుగుబాటు అభ్యర్థులు సమస్యగా తయారయ్యారు. అధికార భాజపా అందరికంటే ఎక్కువ ఈ సమస్యను ఎదుర్కొంటోంది. ఫతేపుర్‌, ధర్మశాల, ఇందోరా, కాంగ్రా, దెహ్రా స్థానాల్లో భాజపాకు తిరుగుబాటు అభ్యర్థులు తలనొప్పిగా మారారు. పార్టీ అధ్యకుడు నడ్డా, అధిష్ఠానం ఎంతగా నచ్చజెప్పినా రెబెల్స్‌ వెనక్కి తగ్గలేదు.
మొత్తానికి 1993 నుంచీ ఒకసారి కాంగ్రెస్‌, మరోసారి భాజపాకు అధిక సీట్లు ఇస్తూ వస్తోంది కాంగ్రాజిల్లా! అందుకే.. ఆ ఆనవాయితీ ప్రకారం ఈసారి తమకే అవకాశం ఉందని కాంగ్రెస్‌ బలంగా నమ్ముతోంది. దాన్ని తిరగరాసే ఉద్దేశంతో ప్రధాని మోదీసహా భాజపా తన బలగాన్నంతా ప్రచార రంగంలోకి దించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.