'విజయవాడ డ్రగ్స్​ విలువ రూ.9 వేల కోట్లు కాదు.. 21వేల కోట్లు!'

author img

By

Published : Sep 21, 2021, 5:09 PM IST

Updated : Sep 21, 2021, 10:44 PM IST

heroin mundra port

గుజరాత్​లోని ముంద్రా పోర్ట్​లో (heroin mundra port) స్వాధీనం చేసుకున్న 3వేల కేజీల హెరాయిన్​ విలువ రూ. 21వేల కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇదివరకు ఈ విలువ రూ.9వేల కోట్లగా ఉంటుందని అంచనా వేశారు. ఈ డ్రగ్స్​ అఫ్గానిస్థాన్​ నుంచి వచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీనిపై ఈడీ విచారణ చేపట్టింది. మరోవైపు అసోంలో 1.5 కేజీల డ్రగ్స్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గుజరాత్​లోని ముంద్రా పోర్ట్​లో​ ఇటీవల పట్టుబడ్డ 3వేల కేజీల హెరాయిన్​కు (heroin mundra port) సంబంధించి అధికారులు మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. సీజ్​ చేసిన డ్రగ్స్​ విలువ రూ.9వేల కోట్లు ఉంటుందని తొలుత భావించిన అధికారులు.. తాజాగా ఆ విలువ రూ.21వేల కోట్లని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్​ చేశారు.

ఇదీ జరిగింది..

గుజరాత్​లోని కచ్​ జిల్లా ముంద్రా పోర్ట్ (Mundra port drugs)​ నుంచి 2,988.21 కేజీల హెరాయిన్​​ ఉన్న రెండు కంటెయినర్లను కొద్ది రోజుల క్రితం డైరక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటలిజెన్స్​ (డీఆర్​ఐ) అధికారులు సీజ్​ చేశారు. ఓ కంటెయినర్​లో 1999.57 కేజీలు, రెండో కంటెయినర్​లో 988.64 కేజీలు ఉన్నాయి. నమూనా పరీక్షల్లో అది హెరాయిన్​ అని నిర్ధరణ అయింది. టాల్క్​ స్టోన్​ పేరుతో వీటిని విజయవాడకు చెందిన ఓ సంస్థ దిగుమతి చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది.

అంతర్జాతీయ మార్కెట్​లో కిలో హెరాయిన్ ధర రూ.5 నుంచి 7 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

ఇరాన్​ మీదుగా..

హెరాయిన్​ను ​అఫ్గానిస్థాన్​ నుంచి ఇరాన్​లోని బందర్​ అబ్బాస్​ పోర్ట్​ మీదుగా గుజరాత్​కు (mundra port drugs) తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. అహ్మదాబాద్​, దిల్లీ, చెన్నై, గాంధీధామ్​, మండవీలో తనిఖీలు చేపట్టగా.. చెన్నైలో ఇందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. నిందితులు.. ఆషీ ట్రేడింగ్​ కంపెనీ నిర్వహకులైన ఎం సుధాకర్​, దుర్గా వైశాలి దంపతులుగా అధికారులు గుర్తించారు. సోమవారం వీరిని భుజ్​లోని ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టగా.. నిందితులు పది రోజులు డీఆర్​ఐ కస్టడీలో ఉండాలని న్యాయస్థానం ఆదేశించింది.

ఈడీ విచారణ

ఈ వ్యవహారంపై ఎన్ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ప్రారంభించింది. మనీలాండరింగ్ కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతోంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ నమోదు చేసుకున్న ఫిర్యాదు వివరాలను అందించాలని ఆ విభాగాన్ని కోరింది.

అసోంలో కూడా..

అసోంలోని అంగ్​లాంగ్​ జిల్లా కార్బీలో రూ.8 కోట్లు విలువ చేసే 1.5 కేజీ హెరాయిన్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్​ చేశారు. నాగాలాండ్​కు చెందిన నిందితులు బెసీ మావోస కైహా మావో మణిపుర్​ నుంచి గువాహటికి ఈ డ్రగ్స్​ను తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. సబ్బు డబ్బాల్లో వీటిని తరలిస్తుండగా పట్టుబడ్డారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : 'చదువు రాని వ్యక్తి సూసైడ్​ నోట్ రాస్తారా?'.. మహంత్​ మృతిపై అనుమానాలెన్నో...

Last Updated :Sep 21, 2021, 10:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.