ETV Bharat / bharat

యుక్త వయసు రాకముందే రజస్వల.. లాక్‌డౌన్‌లో 3.6 రెట్లు అధికం!

author img

By

Published : Jun 10, 2022, 5:31 AM IST

బాలికల ఆరోగ్యంపైనా లాక్‌డౌన్‌ ప్రభావం చూపినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. యుక్త వయసు రాకముందే రజస్వల (Precocious Puberty) అయిన కేసుల సంఖ్య లాక్‌డౌన్‌ సమయంలో 3.6 రెట్లు పెరిగినట్లు పుణె పరిశోధకులు గుర్తించారు. అయితే, ఇందుకు కచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు మరిన్ని అధ్యయనాలు చేయాల్సి ఉందన్నారు

early-puberty-cases
యుక్త వయసు రాకముందే రజస్వల

కరోనా వైరస్‌ మహమ్మారి సృష్టించిన విలయం ఒకటైతే.. ఆ సమయంలో అమలైన ‘లాక్‌డౌన్‌’ ప్రజా ఆరోగ్యంపైనా పెను మార్పులకు కారణమయ్యింది. ప్రజలు దీర్ఘకాలంపాటు ఇళ్లు, ఫోన్‌లకే పరిమితం కావడం బాల, బాలికల్లో శారీరక, మానసిక సమస్యలకు దారితీసినట్లు ఇప్పటికే పలు అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి. ఈ క్రమంలో బాలికల ఆరోగ్యంపైనా లాక్‌డౌన్‌ ప్రభావం చూపినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. యుక్త వయసు రాకముందే రజస్వల (Precocious Puberty) అయిన కేసుల సంఖ్య లాక్‌డౌన్‌ సమయంలో 3.6 రెట్లు పెరిగినట్లు పుణె పరిశోధకులు గుర్తించారు. అయితే, ఇందుకు కచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు మరిన్ని అధ్యయనాలు చేయాల్సి ఉందన్నారు. పుణె వైద్యులు జరిపిన తాజా అధ్యయన నివేదిక పీడియాట్రిక్‌ ఎండోక్రైనాలజీ అండ్‌ మెటబాలిజం జర్నల్‌లో ప్రచురితమైంది.

ప్రికాషియస్ ప్యూబర్టీ అంటే..?
బాలికల్లో సాధారణ వయసుకన్నా ముందే అనగా.. ఎనిమిది, తొమ్మిదేళ్ల వయసుకే యవ్వనంలోకి రావడాన్ని ఇడియోపథిక్‌ సెంట్రల్‌ ప్రికాషియస్ ప్యూబర్టీ (iCPP)గా పేర్కొంటారు. ముఖ్యంగా పదేళ్లోపు బాలికల్లో రుతుక్రమం మొదలైతే ముందస్తు రజస్వలగా పరిగణిస్తారు. అయితే, లాక్‌డౌన్‌ సమయంలో ఇటువంటి కేసులు ఎక్కువగా వచ్చినట్లు పుణెలోని జహంగీర్‌ ఆస్పత్రి వైద్యులు గుర్తించారు. దీనిపై పరిశోధన మొదలుపెట్టిన నిపుణులు సెప్టెంబర్‌ 1, 2018 నుంచి ఫిబ్రవరి 29, 2020 వరకు ఉన్న సమాచారాన్ని.. మార్చి 1, 2020 నుంచి సెప్టెంబర్‌ 30, 2021 వరకు ఉన్న కేసులను విశ్లేషించారు. తద్వారా లాక్‌డౌన్‌కు ముందు వచ్చిన మొత్తం 4208 కేసుల్లో కేవలం 59 మాత్రమే ఐపీసీసీవి ఉండేవని.. కానీ, లాక్‌డౌన్‌ సమయంలో వచ్చిన 3053 కేసుల్లో 155 (5.1శాతం) ఇటువంటివే ఉన్నట్లు గమనించారు.

కారణాలేంటి..?
ప్రికాషియస్ ప్యూబర్టీ రావడానికి ఒత్తిడి, మొబైల్‌ ఫోన్లు, శానిటైజర్లు అధికంగా వాడడం, అధికమొత్తంలో ఆహారం తీసుకోవడం, ఆహారపు అలవాట్లు మారడం వంటివి కారణాలు కావచ్చని పుణె వైద్యులు అంచనా వేశారు. ముఖ్యంగా మొబైల్‌ ఫోన్ల వాడకంతోపాటు రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం, ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు వంటివి ప్రికాషియస్‌ ప్యూబర్టీకి కారణాలుగా చెబుతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఇటువంటి అంశాలు ఎక్కువగా ప్రభావితం చేశాయని జహంగీర్‌ ఆస్పత్రిలో చిన్నపిల్లల నిపుణురాలు డాక్టర్‌ అనురాధ ఖదిల్కర్‌ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో శానిటైజర్ల వాడకం విపరీతంగా పెరగడం.. అందులోని ట్రైక్లోసాన్‌ (Triclosan) రసాయనానికి ఎక్కువగా గురికావడం కూడా పిల్లలు ముందస్తుగానే రుతుచక్రంలోకి జారుకునే అవకాశం ఉండవచ్చని అన్నారు. దీన్ని ధ్రువీకరించేందుకు మరిన్ని అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయన రూపకర్త డాక్టర్‌ అనురాధ స్పష్టం చేశారు. అయితే, లాక్‌డౌన్‌కు ముందు ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగిన నెలల్లో ఈ కేసులు గణనీయంగా పెరిగినట్లు అధ్యయనంలో పాల్గొన్న మరో ఎండోక్రైనాలజిస్ట్‌ డాక్టర్‌ వామన్‌ ఖదిల్కర్‌ వెల్లడించారు.

ఏమిటీ ట్రైక్లోసాన్‌..?
టూత్‌పేస్టులు, సబ్బులు, డిటర్జెంట్లు, శానిటైజర్లతో పాటు బొమ్మలు తదితరాల్లో సూక్ష్మజీవి నాశకం (యాంటీ బాక్టీరియల్‌)గా ‘ట్రైక్లోసాన్‌’ రసాయనాన్ని ఉపయోగిస్తారు. అయితే, దీనివల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉంటాయనే విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలికల్లో హర్మోన్లను ప్రభావితం చేసే (EDC) రసాయనంగానూ దీన్ని చెబుతుంటారు. ఇక పర్ఫ్యూమ్‌లు, డియోడరెంట్లు, టూత్‌పేస్టులు, మేకప్‌కిట్లు వాడకం కూడా బాలికలు ముందస్తు యుక్తవయసులోకి వెళ్లడానికి కారణాలుగా వైద్యులు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. కేవలం పుణెలోని ఆస్పత్రి చేసిన ఈ పరిశోధనలోనే కాకుండా ఇటీవల వచ్చిన అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో ప్రికాషియస్ ప్యూబర్టీ కేసులు 108 శాతం పెరిగినట్లు ఇటలీలో జరిపిన ఓ అధ్యయనం వెల్లడించింది. ఇక తుర్కియేలో జరిపిన అధ్యయనంలోనూ ఇదే విధమైన ఫలితాలు కనిపించాయి. లాక్‌డౌన్‌ కన్నా ముందు మూడేళ్ల గణాంకాలతో పోలిస్తే లాక్‌డౌన్‌ సమయంలో వచ్చిన ఐసీపీపీ కేసులు రెట్టింపు ఉన్నట్లు వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.