అంజలి ఇంట్లో దొంగతనం.. ఆమె పనే అంటున్న కుటుంబ సభ్యులు

author img

By

Published : Jan 9, 2023, 4:25 PM IST

Updated : Jan 9, 2023, 5:49 PM IST

delhi hit and run case

Delhi Hit And Run Case : స్కూటీపై వెళ్తున్న అంజలి అనే యువతిని కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటనలో మరో కీలక పరిణామం జరిగింది. మృతురాలు అంజలి ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఉన్న టీవీ, మరికొన్ని వస్తువులను ఎత్తుకెళ్లిపోయారు.

Delhi Hit And Run Case : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ అంజలి కేసులో.. కొత్త కోణం వెలుగు చూసింది. కరణ్​ విహార్​లోని అంజలి ఇంట్లో దొంతనం జరిగింది. ఆమె ఇంటి తాళాలను పగలగొట్టి కొత్త టీవీ, మరికొన్ని వస్తువులు ఎత్తుకెళ్లిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ దొంగతనాన్ని అంజలి స్నేహితురాలు నిధి చేయించిందని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

"సోమవారం ఉదయం 7.30 గంటలకు ఇరుగుపొరుగు వారు మా ఇంట్లో దొంగతనం జరిగిందని తెలియజేశారు. మేము అక్కడకు వెళ్లి చూసేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. మేము రెండు నెలల కిందట కొన్న టీవీని దొంగిలించారు. అలాగే మరికొన్ని వస్తువులు ఎత్తుకెళ్లిపోయారు. మా ఇంటి దగ్గర 8 రోజుల నుంచి పోలీసులు కాపలా ఉన్నారు. ఆదివారం ఎందుకు లేరు? ఈ చోరీ వెనుక కచ్చితంగా నిధి హస్తం ఉంది."

-- అంజలి సోదరి

delhi hit and run case
మృతురాలు అంజలి ఇంట్లో చోరీ

మరో మలుపు..
అంజలి కేసు విచారణలో మరిన్ని విషయాలు బయటకు వచ్చాయి. యువతి కారు చక్రాల్లో చిక్కుకున్న విషయం తమకు తెలుసని పోలీసుల దర్యాప్తులో నిందితులు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత కారుచక్రాల కింద బాధితురాలు చిక్కుకుందని గుర్తించినా ఎవరైనా చూస్తారేమోనని భయంతో కాపాడే యత్నం చేయలేదని నిందితులు పోలీసులకు చెప్పారు.

జనవరి 1న దిల్లీలో స్కూటీపై వెళ్తున్న అంజలి అనే యువతిని కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు కొందరు యువకులు. ఈ ప్రమాదంలో అంజలి మరణించింది. ఘటన జరిగిన సమయంలో స్కూటీపై.. అంజలితోపాటు ఆమె స్నేహితురాలు నిధి ప్రయాణించింది. అయితే పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

గతంలో నిధి.. మత్తుపదార్థాలు అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 2020 డిసెంబరులో తెలంగాణ నుంచి దిల్లీకి గంజాయి రవాణా చేస్తుండగా.. ఆగ్రా రైల్వేస్టేషన్‌లో పోలీసులకు దొరికినట్లు తెలిపారు. ఈ కేసులో నిధితోపాటు.. మరో ఇద్దరు అరెస్టయ్యారని, ప్రస్తుతం ఆమె ఈ కేసులో బెయిల్‌పై బయటికి వచ్చినట్లు వివరించారు. నిధికి గతంలో నేర చరిత్ర ఉండటం వల్ల.. అంజలి కేసులో ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అంజలి విషయంలో నిధి చెప్పిన అంశాలు కూడా పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఘటన జరిగిన రోజు రాత్రి అంజలి మద్యం సేవించిందని నిధి మీడియాకు చెప్పింది. అయితే శవపరీక్ష నివేదికలో మద్యం ఆనవాళ్లు లేవని అంజలి తరఫు న్యాయవాది చెప్పడం వల్ల నిధి పొంతన లేని విషయాలు చెప్పినట్లు అనుమానిస్తున్నారు. మద్యం సేవించి ఉన్నప్పటికీ.. స్కూటీ తానే నడుపుతానని అంజలి పట్టుబట్టిందని నిధి తెలిపింది. కారు ఢీకొట్టడం వల్ల అంజలి టైరులో ఇరుక్కుపోయినట్లు పేర్కొంది. ఈ ఘటనతో తాను భయపడి ఇంటికి వెళ్లానని, ఎవరికీ ఈ విషయం చెప్పలేదని విచారణలో నిధి వెల్లడించింది.
నిధి ఆరోపణలను అంజలి తల్లి ఖండించారు. అంజలికి మద్యం అలవాటు లేదని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు ఈ కేసులో ఏడో నిందితుడిని దిల్లీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మెుత్తం 18 దిల్లీ పోలీసు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.

Last Updated :Jan 9, 2023, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.