'దిల్లీ అధికారాలు ప్రభుత్వానికే' తీర్పుపై కేంద్రం రివ్యూ పిటిషన్.. కోర్టు ధిక్కారమేనన్న కేజ్రీవాల్

author img

By

Published : May 20, 2023, 1:09 PM IST

Updated : May 20, 2023, 5:10 PM IST

Delhi govt vs LG Supreme Court

Delhi govt vs LG Supreme Court : దిల్లీలో పరిపాలనా అధికారాలు స్థానిక ప్రభుత్వానికే ఉంటాయని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. తీర్పును సమీక్షించాలని కోరుతూ వ్యాజ్యం దాఖలు చేసింది.

Delhi govt vs LG Supreme Court : దిల్లీలో పరిపాలనా అధికారాలు స్థానిక ప్రభుత్వానికే ఉంటాయని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. తీర్పును సమీక్షించాలని కోరుతూ వ్యాజ్యం దాఖలు చేసింది. మే 11న సుప్రీంకోర్టు దిల్లీ పాలనపై సంచలన తీర్పు చెప్పింది. దిల్లీ పాలనా అధికారాలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే ఉంటాయని స్పష్టం చేసింది. శాంతి భద్రతలు మినహా అన్ని వ్యవహారాలపై సర్కారుకే నియంత్రణ ఉంటుందని తేల్చి చెప్పింది. దిల్లీలో గ్రూప్ ఏ అధికారుల బదిలీలు, నియామకాల కోసం కేంద్రం శుక్రవారమే ఓ ఆర్డినెన్స్ జారీ చేసింది. నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీని ఏర్పాటు చేసేలా ఆర్డినెన్స్ రూపొందించింది.

'సుప్రీం కోర్టు ధిక్కారమే'
బ్యూరోక్రాట్ల బదిలీలు, నియామకాలకు సంబంధించి కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ సమాఖ్య విధానంపై ప్రత్యక్షదాడిగా దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అభివర్ణించారు. ఈ ఆర్డినెన్స్‌ పూర్తిగా సుప్రీంకోర్టు ధిక్కారమే అని అన్నారు. దిల్లీ ప్రభుత్వం పనిచేయకుండా అడ్డుకోవాలన్న కుట్రతోనే ఈ ఆర్డినెన్స్‌ తెచ్చినట్లు కేజ్రీవాల్‌ ఆరోపించారు.

"దిల్లీలో ఎన్నికైన ప్రభుత్వానికి 3 అంశాలు పోలీసులు, శాంతిభద్రతలు, భూమి తప్ప పూర్తి అధికారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. వారంలోపు ఆర్డినెన్స్‌ ద్వారా ఈ తీర్పును తిప్పికొట్టారు. ఇది సుప్రీంకోర్టుకు కేంద్రం సవాల్‌ విసరటమే అవుతుంది. మీకు ఇష్టమైన తీర్పు ఇచ్చుకోండి. మీ తీర్పులను రెండునిమిషాల్లో ఆర్డినెన్స్‌ ద్వారా తిప్పికొడ్తామని అంటున్నారు. ఇది సుప్రీంకోర్టును అవమానించటమే. నేరుగా సుప్రీంకోర్టు ధిక్కారమే.

అరవింద్‌ కేజ్రీవాల్‌, దిల్లీ ముఖ్యమంత్రి

ఇది లెఫ్టినెంట్ గవర్నర్​కు అధికారాలు కట్టబెట్టేలా ఉందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్రం ఉల్లంఘిస్తోందని మండిపడుతున్నారు. కేంద్రం కోర్టు ధిక్కరణకు పాల్పడిందని వ్యాఖ్యానిస్తున్నారు. సుప్రీంకోర్టు తమకు ఇచ్చిన అధికారాన్ని కేంద్రం లాగేసుకునేందుకు ప్రయత్నిస్తోందని దిల్లీ మంత్రి అతీశీ ఆరోపించారు.

"ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​ను చూసి ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారని ఆర్డినెన్స్ ద్వారా అర్థమవుతోంది. నిజాయతీ రాజకీయాలకు ఆయన భయపడుతున్నారని తెలుస్తోంది. కేజ్రీవాల్​కు అసలైన అధికారం వస్తే.. దిల్లీలో అద్భుతమైన పనులు చేస్తారని వారికి భయం. ఆ అధికారాన్ని లాగేసుకునేందుకే ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఇది ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని హత్య చేసినట్లే."
-అతీశీ, దిల్లీ మంత్రి

"దిల్లీ ప్రజలు.. కేజ్రీవాల్​ను ఎన్నుకున్నప్పటికీ.. ఈ ఆర్డినెన్స్ మాత్రం సీఎంకు పాలన అప్పగించనని అంటోంది. రాజ్యాంగ విరుద్ధమైన ఈ ఆర్డినెన్స్​ను సుప్రీంకోర్టు కొట్టివేస్తుంది. సుప్రీంకోర్టుకు ఆరు వారాలు సెలవులు ఉన్నాయి. ఈ ఆరు వారాల పాటు తమ ప్రభుత్వం చేయాల్సిన పనిని అడ్డుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. కేంద్రం ఏర్పాటు చేస్తున్న కమిటీలో సీఎం ఛైర్మన్​గా ఉంటారు. కానీ, సభ్యులుగా ఉండే చీఫ్ సెక్రెటరీ, ప్రిన్సిపల్ హోంశాఖ కార్యదర్శులను కేంద్రమే నియమిస్తుంది. మెజారిటీ ఆధారంగా ఇందులో నిర్ణయాలు తీసుకుంటారు. దీనర్థం.. కేంద్రం నియమించిన బ్యూరోక్రాట్ల నిర్ణయమే ఫైనల్ అవుతుంది. ఒకవేళ కేంద్రానికి వ్యతిరేకంగా ఏదైనా నిర్ణయం తీసుకున్నా.. దాన్ని కొట్టేసే హక్కు లెఫ్టినెంట్ గవర్నర్​కు కట్టబెట్టారు" అని అతీశీ ఆరోపించారు.
అటు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆర్డినెన్సును సమర్థించుకుంటోంది. రాజ్యాంగ ధర్మాసనం తీర్పులో తలెత్తిన వైరుధ్యాన్ని తొలగించేందుకే ఆర్డినెన్స్‌ను ఆమోదించినట్లు పేర్కొంది.

ఏంటీ ఆర్డినెన్స్?
దిల్లీలో IAS, DANICS కేడర్‌ అధికారుల బదిలీలు, క్రమశిక్షణ చర్యలకు నేషనల్‌ క్యాపిటల్‌ సివిల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఉండాలని కేంద్రం ఆర్డినెన్సును జారీ చేసింది. ఈ అథారిటీలో దిల్లీ ముఖ్యమంత్రి ఛైర్‌పర్సన్‌గా ఉంటారని పేర్కొంది. అథారిటీ సభ్యుల ఓటింగ్‌ ద్వారా అధికారుల నియంత్రణను నిర్ణయించాలని అందులో తెలిపింది. అథారిటీలో మెజారిటీ ఓటింగ్‌ ఎవరికీ రాని పక్షంలో ఆ నిర్ణయంపై అధికారం దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కే ఉంటుందని స్పష్టం చేసింది.

Last Updated :May 20, 2023, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.