ETV Bharat / bharat

ఖర్గే X థరూర్ X త్రిపాఠీ​.. కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోరు.. గెలుపెవరిదో?

author img

By

Published : Sep 30, 2022, 2:05 PM IST

Updated : Sep 30, 2022, 4:35 PM IST

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేవారెవరో తేలిపోయింది. పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్, ఝార్ఖండ్ కాంగ్రెస్ నేత కేఎన్​ త్రిపాఠీ.. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నామినేషన్లు​ దాఖలు చేశారు. అయితే.. ప్రధాన పోటీ ఖర్గే, శశి థరూర్​ మధ్యే ఉండనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై భాజపా విమర్శలు గుప్పించింది.

congress president election
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొంది. గత కొన్ని రోజులుగా ఉన్న సందిగ్ధానికి శుక్రవారం తెరపడింది. నామినేషన్ దాఖలుకు ఆఖరికి రోజైన శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ముగ్గురు నామపత్రాలు సమర్పించారు. వీరిలో రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్​, ఝార్ఖండ్​కు చెందిన సీనియర్ నేత కేఎన్ త్రిపాఠీ ఉన్నారు. వీరిలో ఎవరు గెలుస్తారో తెలియాలంటే అక్టోబరు 19వరకు ఆగాల్సిందే.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై కొద్దిరోజులుగా నాటకీయ పరిణామాలు జరిగాయి. రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్​, మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సైతం పోటీలో ఉన్నారని వార్తలు వచ్చాయి. అలాగే మాజీ కేంద్రమంత్రి ఏకే ఆంటోనీ, మాజీ ముఖ్యమంత్రి కమల్​నాథ్ పేర్లు కూడా అధ్యక్ష రేసులో వినిపించాయి. అయితే దిగ్విజయ్ సింగ్ ఇవాళే పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అనూహ్యంగా ఆఖరి రోజున ఖర్గే పేరు తెరపైకి వచ్చింది.

congress president election
.
congress president election
నామినేషన్​ దాఖలు చేస్తున్న మల్లికార్జున ఖర్గే

గాంధీ కుటుంబానికి విధేయుడు..
మల్లికార్జున ఖర్గే మొదటి నుంచి పార్టీకి, గాంధీ కుటుంబానికి విధేయుడు. వివాదరహితుడు కూడా. అలాగే సోనియా అప్పగించిన కార్యక్రమాలను చక్కగా నిర్వర్తిస్తారనే పేరు కూడా ఉంది. దళిత వర్గానికి చెందిన నేత కావడం కొంత ప్లస్ పాయింట్. పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, అశోక్ గహ్లోత్​, మనీశ్ తివారీ, ఆనంద్ శర్మ వంటి నేతల మద్దతు ఉంది. అలాగే గాంధీ కుటుంబం నుంచి కూడా పరోక్షంగా ఖర్గేకు మద్దతు ఉంది. దాదాపు పోటీలో నిలిచిన ముగ్గురు అభ్యర్థుల్లో ఖర్గేకే విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

పార్టీలో మార్పు కోసం నేను పోరాడతా. పార్టీ ప్రతినిధులందరూ నాకు ఓటేయాలని కోరుతున్నా. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో నాకు మద్దతిచ్చినందుకు అన్ని రాష్ట్రాల సీనియర్ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు. ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. నేను గెలుస్తా అనే నమ్మకం ఉంది.'

--మల్లికార్జున ఖర్గే, రాజ్యసభలో విపక్షనేత

పాపులారిటీ ఉన్నా..
ఇక అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న శశి థరూర్.. కాంగ్రెస్​లో ఉన్న తెలివైన నాయకుల్లో ఒకరు. సమయోచితంగా ఆలోచిస్తూ మాట్లాడే వ్యక్తి. పట్టణవాసులు, చదువుకున్న వారిలో శశి థరూర్​కు మంచి ఫాలోయింగ్ ఉంది. అంతర్జాతీయ గుర్తింపు ఉన్న అతికొద్దిమంది కాంగ్రెస్ నాయకుల్లో ఈయన ఒకరు. ప్రస్తుతం తిరువనంతపురం ఎంపీగా ఉన్నారు. దక్షిణాదికి చెందిన వ్యక్తి కావడం ఆయన మైనస్ పాయింట్. అనేక మంది కాంగ్రెస్ నేతల మాదిరిగా.. ఉత్తరాది రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించడం శశి థరూర్​కు కష్టమే కావొచ్చు. ఇవన్నీ పక్కనబెడితే.. కాంగ్రెస్ అధిష్ఠానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖ రాసిన జీ23 బృందంలో శశి థరూర్ సైతం ఉన్నారు. ఇది ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.

congress president election
.
congress president election
నామినేషన్​ దాఖలు చేస్తున్న శశి థరూర్

నాకు కాంగ్రెస్ పట్ల విజన్ ఉంది. 9,000 మంది పార్టీ ప్రతినిధులకు విజన్ డాక్యుమెంట్ పంపుతాను. వారి మద్దతు కోరతా. నా నామినేషన్​కు విస్తృత మద్దతు లభించింది. పార్టీని బలోపేతం చేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్తా. ఖర్గే.. కాంగ్రెస్‌కు చెందిన భీష్మ పితామహుడు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తాము ఎవరికీ ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ మద్దతు ఇవ్వమని గాంధీ కుటుంబం తెలిపింది. ఈ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుగుతాయనే నమ్మకం నాకు ఉంది.

--శశి థరూర్​, తిరువనంతపురం ఎంపీ

కేఎన్​ త్రిపాఠీ.. అనూహ్యంగా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు ఝార్ఖండ్​కు చెందిన కాంగ్రెస్ నేత కేఎన్ త్రిపాఠీ. ఆయన మాజీ మంత్రి. త్రిపాఠీ.. ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్​.. జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు.

ఖర్గే 'రిమోట్ కంట్రోల్​' అధ్యక్షుడే.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే పోటీపై భాజపా విమర్శలు చేసింది. ఖర్గే.. 'రిమోట్ కంట్రోల్' అధ్యక్షుడు అవుతారని విమర్శించింది. 80 ఏళ్ల వయసు ఉన్న ఖర్గే కాంగ్రెస్​ను బలపరుస్తారా అని ఎద్దేవా చేశారు భాజపా ఐటీ సెల్ హెడ్​ అమిత్ మాలవీయ. మన్మోహన్ సింగ్ మాదిరిగానే.. ఖర్గే కూడా గాంధీ కుటుంబానికి రిమోట్ కంట్రోల్​గానే ఉంటారని అన్నారు. గహ్లోత్ పట్ల నమ్మకం కోల్పోయిన కాంగ్రెస్ అధిష్ఠానం.. ఇప్పుడు ఖర్గేను బరిలోకి దింపిందని విమర్శించారు అమిత్.

ఇవీ చదవండి: 'త్రిదళాల అవసరాలు తీర్చేందుకు కృషి'.. సీడీఎస్​గా బాధ్యతలు చేపట్టిన అనిల్ చౌహాన్

'దృశ్యం' సినిమా చూసి స్కెచ్​.. ప్రియుడితో కలిసి తండ్రి హత్య.. తల్లి సైతం ప్రోత్సాహం!

Last Updated :Sep 30, 2022, 4:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.