'హక్కులు, విధులపై అవగాహనతోనే రాజ్యాంగబద్ధ అభివృద్ధి'

author img

By

Published : Jul 31, 2022, 5:28 PM IST

CJI NV Ramana

CJI NV Ramana Speech: హక్కులు, విధుల గురించి పౌరులు తెలుసుకుంటేనే రాజ్యాంగబద్ధ గణతంత్రం అభివృద్ధి చెందడానికి సాధ్యమవుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. రాజ్యాంగ నిబంధనలను ప్రజలకు సరళంగా వివరించాలని సూచించారు. సామాజిక మార్పునకు చట్టాన్ని సాధనంగా అభివర్ణించారు.

CJI NV Ramana news: పౌరులు రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధులు తెలుకున్నప్పుడే రాజ్యాంగ బద్ధమైన గణతంత్రం అభివృద్ధి చెందుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌ రాయ్​పుర్​లోని హిదాయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ ఐదో స్నాతకోత్సవంలో సీజేఐ పాల్గొన్నారు. ప్రతి వ్యక్తికి తమ హక్కులు, విధులపై అవగాహన కల్పించాలని వర్సిటీ పట్టభద్రులకు జస్టిస్‌ రమణ సూచించారు. రాజ్యాంగ నిబంధనలను ప్రజలకు సరళంగా వివరించాలని దిశానిర్దేశం చేశారు. సామాజిక మార్పునకు చట్టాన్ని సాధనంగా అభివర్ణించిన జస్టిస్‌ రమణ లా స్కూల్ విద్య గ్రాడ్యుయేట్‌లను సోషల్ ఇంజినీర్లుగా మార్చాలని ఆకాంక్షించారు. న్యాయవాద వృత్తి అపార సవాళ్లతో కూడుకున్నదని, కానీ ఇందులో సంతృప్తి ఉంటుందన్నారు.

"న్యాయస్థానం ముందు లాయర్లు కేవలం ఓ ప్రతినిధి మాత్రమే కాదు. కేవలం చట్టం తెలుసుకోవడం వల్ల మీకు దీర్ఘకాలం సహాయం చేయదు. మీకు సమాజం, వ్యాపారం, క్రీడల గురించి తెలిసి ఉండాలని మీ క్లయింట్లు ఆశించవచ్చు. న్యాయవాది ఆల్‌రౌండర్‌గా ఉండాలి. నాయకుడిగా మార్పు సాధించే వ్యక్తిగా ఉండాలి. కొత్త ఆలోచనా విధానం వల్ల విమర్శలు వస్తాయి. కానీ అలాంటి విమర్శలను మిమ్మల్ని ఇబ్బంది పెట్టనివ్వకుండా చూసుకోండి."
-జస్టిస్‌ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

ప్రపంచవ్యాప్తంగా యువత ఐక్యశక్తిగా ఉన్నారని చెప్పారు జస్టిస్ రమణ. 'సాంకేతిక విప్లవం మనలో ప్రతి ఒక్కరినీ ప్రపంచ పౌరులుగా మార్చేసింది. మీరందరూ కూడా ఆ విప్లవంలో చేరాల్సిన సమయం ఆసన్నమైంది. రాజ్యాంగం ప్రతి పౌరునికి వర్తిస్తుంది. ప్రతి వ్యక్తికి వారి హక్కులు, విధులపై అవగాహన కల్పించాలి. రాజ్యాంగ సంస్కృతిని ప్రోత్సహించడం, అవగాహన పెంచడం మన సామూహిక బాధ్యత. రాజ్యాంగ నిబంధనలను సరళంగా వివరించేందుకు ప్రయత్నించండి' అని జస్టిస్ రమణ గ్రాడ్యుయేట్లకు సలహా ఇచ్చారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.