ETV Bharat / bharat

పంటల బీమా పథకంలో కీలక మార్పులు!

author img

By

Published : Sep 2, 2022, 9:56 AM IST

fasal bima yojana 2022
పంటల బీమా పథకంలో కీలక మార్పులు!

ప్రధాన మంత్రి పంటల బీమా పథకం ద్వారా ఇన్సూరెన్స్‌ కంపెనీలే లాభపడుతున్నాయన్న వార్తల నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని మార్పులు చేయాలని భావిస్తోంది. అవేంటంటే..

PM fasal bima yojana 2022 : పంటల బీమా పథకమైన ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనలో మార్పులు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రీమియం మొత్తాన్ని హేతుబద్ధీకరించడంతోపాటు మరిన్ని బీమా కంపెనీలు ఇందులో భాగస్వామ్యం అయ్యేలా ఈ పథకాన్ని తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతోంది. కేబినెట్‌ ఆమోదం మేరకు మార్పులు చేసి 2023-24 పంట సంవత్సరానికల్లా(జులై-జూన్‌) దీన్ని అమల్లోకి తీసుకురావాలని భావిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ బీమా పథకం ద్వారా ఇన్సూరెన్స్‌ కంపెనీలే లాభపడుతున్నాయని నివేదికలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ మేర మార్పులు చేయాలని భావిస్తోంది.

2016 ఫిబ్రవరిలో ఈ పథకం ప్రారంభమైంది. పంట నష్టాల నుంచి రైతుకు రక్షణ కల్పించడమే దీని ధ్యేయం. రైతులు చెల్లించే ప్రీమియం అతి తక్కువగా ఉండేలా రాయితీలు కల్పిస్తూ పథకాన్ని రూపొందించారు. ఖరీఫ్‌లో వేసే పంటలకు రెండు శాతం, రబీలో పండించే ఆహార ధాన్యాలు, నూనె గింజల పంటలకు 1.5 శాతం చొప్పున రైతులకు నామమాత్రపు ప్రీమియం నిర్ణయించారు. వార్షిక వాణిజ్య పంటలకు వ్యవసాయదారులు చెల్లించాల్సిన గరిష్ఠ ప్రీమియం 5 శాతంగా పేర్కొన్నారు. వాస్తవ ప్రీమియం రేట్లకు రైతు చెల్లించే వాటికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని కేంద్రం, రాష్ట్రం చెరి సగం భరించాలి. చివరి సారిగా 2020లో ఈ స్కీమ్‌లో కొన్ని మార్పులు చేశారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఫసల్‌ బీమా పథకంలో పాల్గొంటున్న బీమా కంపెనీల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. పోటీతత్వాన్ని దెబ్బతీయడంతో పాటు ప్రీమియం రేటు పెరుగుదలకు ఇది దారితీస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. 2019-20 నుంచి 2022-23 సంవత్సరానికి గానూ 18 బీమా కంపెనీలను ఎంప్యానెల్‌ చేయగా.. అందులో 8 మాత్రమే మిగిలాయి. క్లెయిమ్‌ రేషియో ఎక్కువ ఉండటం, భారీ నష్టాల కారణంగా అందులో నాలుగు ప్రభుత్వ, నాలుగు ప్రైవేటు రంగ కంపెనీలు మాత్రమే బీమాను అందిస్తున్నాయి.

ఈ క్రమంలో పోటీతత్వం లేకపోవడంతో మిగిలిన బీమా కంపెనీలు ప్రీమియం మొత్తాన్ని భారీగా నిర్ణయించాయి. పైగా గత సంవత్సరం పంట నష్టాలు తక్కువగా నమోదు కావడంతో ఆయా కంపెనీలు భారీ లాభాలను ఆర్జించినట్లు తేలింది. దీంతో ఈ పథకం బీమా కంపెనీలకు మాత్రమే మేలు చేకూరుస్తోందని, రైతులకు కాదన్న అవగాహనకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో పథకంలో పలు మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోందట.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.