ETV Bharat / bharat

రాజకీయ నాయకులకు తలొగ్గితే తప్పుకోవాల్సిందే - అధికారులకు సీఈసీ స్వీట్ వార్నింగ్!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 10, 2024, 7:14 AM IST

Central Election Commission Warning To District Collectors: ఎన్నికల విధుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే విధుల నుంచి తప్పుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లను హెచ్చరించింది. రాజకీయపార్టీల ఒత్తిళ్లకు తలొగ్గుతూ నాయకులతో అనుబంధం కొనసాగిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. ఎన్నికల సన్నద్ధత, ఓటర్ల జాబితాల అంశంపై సమీక్షించిన కేంద్ర ఎన్నికల బృందం అర్హుల ఓట్ల తొలగింపునకు ఫాం-7లు పెట్టినవారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని కలెక్టర్లను, ఎస్పీలను నిలదీసింది.

Central_Election_Commission_Warning_To_District_Collectors
Central_Election_Commission_Warning_To_District_Collectors

రాజకీయ నాయకులకు తలొగ్గితే తప్పుకోవాల్సిందే - అధికారులకు సీఈసీ స్వీట్ వార్నింగ్!

Central Election Commission Warning To District Collectors : రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధత, ఓటర్ల జాబితా తయారీ సహా వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్, కమిషనర్లు అరుణ్‌ గోయల్, అనూప్‌చంద్ర పాండేలతో కూడిన ప్రతినిధి బృందం విజయవాడలో సమీక్ష నిర్వహించింది. రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలుసని ఎవరెవరు ఎలా వ్యవహరిస్తున్నారో గమనిస్తున్నామంది. ప్రతి ఒక్కరిపై నివేదికలున్నాయని అధికారులు ఏదైనా పార్టీకి లేదా నాయకులకు అనుకూలంగా, వారికి మేలు చేకూర్చేలా వ్యవహరిస్తే కఠిన చర్యలుంటాయని కలెక్టర్లు, ఎస్పీలను హెచ్చరించింది.

Illegal Votes in AP : కొందరు అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఆయా పార్టీలు, నాయకులతో అనుబంధం కొనసాగిస్తున్నారనే ఫిర్యాదులున్నాయని అలాంటి వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. నిష్పక్షపాతంగా, తటస్థంగా ఉండలేమని ఎవరైనా భావించేవారు తప్పుకోవాలని చర్యలు తీసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని తేల్చి చెప్పింది. అర్హుల ఓట్ల తొలగింపునకు తప్పుడు సమాచారంతో వేలల్లో ఫాం-7 (Form-7)లు దరఖాస్తులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని నిలదీసింది. కొన్ని జిల్లాలు, నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులందుతున్నా ఎందుకు పరిష్కరించట్లేదని ప్రశ్నించింది.

ఎన్నికల తంతు అంతా సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డి చెప్పినట్టే : చంద్రబాబు

Fake Votes : తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల వేళ నకిలీ ఓటరు కార్డులు సృష్టించి భారీగా దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించిన వ్యవహారంలో నిందితులెవరో, బాధ్యులెవరో రెండున్నరేళ్లు అవుతున్నా ఎందుకు గుర్తించలేదని తిరుపతి కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డిని ప్రశ్నించింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని నిలదీసింది. కలెక్టర్‌ చెప్పిన సమాధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. చంద్రగిరి నియోజకవర్గంలో కొత్తగా ఓట్ల నమోదుకు వేలాదిగా ఫాం-6 దరఖాస్తులు ఎలా వస్తాయనిఅదెలా సాధ్యమని ప్రశ్నించింది. ఈ అంశంలో ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారంటూ నిలదీసింది. వీటన్నింటిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

ప్రశ్నల వర్షం : తిరుపతి జిల్లాలోని ఫిర్యాదులు, అక్రమాలపై ఆ జిల్లా కలెక్టర్‌ను ప్రశ్నిస్తున్న తీరు చూసి మిగతా జిల్లాల కలెక్టర్లు ఆందోళన చెందారు. అనంతపురం జిల్లా కలెక్టర్‌ ఎం.గౌతమి, కాకినాడ కలెక్టర్‌ కృతికా శుక్లా, కడప కలెక్టర్‌ విజయరామరాజు, బాపట్ల కలెక్టర్‌ రంజిత్‌బాషాపైనా సీఈసీ కమిషనర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ రాజకీయ పక్షాలు ఇచ్చిన ఫిర్యాదులు దగ్గర పెట్టుకున్న సీఈసీ బృందం కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడినప్పుడు అక్కడ వచ్చిన ఫిర్యాదులపై ప్రశ్నించింది. వాటిపై పరిశీలన చేయించారా? విచారణలో ఏం తేలింది? వాటి ఆధారంగా ఏం చర్యలు తీసుకున్నారు? అని అడిగి తెలుసుకుంది. సరైన చర్యలు తీసుకోనివారి పట్ల కఠినంగా మాట్లాడింది.

దొంగ ఓటర్ల చేర్పు - నకిలీ ఓటర్ కార్డులు ప్రింట్ చేస్తోన్న జగన్​ సర్కార్ : పురందేశ్వరి

హెచ్చరికలు జారీ : అర్హుల ఓట్ల తొలగింపునకు తప్పుడు సమాచారం, వివరాలతో ఫాం-7 దరఖాస్తులు చేసిన, చేస్తున్నవారి వెనుక ఎవరున్నారనేది ఎందుకు తేల్చట్లేదని నిలదీసింది. ఓట్ల తొలగింపు వల్ల అంతిమ లబ్ధి ఎవరికనే అంశాలపై దర్యాప్తు ఎందుకు చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులు నమోదుచేసి వదిలేస్తే ఫలితమేంటని సూత్రధారులను పట్టుకోకుండా ఎందుకు వదిలేస్తున్నారని పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను నిలదీసింది. తాము ప్రతి కేసునూ విడిగా సమీక్షిస్తామని ఎక్కడైనా బాధ్యుల్ని తప్పించినట్లు తేలితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. ఓట్ల తొలగింపు కోసం తప్పుడు సమాచారంతో ఫాం-7లు పెట్టినవారని నకిలీ ఓట్లు చేర్పించేందుకు భారీగా ఫాం-6లు పెట్టిన వారిని గుర్తించి వారిని వెనకనుంచి ఎవరు నడిపించారో తేల్చాలని ఆదేశించింది. మూలాల్లోకి వెళ్లి వారిపైనా కేసులు నమోదు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.

తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు తనిఖీల విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ కాంతిరాణా టాటాపై సీఈసీ బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ద్వారా ఎంత డబ్బు, మద్యం పట్టుకున్నారని ప్రశ్నించింది. ఆయన సమాధానాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏ మాత్రం సరిగ్గా లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతపురం సరిహద్దుల్లోకి కర్ణాటక నుంచి భారీగా మద్యం వస్తున్నా ఎందుకు పట్టుకోవట్లేదంటూ ఆ జిల్లా ఎస్పీ అన్బురాజన్‌పై మండిపడింది. సరిహద్దుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎందుకు సరిగ్గా లేదని తిరుపతి ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డిని నిలదీసింది.

దొంగ ఓట్లపై వైసీపీ గురి - ఎన్నికల్లో గెలిచేందుకు అక్రమాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.