ETV Bharat / bharat

రాజ్యసభ నిరవధిక వాయిదా- 25 బిల్లులకు ఆమోదం

author img

By

Published : Sep 23, 2020, 2:15 PM IST

Updated : Sep 23, 2020, 4:03 PM IST

రాజ్యసభ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కరోనా భయాల నేపథ్యంలో షెడ్యూల్ కంటే ముందుగానే సమావేశాలు ముగిశాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక బిల్లులకు ఈ సమావేశాల్లో పెద్దల సభ ఆమోదం లభించింది. మొత్తం 25 బిల్లులు రాజ్యసభ గడప దాటినట్లు ఛైర్మన్ వెంకయ్య నాయుడు తెలిపారు.

Rajya Sabha
రాజ్యసభ

కరోనా విజృంభణ నేపథ్యంలో రాజ్యసభ వర్షాకాల సమావేశాలు 8 రోజులు ముందే నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఐదు బిల్లులపై చర్చ తర్వాత పెద్దల సభ నిరవధికంగా వాడిదా పడ్డట్లు సభాపతి వెంకయ్య నాయుడు ప్రకటించారు.

ఈ పది రోజుల సమావేశాలు ఫలప్రదంగా సాగాయని ఛైర్మన్ వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. 25 బిల్లులు ఎగువ సభ ఆమోదం పొందినట్లు తెలిపారు. మరో ఆరు బిల్లులు పెద్దల సభలో ప్రవేశపెట్టినట్లు వివరించారు.

కీలక బిల్లులకు ఆమోదం

కరోనా వేళ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించిన కేంద్రం.. కీలక బిల్లులను పార్లమెంట్ గడప దాటించింది. వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరిట తీసుకొచ్చిన మూడు ఆర్డినెన్సులతో పాటు పలు బిల్లులు రాజ్యసభ ఆమోదం పొందాయి. మంగళవారం మూడున్నర గంటల వ్యవధిలోనే ఏడు బిల్లులను రాజ్యసభ ఆమోదించింది. బుధవారమూ అదే స్థాయిలో బిల్లులు ఆమోదం పొందాయి.

మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిధి నుంచి కొంత మొత్తాన్ని విత్​డ్రా చేసుకునేందుకు అధికారం కల్పించే రెండు ద్రవ్య బిల్లులను(అప్రాప్రియేషన్ నెం.3, నెం.4) రాజ్యసభ తిరిగి దిగువ సభకు పంపించింది. సెప్టెంబర్ 19న లోక్​సభలో పాసైన ఈ బిల్లులపై పెద్దల సభ ఎలాంటి చర్చ జరపకుండానే వెనక్కి పంపింది.

ఎగువసభ ఆమోదం పొందిన బిల్లులలో కొన్ని...

  • రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు-2020
  • రైతుల సాధికారత, రక్షణ, వ్యవసాయ సేవల బిల్లు- 2020
  • నిత్యావసర వస్తువుల సవరణ బిల్లు-2020
  • కొత్తగా స్థాపించిన ఐదు ట్రిపుల్ ఐటీలను జాతీయ ప్రాముఖ్యం కలిగిన సంస్థలుగా ప్రకటించే బిల్లు
  • బ్యాంకింగ్​ రెగ్యులేషన్​ సవరణ బిల్లు
  • జాతీయ ఫోరెన్సిక్​ సైన్సెస్​ యూనివర్సిటీ బిల్లు
  • రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ బిల్లు
  • టాక్సేషన్​ అండ్​ అదర్​ లాస్​ బిల్లు-2020
  • కంపెనీల చట్ట సవరణ బిల్లు-2020
  • బైలేటరల్ నెట్టింగ్ ఆఫ్ క్వాలిఫైడ్ ఫైనాన్షియల్ కాంట్రాక్ట్స్ బిల్లు 2020
  • జమ్ము కశ్మీర్ అధికారిక భాష బిల్లు-2020
  • విదేశీ విరాళాల నియంత్రణ చట్ట సవరణ బిల్లు

లేబర్ చట్టాలకు సంబంధించి మూడు కీలక బిల్లులను రాజ్యసభ ఆమోదించింది. అవి..

  • ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020
  • ఇండస్ట్రీయల్ రిలేషన్స్ కోడ్ 2020
  • కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020

వీటితో పాటు ఇతర బిల్లులూ పెద్దల సభ ఆమోదంతో పార్లమెంట్ గడప దాటాయి.

విపక్షాల ఆందోళనలు

రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందంటూ కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ బిల్లులు వివాదాస్పదంగా మారాయి. ఈ బిల్లులపై చర్చ సందర్భంగా ఆదివారం.. రాజ్యసభలో వాతావరణం రణరంగాన్ని తలపించింది. కొంతమంది సభ్యులు వెల్​ లోపలికి దూసుకెళ్లి ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. బిల్లు ప్రతుల్ని చించి విసిరేశారు. ఈ బిల్లులు రైతులకు మేలు చేయకపోగా.. కార్పొరేట్ సంస్థ చేతిలో బందీలుగా మారతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకానొక సమయంలో మార్షల్స్, ఎంపీల మధ్య తోపులాట జరిగింది.

చివరకు.. ఆందోళనల నడుమ మూజువాణి ఓటుతో సభామోదం పొందినట్లు డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్‌ ప్రకటించారు. ఆ తర్వాత కూడా విపక్ష సభ్యులు నిరసన కొనసాగించారు. సభ ముగిశాక డిప్యూటీ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానానికి 12 విపక్ష పార్టీలు నోటీసు ఇచ్చాయి.

రణరంగానికి కారణమైన నాలుగు పార్టీలకు చెందిన 8 మంది సభ్యులపై మరుసటి రోజే రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు సస్పెన్షన్‌ వేటు వేశారు. వర్షాకాల సమావేశాలు ముగిసేవరకు వారు సభలో అడుగుపెట్టడానికి వీల్లేదని స్పష్టంచేశారు. డిప్యూటీ ఛైర్మన్‌పై ఇచ్చిన అవిశ్వాస నోటీసును తిరస్కరించారు.

వీరికి వీడ్కోలు

పెద్దల సభలోని 11 మంది సభ్యులకు ఈ వర్షాకాల సమావేశాలతో తమ పదవీకాలం ముగియనుంది. నవంబర్​లో పదవీవిరమణ చేయనున్న 11 సభ్యులకు రాజ్యసభ తుదివీడ్కోలు పలికింది. వీరందరూ ఉత్తర్​ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచే ఉన్నారు.

పదవీకాలం ముగియనున్న సభ్యుల్లో పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, సమాజ్​వాదీ నేత రామ్ గోపాల్ యాదవ్, బీఎస్​పీ నేత వీర్ సింగ్, కాంగ్రెస్ నేత రాజ్ బబ్బర్​లు ఉన్నారు. వీరితో పాటు జావెద్ అలీ ఖాన్(ఎస్​పీ), పీఎల్ పూనియా(కాంగ్రెస్), రాజారాం(బీఎస్​పీ), నీరజ్ శేఖర్(బీజేపీ), అర్జున్ సింగ్(బీజేపీ), రవి ప్రకాష్ వర్మ(ఎస్​పీ), చంద్రపాల్ సింగ్ యాదవ్(ఎస్​పీ) పదవీ విరమణ చేయనున్నారు.

సెప్టెంబర్ 14న రాజ్యసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా నిర్ణయించిన కాలపట్టిక ప్రకారం అక్టోబర్ 1 వరకు సమావేశాలు జరగాల్సి ఉంది.

Last Updated :Sep 23, 2020, 4:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.