ETV Bharat / bharat

తెరవెనక పాత్రలో ఒదిగిపోయిన సమరకిరణం.. జగ్జీవన్‌దాస్‌ మెహతా!

author img

By

Published : May 30, 2022, 8:20 AM IST

గోఖలే కంటే ముందే గాంధీలో భావి భారత నాయకుడిని చూసి రవీంద్రుడి కంటే ముందే గాంధీలో మహాత్ముడిని గుర్తించి..దక్షిణాఫ్రికా నుంచి భారత్‌ దాకా అడుగడుగునా అండగా నిలిచి.. స్వాతంత్య్ర పోరాటం కోసం ఒప్పించి.. భారత్‌కు రప్పించి.. ఆశ్రమం నిర్మించి ఉప్పు సత్యాగ్రహం చేయించి గాంధీజీ లక్ష్యాల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి పెద్దగా ప్రచారం కోరుకోకుండా .. పేరైనా కనిపించనీకుండా తెరవెనక పాత్రలో ఒదిగిపోయిన అరుదైన సమర కిరణం.. గాంధీజీ ప్రాణంలో ప్రాణం.. ప్రాణ్‌ జీవన్‌దాస్‌ జగ్జీవన్‌దాస్‌ మెహతా!

azadi ka amrith mahotsav
azadi ka amrith mahotsav

Azadi Ka Amrith Mahotsav Jagjeevan Das Mehatha: డాక్టరై, లా చదవి, వజ్రాల వ్యాపారంలో స్థిరపడి.. భారత బానిస సంకెళ్ల విముక్తికి నిష్కామ కృషి సల్పిన రుషి డాక్టర్‌ మెహతా! 1864లో గుజరాత్‌లోని సుసంపన్న వ్యాపారుల కుటుంబంలో జన్మించిన ఆయన 1886లో గోల్డ్‌ మెడల్‌తో బొంబాయి నుంచి వైద్య పట్టా సంపాదించారు. ఉపకారవేతనంపై బ్రసెల్స్‌ వెళ్లి ఎండీ పూర్తి చేశారు. అది చేస్తూనే లండన్‌లో న్యాయశాస్త్రంలో చేరారు. అప్పుడే అక్కడికి లా చదివేందుకు వచ్చిన మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీతో 1888లో పరిచయమైంది. తనకంటే ఐదేళ్లు చిన్నవాడైన గాంధీకి యూరోపియన్‌ సంప్రదాయాలు, అలవాట్లతో పాటు ఎలా మసలు కోవాలో, ఖర్చులెలా తగ్గించుకోవాలో నేర్పించారాయన. గాంధీ ఆలోచనలను కొత్తదారిలో మళ్లించి.. రాటుదేల్చారు. గాంధీజీ గుజరాతీలో రాసిన 'హింద్‌ స్వరాజ్‌' పుస్తకం మెహతా పుణ్యమే! స్వరాజ్యం, నాగరికతలాంటి అనేక అంశాలపై గాంధీజీ దృఢ అభిప్రాయాలు ఇందులో కనిపిస్తాయి. ఈ పుస్తకాన్ని రాజద్రోహంగా పరిగణించి.. ఆంగ్లేయ సర్కారు నిషేధించింది. గాంధీజీకి, ఓ అజ్ఞాత పాఠకుడికి మధ్య జరిగే సంభాషణల ప్రతిరూపమే ఈ పుస్తకం. ఇందులోని అజ్ఞాత పాఠకుడు మరెవరో కాదు మెహతాయే!

ఇద్దరి మధ్యా బలపడ్డ ఈ బంధం సుదీర్ఘకాలం సాగింది. అమాయకుడిలా లండన్‌ వచ్చి పరిణతి సాధిస్తున్న గాంధీజీ జీవన క్రమాన్ని జాగ్రత్తగా గమనించిన మెహతా అడుగడుగునా ఆయనకు నీడలా నడిచారు. భావి భారత నాయకుడిని ఆయనలో అందరికంటే ముందే చూసి గొడుగులా నిలిచారు. 1909 నవంబరు 8న గోపాలకృష్ణ గోఖలేకు రాసిన లేఖలో.. '20 సంవత్సరాలుగా గాంధీని అతి దగ్గర్నుంచి చూస్తున్నాను. ఏటికేడు ఆయనలో అనూహ్యమైన మార్పు వస్తోంది. మహాత్ముల్లో కనిపించే నిస్వార్థ.. నిష్కామ లక్షణాలు అతనిలో కనిపిస్తున్నాయి' అని మెహతా వ్యాఖ్యానించారు. భారత్‌కు వచ్చాక కొద్దికాలం వైద్యవృత్తి చేసిన ఆయన తర్వాత బర్మాలో ఆభరణాల వ్యాపారంలో స్థిరపడ్డారు. బర్మా రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడయ్యారు. అయినా గాంధీని మాత్రం మరవలేదు. దక్షిణాఫ్రికాలో పోరాటానికి మద్దతిచ్చారు. భారత్‌లో ఆంగ్లేయులపై పోరాటానికి రావల్సిందిగా గాంధీజీపై ఒత్తిడి తెచ్చారు.

1915లో భారత్‌కు తిరిగి వచ్చే సమయానికి గాంధీజీ కుటుంబ పరిస్థితి అంత బాగో లేదు. కుటుంబ బాధ్యతలు చూసుకోవటంతో పాటు అహ్మదాబాద్‌లో ఆశ్రమానికీ డబ్బులిచ్చి.. గాంధీజీ స్వాతంత్య్రోద్యమంపై దృష్టిసారించే వెసులుబాటు కల్పించారు డాక్టర్‌ మోహతా. ఈ విషయాన్ని బయటకు చెప్పవద్దని గాంధీజీ వద్ద మాట తీసుకున్నారు. స్వాతంత్య్రోద్యమం గురించిన తన ఆలోచనలు, వ్యూహాలను ఎప్పటికప్పుడు గాంధీతో పంచుకునేవారు మెహతా. ఉప్పుపై ఆంగ్లేయులు విధించిన పన్నుకు వ్యతిరేకంగా సత్యాగ్రహం చేయాలని 1920లోనే మెహతా సూచించారు. 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనటానికి సిద్ధమయ్యారు. గాంధీతో కలసి గ్రామీణ భారత ఆర్థిక, సామాజిక స్థితిగతులను మార్చాలని ఆయన భావించారు. కానీ ఇంతలో.. గుండెపోటు వచ్చింది. చికిత్స కోసం యూరప్‌ వెళ్లాల్సి వచ్చింది. 1926, 29ల్లో భారత్‌కు వచ్చి గాంధీని కలిసి.. ఉప్పు సత్యాగ్రహం గురించి గుర్తు చేసి వెళ్లారు. దండియాత్ర ప్రణాళికకు ముందు గాంధీజీ బర్మా వెళ్లి మెహతాను కలసి వచ్చారు. తాను కూడా వచ్చి యాత్రలో పాల్గొంటానని ఆయన హామీ ఇచ్చారు. కానీ ఆరోగ్యం సహకరించలేదు. దండియాత్ర విజయవంతంగా సాగింది. గాంధీజీని ఆంగ్లేయ సర్కారు అరెస్టు చేసింది.

మరోవైపు రంగూన్‌లో డాక్టర్‌ మెహతా ఆరోగ్యం నానాటికీ క్షీణించింది. చివరకు 1932 ఆగస్టు 3న గాంధీజీ వెలుగుదీపం ఆరిపోయింది. వెళ్లలేని నిస్సహాయ స్థితిలో గాంధీ బాధలో మునిగితేలారు. "మీ బాధను నేనర్థం చేసుకోగలను. కానీ నా బాధ అత్యంత ప్రత్యేకమైంది. సత్యాగ్రహ ఆశ్రమం ఆయన చలవే. నేనే అక్కడుంటే.. నా ఒడిలోనే ఆయన చివరి శ్వాస విడిచేవారు. ఈ ప్రపంచంలో డాక్టర్‌ను మించిన ఆత్మీయ మిత్రుడు నాకు మరొకరు లేరు. నామటుకు ఆయన జీవించే ఉన్నారు’ అని డాక్టర్‌ మెహతా కుమారుడికి రాసిన లేఖలో గాంధీజీ నివాళి అర్పించారు.

ఇదీ చదవండి: 'బ్రిటిష్​ పాలన సిగ్గు సిగ్గు'.. సొంత పాలకులపై ఆంగ్లేయ గవర్నర్​ అసహనం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.