ETV Bharat / bharat

'ఆర్టికల్-370 రద్దు అధికారం చట్టసభలకు ఉంటుందా?'.. సుప్రీంకోర్టు కీలక ప్రశ్న

author img

By

Published : Aug 2, 2023, 4:54 PM IST

Updated : Aug 2, 2023, 5:22 PM IST

supreme court on 370 abrogation
supreme court on 370 abrogation

Supreme court on 370 abrogation : ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. నిబంధనల ప్రకారం ఆర్టికల్ 370 రద్దు చేసే అధికారం చట్టసభలకు ఉంటుందా అని ప్రశ్నించింది. ఆర్టికల్ రద్దు చేయాలంటే రాజ్యాంగ సభ పాత్రే కీలకమని పిటిషనర్లు వాదించారు.

Article 370 case in supreme court : జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగ అధికరణం 370 రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. ప్రజలు ఎన్నుకున్న చట్టసభకు ఆర్టికల్ 370ని రద్దు చేసే అధికారం ఉంటుందా అని పిటిషనర్లను న్యాయస్థానం బుధవారం ప్రశ్నించింది. పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ సుదీర్ఘ వాదనలు వినిపిస్తూ.. ఆర్టికల్-370ని రాజకీయ చట్టం ప్రకారం రద్దు చేశారని, రాజ్యాంగ ప్రక్రియను అనుసరించి కాదని పేర్కొన్నారు. పార్లమెంట్.. రాజ్యాంగ సభ కాజాలదని, రాజ్యాంగం ప్రకారమే సభ నడుచుకోవాలని వాదించారు. రాజ్యాంగ పరిధిలోకి వచ్చే సంస్థలకు పరిమిత అధికారాలే ఉంటాయని గుర్తు చేశారు.

ఆర్టికల్ 370 రద్దు విషయంలో రాజ్యాంగ సభ పాత్ర కీలకమని అదే ఆర్టికల్​లోని క్లాజ్-3లో ఉందని ధర్మాసనం ముందు సిబల్ వాదించారు. ఈ నేపథ్యంలో స్పందించిన ధర్మాసనం.. జమ్ముకశ్మీర్​కు శాసన అధికారాల విషయంలోనే ప్రత్యేక హక్కులు ఉన్నాయని వ్యాఖ్యానించింది. క్లాజ్-3 ప్రకారం.. ఆర్టికల్ 370 రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుందని ప్రస్తావించింది.

"మీరు చెబుతున్నట్టు.. 1957 తర్వాత ఆర్టికల్ 370ని రద్దు చేయడం కుదరదు. రాజ్యాంగ సభ పదవీకాలం ముగిసిన తర్వాత కూడా ఆర్టికల్ 370లోని క్లాజ్-3 కొనసాగుతుందని అంటున్నారు. కానీ, రాజ్యాంగ సభ 1950 నుంచి 1957 వరకే కొనసాగింది. ఏ రాజ్యాంగ సభ కూడా అపరిమిత కాలం పాటు కొనసాగదు. రాజ్యాంగ సభ పదవీ కాలం ముగిసిన తర్వాత ఏమవుతుంది?"
-ధర్మాసనం

ధర్మాసనం ప్రశ్నలకు స్పందిస్తూ కపిల్ సిబల్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ము కశ్మీర్, కేంద్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం ఉందని, ఆర్టికల్ 370 రద్దు చేయాలా వద్దా అనే అంశంపై భవిష్యత్ కార్యాచరణ రాజ్యాంగ సభనే చూసుకోవాలన్నది ఇరువురి మధ్య ఉన్న అవగాహన అని సిబల్ పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్ ప్రజలు భారత్​తోనే ఉన్నారని, కానీ ఆర్టికల్ 370లో ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని చెప్పారు.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్​కే కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్​తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరుపుతోంది. ఆర్టికల్ 370 రద్దైన ఐదేళ్ల వరకు దీనిపై విచారణ జరగకపోవడంపై మాట్లాడిన కపిల్ సిబల్.. ఇన్నాళ్లు కశ్మీర్ ప్రజలు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని కోల్పోయారని వ్యాఖ్యానించారు. ఆ ప్రాంత ప్రజల్ని ఇన్ని రోజులు ఇలా మౌనంగా ఉంచడం సరైందేనా అని ప్రశ్నించారు. వాదనల సందర్భంగా తాను రాజకీయాల జోలికి వెళ్లబోనని కపిల్ సిబల్ పేర్కొన్నారు. 'నేను ఎవరో ఒకరి పేరు ప్రస్తావిస్తే మరొకరు వచ్చి దాన్ని ఖండిస్తారు. నెహ్రూకు దీనితో సంబంధం లేదు అని అంటారు' అని వ్యాఖ్యానించారు.

'న్యాయం కోసం ఎదురుచూస్తున్నాం'
సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాడానికి దేశంలో మిగిలిన ఏకైక సంస్థ సుప్రీంకోర్టేనని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. ప్రపంచమంతా సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణను గమనిస్తోందని పేర్కొన్నారు. దేశంలోని పౌరుల మాదిరిగానే సుప్రీంకోర్టులో న్యాయం కోసం తాము ఎదురుచూస్తున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు పొరపాటు అని, రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. సుప్రీంకోర్టులో తమ వాదనలు వినిపిస్తామని చెప్పారు.

Last Updated :Aug 2, 2023, 5:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.