ETV Bharat / bharat

ఈనెల 17న అఖిలపక్ష భేటీ.. 18 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

author img

By

Published : Jul 14, 2022, 4:58 AM IST

ఈనెల 18 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావటంతో పాటు అదే రోజు రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో 17న ఉదయం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ నిర్ణయించింది.

ఈనెల 17న అఖిలపక్ష భేటీ
ఈనెల 17న అఖిలపక్ష భేటీ

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈనెల 18న ప్రారంభమవుతాయి. అదేరోజు రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని 17వ తేదీ ఉదయం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ నిర్ణయించింది. సంబంధిత మంత్రి ప్రహ్లాద్‌ జోషి... సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులు, ఎజెండాలోని ఇతరత్రా అంశాల గురించి ఆయా పార్టీల నేతలకు చెప్పి, వారి సహకారం కోరనున్నారు. ప్రధాని మోదీ మర్యాదపూర్వకంగా అఖిలపక్ష సమావేశానికి హాజరవుతారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి భవన్‌లో ఎగువసభా పక్ష నేతలతో భేటీ అవుతారు. సమావేశాల నిర్వహణ, సభ్యుల సహకారంపై ఈ సందర్భంగా చర్చిస్తారు. 16వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్పీకర్‌ ఓం బిర్లా లోక్‌సభాపక్ష నేతలతో సమావేశమై, సభ సజావుగా జరిగేందుకు వారి మద్దతు కోరనున్నారు. వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12తో ముగుస్తాయి.

ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుండటంతో ఆయనకు ఇవే చివరి రాజ్యసభ సమావేశాలు కానున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నిక నిమిత్తం ఈనెల 5న ప్రారంభమైన నామినేషన్‌ ప్రక్రియ 19వ తేదీతో ముగుస్తుంది. అధికార, విపక్షాలు మాత్రం ఇంతవరకూ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే, భాజపా పార్లమెంటరీ బోర్డు ఈనెల 16న ఉపరాష్ట్రపతి అభ్యర్థిని వెల్లడిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రకారం- అధికార కూటమి అభ్యర్థి 18-19 తేదీల్లో ఏదో ఒకరోజు నామినేషన్‌ దాఖలుచేసే అవకాశముంది. ఆగస్టు 6న ఎన్నిక జరుగుతుంది.

16న భాజపా ఎంపీలకు విందు: రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో భాజపా పార్లమెంటరీ పార్టీ ఈనెల 16న తమ పార్టీ ఎంపీలకు ప్రత్యేకంగా విందు ఏర్పాటుచేసింది. పార్టీ జాతీయ నేతలంతా విచ్చేసే అవకాశముంది. ఎంపీలంతా ఆరోజు సాయంత్రం 6.30 గంటలకల్లా పార్లమెంటు భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియానికి చేరుకోవాలని పార్లమెంటరీ పార్టీ కార్యాలయం వర్తమానం పంపింది. ఎన్డీయే కూటమి ఎంపీలు, మంత్రుల సమావేశం మాత్రం 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు పార్లమెంటరీ గ్రంథాలయ భవనంలో జరగనుంది. వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఈనెల 17న విపక్షాలు భేటీ కానున్నాయి. ఈ మేరకు రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రతిపక్ష నేతలందరికీ ఆహ్వానాలు పంపారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.