ETV Bharat / city

Roads: గజానికో గుంత.. దారంతా చింత

author img

By

Published : Jul 14, 2022, 3:48 AM IST

అడుగుకో గొయ్యి.. గజానికో గుంతతో అసలే దారుణంగా ఉన్న రోడ్లు వర్షాకాలపు తొలి ముసురుకే మరింత దయనీయంగా తయారయ్యాయి. నగర, పట్టణ రహదారులకు కొన్ని చోట్ల మరమ్మతులు చేస్తున్నా ఎక్కువ శాతం రోడ్లు ఇంకా అత్యంత అధ్వానస్థితిలో ఉన్నాయి. నిధులున్నా బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదు. దీంతో ప్రధాన కూడలి ప్రాంతాలు, రద్దీ అధికంగా ఉండే దారుల్లోనే చిన్న గుంతలు పెరిగి పెద్దవవుతున్నాయి. వారం నుంచి కురుస్తున్న వానలతో ఇలాంటి గోతుల్లో వాననీరు చేరి కుంటల్లా మారాయి. రాష్ట్రంలోని 15 నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో 'ఈనాడు' 'ఈటీవీ భారత్' ప్రతినిధుల బృందం బుధవారం పరిశీలించగా.. పలు రహదారుల్లో వాహనదారులు పడుతున్న అవస్థలు కళ్లకు కట్టాయి.

గజానికో గుంత
గజానికో గుంత

రాష్ట్రంలో రోడ్ల సొగసు నాలుగు వానలకే బట్టబయలైంది. అసలే అధ్వానంగా ఉన్న నగర, పట్టణ రహదారులన్నీ వానలకు మరింత దెబ్బతిన్నాయి. పెద్ద పెద్ద గుంతల్లో నీళ్లు నిలిచి చెరువుల్లా మారాయి. అందులో దిగితే ఎంత లోతు ఉంటుదో తెలియదు.. దిగకపోతే ప్రయాణం సాగదు.. ఈ గందరగోళం మధ్య వాహనచోదకులు ప్రయాణమంటేనే హడలిపోతున్నారు. నడవడానికి కూడా దారి వెతుక్కోవాల్సిన దుస్థితిలో ఉన్న రహదారులపై ప్రయాణం ఎలాగని బెంబేలెత్తిపోతున్నారు. అద్దం లాంటి రోడ్ల మాట దేవుడెరుగు.. ఈ గుంతలైనా పూడ్చండి మహాప్రభో అని పట్టణ ప్రజలు మొత్తుకుంటున్నా పురపాలక అధికారుల చెవికెక్కడం లేదు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారుల్లోనూ ప్రయాణానికి అవస్థలు పడుతున్నా.. అక్కడా మరమ్మతుల్లేవు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు, కాకినాడలతోపాటు ద్వితీయశ్రేణి నగరాలు, పట్టణాల్లో కాలనీలు, వీధుల్లోని రోడ్లపై అడుగేయడం దుర్భరంగా తయారవుతోంది. రాష్ట్రంలోని 15 నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో ‘ఈనాడు’ ప్రతినిధుల బృందం బుధవారం పలు రహదారులను పరిశీలించింది. వాటిలో అత్యంత దయనీయంగా ఉన్న కొన్నింటి పరిస్థితి ఇదీ.

గుంటూరు జిల్లా: గుంటూరు నగరం మల్లారెడ్డినగర్‌లోని ఇస్కాన్‌ దేవాలయం మార్గంలో.. రహదారి కంటే గోతులే ఎక్కువ. అప్పుడప్పుడు కంకర పోసి వదిలేస్తున్నారు. వానాకాలం రాగానే మళ్లీ గుంతలే దర్శనమిస్తున్నాయి.

.
.

ఎన్టీఆర్‌ జిల్లా: విజయవాడ భవానీపురంలో రహదారిపై గుంతల్లో పెద్ద ఎత్తున నిలిచిన వర్షపునీరు

.
.

భీమవరం దారుల సొగసిదీ..: పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరం నుంచి గ్రామీణ మండలంలోని పలు గ్రామాలు, పట్టణంలోని విద్యా సంస్థలు, ఆసుపత్రులకు వెళ్లే ప్రధాన రహదారి ఇది. రూ.21 లక్షలతో సిమెంట్‌ రోడ్డు నిర్మాణానికి రెండేళ్ల కిందట శంకుస్థాపన చేసినా నేటికీ పనులు పూర్తికాలేదు. దీంతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు. భీమవరం కలెక్టరేట్‌కు వెళ్లే దారిలోనూ ఇదే పరిస్థితి.

.
.

కోనసీమ జిల్లా: మండపేట నుంచి ఏడిద వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారికి మరమ్మతుల్లేవు. మూడు కి.మీ పొడవున్న ఈ రోడ్డంతా గుంతలమయమే. భారీ వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ రహదారి మరమ్మతులను ఎవరూ పట్టించుకోవడం లేదు. అమలాపురం మున్సిపాలిటీలోని నల్లవంతెన - ఎర్రవంతెన మధ్య 1.20 కి.మీ పొడవున్న రహదారిలోనూ 12 పెద్ద గుంతలు, 20 చిన్నగుంతలు పడ్డాయి.

.
.

చిత్తూరు జిల్లా: యాదమర్రి నుంచి ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు వరకు సుమారు 11 కిలోమీటర్ల విస్తీర్ణంలో కనికాపురం వరకు ఎటు చూసినా భారీ గుంతలే. వర్షాకాలం వస్తే వీటిలో నీరు నిలిచి గుంతల లోతెంతో తెలియదు.. ప్రమాదాల్లో కొందరు మృతి చెందినా మరమ్మతులు ఊసెత్తడం లేదు.

.
.

కృష్ణా జిల్లా: గుడివాడ రాజేంద్రనగర్‌ రెండో లైనులో ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటికి వెళ్లే మార్గం దుస్థితి ఇదీ..

.
.

కర్నూలు జిల్లా: కర్నూలు నగరంలో వీకర్‌ సెక్షన్‌కాలనీ ఆటోస్టాండ్‌ వద్ద తారు రోడ్డు వేయకుండా వదిలేశారు. లోతట్టు ప్రాంతం కావడంతో వర్షాలకు నీళ్లు నిలిచిపోతున్నాయి. చాలా కాలంగా సమస్య కొనసాగుతున్నా పట్టించుకున్న నాథుడు లేడు.

.
.

గోతులతో బేజారు: ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో చాటపర్రు వెళ్లే రహదారి పొడవునా గోతులే. ఈ రహదారిని డబుల్‌రోడ్డు చేయాలనే ఉద్దేశంతో మధ్యలో విద్యుత్తు స్తంభాలు అమర్చారు. ఇరుకు దారిలో గోతులను తప్పించే క్రమంలో వాహనదారులు

.
.

‘మహా’ విశాఖ రోడ్లు మరీ..: మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని 88వ వార్డు గవరజగ్గయ్యపాలెంలోని ప్రధాన రహదారి ఇది. ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ కళాశాలలున్న మార్గం కావడంతో విద్యార్థుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. రోజూ వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణించే రహదారిలో వర్షం కురిస్తే రోడ్డు ఎక్కడుందో, గుంత ఎక్కడుందో తెలియని పరిస్థితి.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.