ETV Bharat / bharat

ఉక్రెయిన్​లోని భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు- ఫ్రీగా...

author img

By

Published : Feb 25, 2022, 5:14 PM IST

Indian evacuation from Ukraine: ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారత పౌరులు, విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది కేంద్రం. ఇందుకోసం ఉక్రెయిన్​ సరిహద్దు దేశాలైన రొమేనియా, హంగేరీకి మూడు ప్రత్యేక విమానాలు పంపుతోంది. రోడ్డు మార్గాల ద్వారా సరిహద్దులకు చేరుకున్నవారిని విమానాశ్రయాలకు తరలించి.. అక్కడి నుంచి భారత్​కు తీసుకురానున్నారు.

Indians stranded in Ukraine
భారతీయుల తరలింపునకు ప్రత్యేక విమానాలు

Indian evacuation from Ukraine: ఉక్రెయిన్​పై రష్యా సైనిక చర్య చేపట్టిన క్రమంలో ఆ దేశంలో వేలాది మంది భారత పౌరులు, విద్యార్థులు చిక్కుకుపోయారు. సుమారు 20వేల మంది ఉంటారని అంచనా వేసింది ప్రభుత్వం. వారంతా బాంబుల మోతల మధ్య బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తమను స్వదేశానికి తీసుకెళ్లాలని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. ఉక్రెయిన్​లోని భారతీయుల భద్రతే తమ తొలి ప్రాధాన్యమని ప్రకటించిన కేంద్రం.. ఆ దిశగా చర్యలు చేపట్టింది. వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.

సరిహద్దు దేశాలకు ప్రత్యేక విమానాలు..

ఉక్రెయిన్​లో దాడుల నేపథ్యంలో ఆదేశంలోకి విమానాలు వెళ్లలేని పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో భారత పౌరుల కోసం ఉక్రెయిన్​ సరిహద్దు దేశమైన రొమేనియాకు రెండు ప్రత్యేక విమానాలు పంపించి.. అక్కడి నుంచి తరలించించేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. రొమేనియా రాజధాని బుచారెస్ట్​కు శుక్రవారం రెండు ఎయిర్​ఇండియా విమానాలు వెళ్తున్నట్లు సీనియర్​ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఉక్రెయిన్​-రొమేనియా సరిహద్దుకు రోడ్డు మార్గం ద్వారా చేరిన పౌరులను.. అక్కడి భారత అధికారులు బుచారెస్ట్​కు తరలిస్తారని చెప్పారు. ఆ తర్వాత విమానాల ద్వారా స్వదేశానికి తీసుకొస్తారని వెల్లడించారు. అక్కడి నుంచి శనివారం రెండు విమానాలు భారత్​కు తిరిగి బయలుదేరతాయని చెప్పారు. అయితే.. ఈ విషయంపై ఎయిర్​ఇండియా నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

మరోవైపు.. హంగేరీ రాజధాని బుడాపెస్ట్​కు శనివారం ఓ విమానం వెళ్లనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విమానాల ఖర్చును ప్రభుత్వే భరించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.

భారతీయులకు అడ్వైజరీ

ఉక్రెయిన్​లో చిక్కుకుపోయిన భారత పౌరులు, విద్యార్థులకు అడ్వైజరీ జారీ చేసింది అక్కడి భారత రాయబార కార్యాలయం. రొమేనియా, హంగేరీ మీదుగా స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపింది. ఆయా సరిహద్దుల చెక్​పాయింట్ల వద్ద భారత బృందాలు ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో అప్రమత్తంగా, భద్రంగా, ధృడంగా ఉండాలని సూచించింది. విదేశాంగ శాఖ బృందాల సమన్వయంతో సరిహ్దదులు దాటాలని స్పష్టం చేసింది. తమతో పాస్​పోర్టులు, నగదు సహా ఇతర అత్యవసర వస్తువులను తీసుకెళ్లాలని సూచించింది. అందుబాటులో ఉంటే కొవిడ్​-19 వ్యాక్సినేషన్​ ధ్రువపత్రం తీసుకెళ్లాలని కోరింది.

ప్రధానికి ఐఎంఏ విజ్ఞప్తి..

ఉక్రెయిన్​లో చిక్కుకుపోయిన వైద్య విద్యార్థులను తరలించేందుకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీని కోరింది భారత వైద్య సంఘం(ఐఎంఏ). రష్యా మిలిటరీ ఆపరేషన్​తో పెరిగే విమాన ఛార్జీలను చాలా మంది విద్యార్థులు భరించే పరిస్థితులు లేవని పేర్కొంది. వారికి ఆర్థికంగా సాయం అందించాలని, హెల్ప్​డెస్క్​ ఏర్పాటు చేయాలని కోరింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నట్లు గుర్తు చేసింది.

ఇదీ చూడండి: 'ఉక్రెయిన్​లోని భారతీయుల భద్రతకే అధిక ప్రాధాన్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.