ETV Bharat / bharat

'ఆధార్‌తో ప్రభుత్వానికి రూ.2 లక్షల కోట్లు ఆదా'

author img

By

Published : Jun 2, 2022, 3:35 PM IST

NITI Aayog ceo: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు పునాదిలా నిలుస్తోన్న ఆధార్‌తో నకిలీలను గుర్తించడం ద్వారా ప్రభుత్వానికి రూ.2లక్షల కోట్లకుపైగా ఆదా అయినట్లు నీతి ఆయోగ్​ సీఈఓ అమితాబ్​ కాంత్​ తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్​ ఓ పునాదిలా మారిందన్నారు.

Aadhaar
ఆధార్‌

NITI Aayog ceo: ప్రపంచంలోనే అత్యుత్తమ బయోమెట్రిక్‌ ఆధారిత గుర్తింపు కార్యక్రమం 'ఆధార్‌' అని నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు పునాదిలా నిలుస్తోన్న ఆధార్‌తో నకిలీలను గుర్తించడం ద్వారా ప్రభుత్వానికి రూ.2లక్షల కోట్లకుపైగా ఆదా అయినట్లు చెప్పారు. ఆధార్‌ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు తీసుకున్న చర్యలపై దిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన అమితాబ్‌కాంత్‌ ఈ వివరాలు వెల్లడించారు.

"315 కేంద్ర పథకాలు, 500 రాష్ట్ర పథకాలు సమర్థంగా అమలు చేసేందుకు ఆధార్‌ను వినియోగించుకోవడం అభినందనీయ విషయం. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్‌ ఓ పునాదిలా మారింది. మధ్యవర్తుల ప్రమేయం, ఎటువంటి అంతరాయాలు లేకుండా లబ్ధిదారులకు వేగంగా ప్రయోజనాలు నేరుగా అందించింది. దీంతో పాటు నకిలీలను నిర్మూలించడం వల్ల ప్రభుత్వానికి రూ.2లక్షల కోట్లకుపైగా ఆదా అయ్యింది. ఇతర దేశాల్లోనూ ఈ విధానాన్ని అవలంబించే అవకాశాలపై ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలతో చర్చలు జరిపాం."

- నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌.

ఆధార్‌ కార్డు ఎక్కడైనా ఇవ్వాల్సి వస్తే మాస్క్‌డ్‌ కార్డు జిరాక్స్‌ను మాత్రమే ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలను జారీ చేసింది. పలు సందర్భాల్లో ఆధార్‌ కార్డులు దుర్వినియోగం అవుతున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ఈ మార్గదర్శకాలను విడుదల చేసినట్లు తెలిపింది. అయితే, దీనిపై విమర్శలు రాగా వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం.. మాస్క్‌డ్‌ ఆధార్‌పై ఇచ్చిన మార్గదర్శకాలను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది. ఆధార్‌ వినియోగంలో పౌరులు అప్రమత్తంగా ఉంటే సరిపోతుందన్న ప్రభుత్వం.. యూఐడీఏఐ వ్యవస్థను అత్యంత పటిష్ఠంగా రూపొందించామని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: ఆధార్‌కార్డుపై మీ ఫొటో మార్చాలనుకుంటున్నారా? ఇలా చేయండి..

'ఆధార్ జిరాక్స్' సూచనలపై కేంద్రం యూటర్న్.. మళ్లీ ఏమైందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.