ETV Bharat / bharat

బహిర్భూమికి వెళ్లిన మహిళపై గ్యాంగ్​రేప్​.. నోట్లో వస్త్రాన్ని కుక్కి.. బలవంతంగా..

author img

By

Published : Dec 21, 2022, 11:22 AM IST

Updated : Dec 21, 2022, 11:35 AM IST

పొలానికి మలవిసర్జన కోసం వెళ్లిన మహిళపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. రాజస్థాన్​లో జరిగిందీ ఘటన. మరోవైపు, కర్ణాటకలోని దివ్యాంగురాలైన కన్నకూతురిని గొంతు కోసి హత్య చేసింది ఓ తల్లి. ఆపై తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

a woman was thrashed and gangraped by two men in jaipur rajasthan
a woman was thrashed and gangraped by two men in jaipur rajasthan

రాజస్థాన్​లోని జైపుర్​లో దారుణ ఘటన వెలుగుచూసింది. పొలానికి మలవిసర్జన కోసం వెళ్లిన మహిళపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముహనా ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల బాధితురాలు.. తన ఇంటి సమీపంలో ఉన్న పొలానికి మలవిసర్జన కోసం వెళ్లింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఇద్దరు దుండగులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. నోటిలో వస్త్రాన్ని పెట్టి బలవంతంగా అత్యాచారం చేశారు. అనంతరం నిందితులిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు.

వెంటనే బాధితురాలు తన కుటుంబసభ్యులకు విషయాన్ని తెలపగా.. ఆమెను స్థానిక ప్రైవేట్​ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా మారడం వల్ల సంగనేరి మహిళా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలికి వెళ్లి ఆధారాలు సేకరించారు. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

కన్నకూతురిని చంపి.. ఆపై
కర్ణాటకలోని బెంగళూరులో దారుణం జరిగింది. దివ్యాంగురాలైన కన్నకూతురిని గొంతు కోసి హత్య చేసింది ఓ తల్లి. ఆపై తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అసలేం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. బెంగళూరులో నివాసం ఉంటున్న ఓ మహిళ(28) భర్త కొన్నాళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి దివ్యాంగురాలైన తన కుమార్తె(14)తో ఉంటోంది. ఈ క్రమంలోనే మంగళవారం తన కుమార్తె గొంతుకోసి చంపేసింది మహిళ. అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్థానికులు గమనించి తల్లీకూతుళ్లను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే బాలిక మరణించిందని వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

విద్యార్థి హత్య.. తల్లిపై దాడి
కర్ణాటకలోని గడగ్​ జిల్లా విద్యార్థితో పాటు సహచర ఉపాధ్యాయురాలిపై దారుణంగా దాడి చేసిన టీచర్‌ను పోలీసులు.. మంగళవారం అరెస్టు చేశారు. అతడి దాడిలో విద్యార్థి మృతి చెందాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని హడ్లీ ప్రభుత్వ పాఠశాలలో భరత్ ​అనే పదేళ్ల బాలుడు చదువుతున్నాడు. అతడి తల్లి గీతా బరాకర్​ కూడా అదే స్కూల్​లో పనిచేస్తున్నారు. ఇటీవలే కాలంలో గీత వేరే ఉపాధ్యాయుడితో కొంచెం సన్నిహితంగా ఉంటుంది. దీంతో నిందితుడు ముత్తప్ప తట్టుకోలేకపోయాడు. ఆమెపై కోపం పెంచుకున్నాడు.

సోమవారం ఉదయం ముత్తప్ప.. భరత్​ తరగతికి వెళ్లి విద్యార్థులందరికీ బయటకు పంపేశాడు. గడ్డపారతో భరత్​పై దాడి చేశాడు. అడ్డుకునేందుకు వచ్చి తల్లి గీతపై కూడా దాడికి పాల్పడ్డారు. వెంటనే మిగతా పాఠశాల సిబ్బంది తల్లీకొడుకులను ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాలుడు ఆస్పత్రిలోనే మరణించాడు. ప్రస్తుతం గీత చికిత్స పొందుతోంది. పాఠశాల ప్రిన్సిపల్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముత్తప్పను అరెస్ట్​ చేశారు.

'గేమ్​ ఓవర్​!'..విద్యార్థిని సూసైడ్..
గుజరాత్​లోని సూరత్​లో​ ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. గేమ్​ ఓవర్​ అని రాసి ఉన్న టీషర్ట్​ ధరించి మరీ ఆమె సూసైడ్​ చేసుకుంది.
నగరంలో ఉన్న ఓ​ కాలేజ్​లో బీహెచ్​ఎంఎస్​ తృతీయ సంవత్సరం చదువుతోంది బాధితురాలు. కొన్నిరోజులుగా ఆమె ఏటీకేటీ పరీక్షకు సిద్ధమవుతోంది. పరీక్షకు హాజరయ్యే మందుకు చాలా ఒత్తిడికి గురైంది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. అదే సమయంలో గేమ్​ ఓవర్​ అని రాసి ఉన్న టీషర్ట్​ను ఆమె​ ధరించింది. బయటకు వెళ్లి వచ్చిన తల్లిదండ్రులు.. ఇంటికి వచ్చి కుమార్తె మృతదేహం చూసి కన్నీరుమన్నీరయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. సమచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

'మృతదేహం వేలాడుతుంది.. వెళ్లి చూడు..'
ఉత్తర్​ప్రదేశ్​లోని హమీర్​పుర్​లో ఓ మహిళ ఆడియో చర్చనీయాంశంగా మారింది. తన మృతదేహం అడవిలో వేలాడుతుందని, వెళ్లి చూడమని ఓ మహిళ ఏడుస్తూ చెబుతుంది. అయితే ఈ ఆడియోను ఈటీవీ భారత్​ ధ్రువీకరించలేదు.
స్థానికుల సమాచారం ప్రకారం.. నిషా అనే మహిళ సోదరుడితో ఫోన్​లో మాట్లాడిన ఆడియో అది. తన మృతదేహం అడవిలో చెట్టుకు వేలాడుతుందని వెళ్లి చూడమని ఏడుస్తూ చెబుతుంది. అయితే అదే మహిళ కనిపించట్లేదని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ కేసు ఛేదించేందుకు తలపట్టుకుంటున్నారు.

Last Updated : Dec 21, 2022, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.