రెచ్చిపోయిన దొంగలు- కస్టమర్స్​లా జువెల్లరీ షాప్​లోకి చొరబడి యజమానిపై దాడి!

By ETV Bharat Telugu Team

Published : Feb 5, 2024, 2:12 PM IST

thumbnail

Attack On Jewellery Shop Owner : ఉత్తరాఖండ్​ దెహ్రాదూన్‌ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఆభరణాల చోరీ కోసం కస్టమర్స్​లా నగల దుకాణంలోకి చొరబడి, వెంట తెచ్చుకున్న ఆయుధాలతో యజమానిపై దాడికి దిగారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు షాప్​లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్​ అయ్యాయి. ఈ దోపిడీ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్​ చేశారు. మరో నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

వికాస్​నగర్​ కొత్వాలి బజార్​ చౌకీ ప్రాంతంలో ఉన్న రాణా జువెల్లర్స్​లో ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ముగ్గురు నిందితులు మొహాలకు ముసుగులు వేసుకొని దుకాణంలోకి ప్రవేశించారు. నగల చోరీకి వచ్చిన వీరిలో ఇద్దరు నిందితులు షాప్​ ద్వారం వద్ద నిలబడి ఉండగా, మరో వ్యక్తి కౌంటర్​లో కూర్చున్న యజమానితో ఏదో మాట్లాడుతూ కనిపించాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి వెంట తెచ్చుకున్న పిస్టోల్​ను తీసి షాప్​ ఓనర్​పై గురిపెట్టాడు. అనంతరం అతడిపై దాడి చేశాడు. దీంతో అప్రమత్తమైన యజమాని ఆ దుండగుడిపై ప్రతిఘటించాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న బల్లపైకి ఎక్కి దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తూ దుకాణం బయటకు లాక్కేళ్లాడు. ఇది చూసిన స్థానికులు వెంటనే అక్కడకు చేరుకొని అతడిని పట్టుకున్నారు. వెంటనే వికాస్‌నగర్​ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడి వద్ద ఉన్న పిస్టోల్​ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అరెస్ట్ చేశారు.

షాప్​ యజమాని దాడిని ప్రతిఘటిస్తూ బయటకు వచ్చిన క్రమంలో అక్కడే ఉన్న మరో ఇద్దరు నిందితులు భయంతో పరారయ్యారు. వీరి కోసం చేపట్టిన గాలింపు చర్యల్లో భాగంగా అసన్​ బ్యారేజీ వద్ద మరో దొంగను పట్టుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో పోలీసులపైనే కాల్పులకు దిగాడు నిందితుడు. ఇదే సమయంలో నిందితులిద్దరిలో మూడో దుండగుడు తప్పించుకున్నాడు. ఇతడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు దెహ్రాదూన్‌ ఎస్పీ అజయ్​ సింగ్​ తెలిపారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.