ETV Bharat / state

ఎన్నికల కోడ్ ఎఫెక్ట్‌ - సార్వత్రిక సమరం తర్వాతే ఎల్ఆర్ఎస్‌కు ఛాన్స్!

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 20, 2024, 11:06 AM IST

Telangana LRS Scheme 2024 : తెలంగాణలో అనుమతి లేని లేఅవుట్లను మార్చి 31లోగా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సర్కార్ ఇంకా మార్గదర్శకాలు జారీ చేయలేదు. దీంతో ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. మరోవైపు ఇంతలోనే ఎలక్షన్‌ కోడ్ అమల్లోకి రావడంతో గడువులోగా దీనిని పూర్తి చేయడం సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Telangana LRS Scheme
Telangana LRS Scheme

Telangana LRS Scheme 2024 : రాష్ట్రంలో లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌) ( LRS Scheme in Telangana)నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేందుకు మార్గదర్శకాలు జారీ కాకపోవడంతో ఇప్పుడు సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మార్చి 31 లోగా క్రమబద్ధీకరణను పూర్తి చేయాలని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి గడిచిన నెలలో అధికారులకు ఆదేశాలిచ్చారు. తక్కువ వ్యవధిలో పూర్తి చేయాలంటే గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను మార్చాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రక్రియను కుదిస్తూ ముసాయిదాను రూపొందించి తెలంగాణ సర్కార్‌కి పంపారు. వీటిపై ఉత్తర్వుల జారీలో జాప్యం జరిగింది.

LRS Applications Regularization 2024 : ఈలోగా ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. క్రమబద్ధీకరణ ప్రక్రియకు 2020 నుంచి అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకున్న మీదట నిర్వహించాలన్న సూచనలను సైతం అధికారులు పరిశీలించినప్పటికీ ముందడుగు వేసేందుకు తర్జనభర్జన పడుతున్నారు.

మూడేళ్లకు ఎల్‌ఆర్‌'ఎస్‌' - సర్కారు నిర్ణయంతో హెచ్​ఎండీఏకు రూ.1000, జీహెచ్​ఎంసీకి రూ.450 కోట్లు

ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకోవాల్సినంత అత్యవసర వ్యవహారం కాదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సమయం కూడా కేవలం 11 రోజులు మాత్రమే ఉంది. దరఖాస్తుల పరిశీలనకు, సొమ్ము చెల్లించేందుకు నోటీసులు పంపిన తర్వాత కనీసం వారం నుంచి పది రోజుల గడువు ఇవ్వాల్సి ఉంటుంది. ఆయా అంశాలను పరిశీలించిన మీదట ప్రస్తుతానికి ఈ ప్రక్రియ నిర్వహించటం సాధ్యం కాదని ఆ అధికారి వివరించారు. రాష్ట్రంలో జూన్‌ తొలివారం వరకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఆ తర్వాతే ఈ అంశం మళ్లీ తెరమీదకు వచ్చే అవకాశం ఉంది.

Telangana Govt On LRS Applications : ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం 2020 సంవత్సరంలో ఎల్‌ఆర్‌ఎస్‌ కింద స్వీకరించిన అర్జీలను మార్చి 31లోగా క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకుంది. గడువులోగా వాటిని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వక్ఫ్, దేవాదాయ, ప్రభుత్వ, కోర్టు ఆదేశాలు ఉన్న భూములు మినహా ఇతర లేఅవుట్‌లను క్రమబద్ధీకరించనున్నారు. మరోవైపు క్షేత్రస్థాయి పరిశీలన తరవాత సుమారు 20 శాతం దరఖాస్తులు అర్హమైనవి కావని అధికారులు గుర్తించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారం ద్వారా వివిధ రూపాల్లో తెలంగాణ సర్కార్‌కు సుమారు రూ.6,000ల కోట్లకు పైగా ఆదాయం లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అనుమతిలేని లేఅవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్ల క్రమబద్ధీకరణకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ రూల్స్‌-2020 పేరిట 2020 ఆగస్ట్ 31న ఉత్తర్వులు ఇచ్చింది. దరఖాస్తు చేసుకునేందుకు అదే సంవత్సరం సెప్టెంబరు 15వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. ఇందులో భాగంగా 25 లక్షలకు పైగా అర్జీలు అందాయి. అయితే ఈ మేరకు క్రమబద్ధీకరణను చేపట్టే క్రమంలో న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిన విషయం తెలిసిందే.

ఎలాంటి ఛార్జీలు లేకుండా ఎల్ఆర్ఎస్‌ అమలు చేయండి - ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేటీఆర్ లేఖ

ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా చేయాలని డిమాండ్ - రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టిన బీఆర్‌ఎస్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.