కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం - ఆరుగురు మృతి - Kodad Road accident today

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 25, 2024, 6:28 AM IST

Updated : Apr 25, 2024, 2:25 PM IST

Kodad Road accident today
Kodad Road accident today ()

Kodad Road accident Today : సూర్యాపేట జిల్లా కోదాడ దుర్గాపురం స్టేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఆరుగురు మరణించారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.

కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం - ఆరుగురు మృతి

Road Accident in Kodad at Suryapet District : సరిగ్గా రెండు రోజుల క్రితం ఆగి ఉన్న లారీ కిందకు కారు వెనక నుంచి దూసుకెళ్లి దంపతులు మృతి చెందిన ఘటన మరువక ముందే అదే తరహాలో సేమ్​ ప్రాంతంలో మరో ఘటన చోటుచేసుకుంది. కోదాడ పట్టణ బైపాస్​ రోడ్డుపై తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారుతో ఢీకొట్టి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోదాడ మండలం చిమిర్యాలకు చెందిన జల్లా శ్రీకాంత్​కు ఖమ్మం జిల్లా బోనకల్లు ప్రాంతానికి చెందిన నాగమణికి కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు లాస్య, లావణ్య ఉన్నారు. శ్రీకాంత్​ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోగా ఉపాధి కోసం హైదరాబాద్​లో ఉంటున్న అత్తామామలతో కలిసే ఉంటున్నారు.

మణికొండలో ఉంటున్న శ్రీకాంత్​ కారు డ్రైవర్​గా పని చేస్తున్నాడు. చిన్న కుమార్తె లావణ్య చెవులు కుట్టించేందుకు శ్రీకాంత్​ దంపతులు, అత్తామామ, వారి కుమార్తె, అల్లుడు, వారి పిల్లలు మొత్తం పది మంది కారులో విజయవాడకు బయలుదేరారు. అక్కడ ఉన్న గుణదల చర్చ్​కు వెళ్లాల్సి ఉంది. శ్రీకాంత్​ సొంతూరైన చిమిర్యాలలో బంధువులను కారులో ఎక్కించుకుని వెళ్లాల్సి ఉండగా 5.30 ప్రాంతంలో కోదాడ బైపాస్​ వద్దకు వచ్చారు. ఇదే సమయంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన శ్రీకాంత్​ కారు బలంగా ఢీకొట్టింది.

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం - ముగ్గురు యువకులు దుర్మరణం

ఘటనాస్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ : ఈ ప్రమాదంలో శ్రీకాంత్‌తో పాటు తన పెద్ద కుమార్తె లాస్య, అత్తామామలు మాణిక్యమ్మ, చంద్రారావు, బావమరిది కృష్ణంరాజు, ఆయన భార్య స్వర్ణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాంత్‌ భార్య నాగమణి, వారి చిన్న కుమార్తె లావణ్య, పిల్లలు కౌశిక్‌, కార్తీక్‌లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని వెంటనే కోదాడ ఆస్పత్రికి తరలించారు. కారులో ఇరుక్కుపోయిన ఆరుగురి మృతదేహాలను అతికష్టమ్మీద బయటికి తీశారు. ఘటనాస్థలిని ఎస్పీ రాహుల్ హెగ్డే పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి పరిస్థితిపై ఆరా తీశారు.

"ఈరోజు ఉదయం 4.30 గంటలకు ఒక కారులో 10 మంది కుటుంబ సభ్యలు ప్రయాణిస్తున్నారు. అందులో నలుగురు చిన్నారులు, మిగిలిన వారు పెద్దవారు. కోదాడ దగ్గరలో ఎన్​హెచ్​ 65 మీద ఒక లారీ బ్రేక్​ డౌన్​ అయి నిలిపి ఉంటుంది. వీరి కారు అతివేగంగా వచ్చి లారీని ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిని వెంటనే కోదాడ ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకుని పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు." - రాహుల్​ హెగ్దే, ఎస్పీ

ఒకే బైక్​పై ప్రయాణం - బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి

పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం- ట్రాలీ ఢీకొని 9మంది మృతి

Last Updated :Apr 25, 2024, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.