ETV Bharat / state

చెరువుల ఆక్రమణపై అడ్వొకేట్‌ కమిషన్‌ రిపోర్ట్ - ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 17, 2024, 11:55 AM IST

Ponds Encroachment in Hyderabad : హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 13 చెరువులు ఆక్రమణలకు గురైనట్లు అడ్వొకేట్ కమిషన్ నిర్ధారించింది. వ్యర్థాలు, మురుగునీరు, ఆక్రమణలే చెరువుల ఉనికికి ప్రమాదకరంగా తయారయ్యాయని పేర్కొంది. చెరువుల కాలుష్యం పర్యావరణం పైనే కాకుండా ప్రజల ఆరోగ్యాలపై సైతం తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.

Advocate Commission Report on Lakes Encroachment
Ponds Encroachment in Hyderabad

చెరువుల ఆక్రమణపై అడ్వొకేట్‌ కమిషన్‌ 13 చెరువులను సందర్శించి రిపోర్ట్

Ponds Encroachment in Hyderabad : ఒక్కప్పుడు పక్షులు, జలచరాలకు సహజ సిద్ధమైన ఆవాసాలుగా ఉండే చెరువులు ప్రస్తుతం కాలుష్యం, ఆక్రమణల కారణంగా అంతరించిపోతున్నాయని అడ్వొకేట్ కమిషన్ తెలిపింది. హైదరాబాద్‌ నగరంలోని చెరువుల ఆక్రమణలపై చర్యలు తీసుకోకపోవడంపై 2007లో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారించిన హైకోర్టు ధర్మాసనం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వం నివేదికలోని అంశాలను, వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అడ్వొకేట్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

ఈ కమిటీ ఇటీవల 13 చెరువులను సందర్శించి నివేదిక సమర్పించింది. వ్యర్థాల తొలగింపు పూడిక తీయడం, ఆక్రమణలను తొలగించడంతో పాటు నాలాలను పరిరక్షించి నీటి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. చెరువులు, కాలుష్యం, ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు తదితర కేసుల సత్వర పరిష్కారానికి హైకోర్టు పరిధిలో గ్రీన్ బెంచ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచించింది.

Lakes Encroachment in Hyderabad : ఎఫ్​టీఎల్​ నిర్ధారణ శాస్త్రీయంగా నిర్వహించి తుది నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉందని తెలిపింది. బఫర్‌ జోన్‌లోని పట్టా భూములకు తగిన పరిహారం ఇచ్చి స్వాధీనం చేసుకోవాలని తద్వారా భవిష్యత్‌లో ఆక్రమణలకు, వివాదాలకు అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొంది. ఆక్రమణదారులపై చర్యలు తీసుకునేలా ఇరిగేషన్ శాఖకు తగిన అధికారాలు కల్పించాలని ఉమ్మడిగా కృషి చేస్తేనే చెరువుల పరిరక్షణ సాధ్యమని పేర్కొంది.

Ponds Stink In Hyderabad : జలసిరి.. పీల్చలేం ఊపిరి.. భాగ్యనగరంలో కంపు కొడుతున్న కాసారాలు

కుతుబ్‌షాహీ కాలంలో దుర్గం చెరువు గోల్కొండవాసులకు తాగునీటిని అందించిందన్న అడ్వొకేట్‌ కమిషన్‌ అందులో ప్రత్యేకమైన రాళ్లు కూడా ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం 160 ఎకరాలుండగా బఫర్ జోన్‌లో 146, ఎఫ్​టీఎల్​లో 78 అక్రమ నిర్మాణాలున్నాయని నివేదించింది. దుర్గం చెరువు నుంచి మల్కా చెరువును కలిపే నాలాను సైతం సంరక్షించాల్సి ఉందని తెలిపింది.

సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ సర్వే 2014లో నిర్వహించగా 108 అక్రమ నిర్మాణాలున్నాయని మురికినీటి మళ్లింపు జరిగిందని సీసీ కెమెరాలు లేవని అడ్వొకేట్ కమిషన్ తెలిపింది. నానక్​రామ్​గూడలోని మేడికుంట చెరువు ఎఫ్టీఎల్‌ను 7.50 ఎకరాలుగా గుర్తించారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఒక నిర్మాణం ఉందని ఫెన్సింగ్ పని జరుగుతోందని. మురుగునీటి మళ్లింపు పని పూర్తయిందని అధికారులు చెబుతున్నా ఇంకా కొనసాగుతున్నట్లు గుర్తించామని అడ్వొకేట్ కమిషన్ వెల్లడించింది.

నల్లగండ్ల చెరువులో 89 ఎకరాల ఎఫ్​టీఎల్​ ఉందని ఫెన్సింగ్, వాకింగ్ ట్రాక్ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని కెమెరాలు, రక్షణ గార్డులు ఏర్పాటు చేయలేదని పేర్కొంది. ఇది అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతోందని 24 గంటలూ పోలీసు నిఘా అవసరమని అడ్వొకేట్ కమిషన్ అభిప్రాయపడింది. అడ్వొకేట్ కమిషన్ 13 చెరువులను పరిశీలించగా ప్రతి చెరువు ఆక్రమణకు గురవడంతో పాటు మిగిలిన ప్రాంతం మొత్తం కలుషిత నీరు, దుర్గందంతో నిండిపోయిందని తేల్చింది. ఈ చెరువుల్లోని మురుగునీటితో పండించిన ఆకు కూరలు, కూరగాయాలతోపాటు చేపలను వినియోగిస్తున్న ప్రజల ఆరోగ్యాలపై కూడా ప్రభావం ఉందని అడ్వొకేట్ కమిషన్ పేర్కొంది.

గ్రేటర్​లో చెరువులు మాయం... వరదలకు ఆక్రమణలే కారణం!

ప్లాట్లుగా మారిపోతున్న చెరువులు.. కాలనీలను ముంచెత్తుతున్న వరదలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.