ETV Bharat / state

భూ హక్కులకు మడతపెట్టేందుకే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ 2022!

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 24, 2024, 8:15 AM IST

Land Titling Act 2022: అరాచకాలకే చట్టబద్ధత కల్పిస్తోంది వైఎస్సార్సీపీ సర్కార్‌. ఆంధ్రప్రదేశ్‌ భూ యాజమాన్య హక్కు చట్టం-2022 పేరిట ప్రజల స్థిరాస్తులపై గునపం దింపుతోంది. కొత్తగా తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌లో పొందుపరిచిన సెక్షన్లు ఒకదానిని మించి మరొకటి ప్రజల స్థిరాస్తుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

Land_Ownership_Right_Act_2022
Land_Ownership_Right_Act_2022

భూ హక్కులకు మడతపెట్టేందుకే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ 2022!

Land Titling Act 2022 : మీకు స్థిరాస్తులున్నాయా? అవి మీవేనని రుజువేంటి? దస్తావేజులుంటాయి కదా అంటారా? ఇక అవన్నీ మడతపెట్టి బీరువాలో పెట్టుకోవడమే! మీ భూ యజమాన్య హక్కులు చిక్కుల్లో పడ్డాయి. ఆస్తులు మీవేనని మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితులొచ్చేశాయి. లేదంటే వేరెవరైనా క్లెయిమ్ చేసేసుకోవచ్చు. రెండేళ్లలోగా మేల్కోకపోతే ఇక పరాయిపరమైనట్లే. కోర్టుల అధికారాలకు కత్తెర వేసి, ప్రజల భూ హక్కులకు పాతరేస్తోంది జగన్‌ సర్కార్‌! ప్రజల స్థిరాస్తులకు 2022 ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్‌ పేరిట ల్యాండ్‌ మైన్‌ పెట్టేసింది. అది పేలడం, భూ వివాదాలు బద్ధలవడం ఎంతో దూరంలోలేదనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Land Ownership Right Act 2022 in Andhra Pradesh : అరాచకాలకే చట్టబద్ధత కల్పిస్తోంది వైఎస్సార్సీపీ సర్కార్‌ (YSRCP Government)! ఆంధ్రప్రదేశ్‌ భూ యాజమాన్య హక్కు చట్టం-2022 పేరిట ప్రజల స్థిరాస్తులపై గునపం దింపుతోంది. కొత్తగా తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌లో పొందుపరిచిన సెక్షన్లు ఒకదానిని మించి మరొకటి ప్రజల స్థిరాస్తుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ చట్టంలోని సెక్షన్‌-5 ప్రకారం ఈ చట్టం అమల్లో టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌-టీఆర్‌వోలే కీలకం. టీఆర్‌వోల్ని నియమించే అధికారం భూపరిపాలనాశాఖ పరిధిలోని ఏపీ ల్యాండ్‌ అథారిటీకి కట్టబెట్టారు. ఐతే అసలు వారికి ఉండాల్సిన అర్హతలేంటి? టీఆర్‌వోలుగా తహసీల్దార్లకు ప్రాధాన్యమిస్తారా? లేదంటే వాలంటీర్‌ వ్యవస్థలా నచ్చిన వారిని తెచ్చిపెట్టుకుంటారా? స్పష్టత లేదు. రాజకీయ నేతల చెప్పుచేతల్లో ఉండే వారినే నియమిస్తే టైటిల్‌ రిజిస్టర్‌లో అసలు యజమానుల పేర్లకు బదులు ఇతరుల పేర్లు చేర్చి భూకబ్జాలకు తెగించే ప్రమాదం లేకపోలేదు.

భూహక్కు చట్టంపై హైకోర్టులో విచారణ - కౌంటర్ దాఖలుకు మరో 2 వారాల సమయం

ఇదే చట్టంలోని సెక్షన్‌-6ను కొత్త వివాదాలకు ఆస్కారమిచ్చేలా రూపొందించారు. దీని ప్రకారం నోటిఫైడ్‌ ప్రాంతంలోని అన్ని స్థిరాస్తులకు సంబంధించి హద్దుల వివరాలతో కూడిన రికార్డులను టీఆర్‌వో తయారు చేయాలి. ఇందుకోసం ప్రజలు తమ వద్ద ఉన్న దస్తావేజులు, ఇతర వివరాలను టీఆర్‌వోకి చూపించాలి. ఆయన సంతృప్తి మేరకు 'టైటిల్‌ రిజిస్టర్‌'లో యజమాని పేరు చేరుస్తారట. రిజిస్టర్‌లో పేరు చేరితేనే యాజమాన్య హక్కులొస్తాయట! అంటే రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో లక్షల రూపాయలు స్టాంప్‌ డ్యూటీగా చెల్లించి పొందిన దస్తావేజులకు విలువే ఉండదు. టీఆర్‌వో ఎవరికి ధ్రువపత్రం ఇస్తే వారే యజమానులు.

ఒకవేళ ఏదైనా ఆస్తి తనదని ఎవరైనా తప్పుడు క్లెయిమ్‌ దాఖలు చేస్తే, దాన్ని వివాదంలో ఉన్నట్లుగా 'డిస్‌ప్యూట్‌ రిజిస్టర్‌'లో టీఆర్‌వో నమోదు చేస్తారు. వెంటనే సమస్య జాయింట్‌ కలెక్టర్‌ హోదాకు తగ్గని స్థాయి అధికారిగా ఉండే ల్యాండ్‌ టైటిలింగ్‌ అప్పిలేట్‌ ఆఫీసర్‌- ఎల్​టీఏఓ ముందుకు వెళ‌్తుంది. అక్కడ తేలేదాకా ఆ ఆస్తిపై ఎలాంటి లావాదేవీలకు అవకాశముండదు. అంటే గిట్టని వ్యక్తులెవరైనా డిస్‌ప్యూట్‌ రిజిస్టర్‌లో నమోదు చేయించే అవకాశాలు కల్పించారు.

టీఆర్‌వో రికార్డుల్లో ఒకసారి పేరు చేర్చాక ఎవరూ అభ్యంతరం చెప్పకపోతే రెండేళ్ల తర్వాత ఆ పేరుగల వ్యక్తే యజమాని అవుతారని సెక్షన్‌-13లో పేర్కొన్నారు. అదే బలమైన సాక్ష్యమని పొందుపరిచారు. ఐతే టైటిల్‌ రిజిస్టర్‌ను ఆన్‌లైన్లో ఉంచుతామని ఎక్కడా చట్టంలో చెప్పలేదు! ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌, పహాణీల గురించిన ప్రస్తావనే లేదు. అలాగైతే రిజిస్టర్‌లో ఎవరి పేరు నమోదు చేశారో నిరక్షరాస్యులు, రైతులు సులువుగా తెలుసుకోగలరా? అధికారులు రిజిస్టర్లను గోప్యంగా ఉంచి, అవినీతికి పాల్పడరని గ్యారెంటీ ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

భూహక్కు చట్టంతో ప్రజలకు తీవ్ర నష్టం - వెంటనే రద్దు చేయాలంటూ న్యాయవాదుల నిరసనలు

ఇక టైటిల్‌ రిజిస్టర్‌లో పేరు చేర్చే వ్యవహారంపై వివాదం తలెత్తితే హైకోర్టులో మాత్రమే రివిజన్‌ పిటిషన్‌ వేసుకోవాలని సెక్షన్‌ 16లో పేర్కొన్నారు. ఐతే సామాన్యులకు నేరుగా హైకోర్టును ఆశ్రయించే స్థోమత ఉంటుందా? ప్రజలకు భౌగోళికంగా చేరువలో ఉండే సివిల్‌ కోర్డులను భూ వివాదాలలో జోక్యం చేసుకోకుండా పూర్తిగా దూరం పెట్టడం కుట్రపూరితమనే అనుమానాలున్నాయి. ఇక సెక్షన్‌ 18 ప్రకారం భూ యాజమాన్య హక్కులకు సంబంధించి ఇప్పటికే సివిల్‌ కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పెండింగ్‌లో ఉంటే సంబంధిత వ్యక్తులు ఈ విషయాన్ని టీఆర్‌వో దృష్టికి తీసుకెళ్లి రికార్డులో నమోదు చేయించుకోవాలట.

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిన ఆర్నెళ్లలో టీఆర్‌వో నుంచి ధ్రువపత్రం పొంది దాన్ని సంబంధిత కోర్టులో దాఖలు చేయాలని, వివాదాన్ని పరిష్కరిస్తూ న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వులను 15 రోజుల్లోపు టీఆర్‌వో దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. అలా చేయడంలో విఫలమైతే కోర్టులిచ్చిన తీర్పులు అమలు సాధ్యం కాదని స్పష్టంగా పేర్కొన్నారు. ఒకవేళ సంబంధిత యజమాని 15 రోజుల్లోగా టీఆర్‌వోను కలవలేకపోయినా, టీఆర్‌వోనే అందుబాటులో లేకపోయినా బాధ్యత ఎవరు వహిస్తారనేది అంతుచిక్కడం లేదు.

ఇక టీఆర్‌వోలను నియమించే ఏపీ ల్యాండ్‌ అప్పలేట్‌ అథారిటీ అధికారి సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌కు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని సెక్షన్‌ 37లోపేర్కొన్నారు. సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా వ్యవహరించవచ్చన్నారు. ల్యాండ్‌ అథారిటీ అధికారి ఇచ్చే ఏ ఉత్తర్వులైనా జ్యుడిషియల్‌ ప్రొసీడింగ్స్‌లో భాగంగానే ఇచ్చినట్లు భావించాలని పొందుపరిచారు. సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్ ప్రకారమైతే బాధితులకు నోటీసులు ఇస్తారు. వారికి వాదనలు చెప్పుకోవడానికి, రాతపూర్వక అభ్యంతరాలు సమర్పించుకోడానికీ అవకాశం కల్పిస్తారు. అలాంటివేమీ లేకుండా ల్యాండ్ టైటిలింగ్‌ అప్పిలేట్‌ అధికారి ఇష్టారాజ్యానికి వదిలేయడం సామాన్యుల ఆస్తులతో ఆటలాడుకోవడమే.

ఇక భూముల క్రయవిక్రయాలు, బదలాయింపులు చేయాలనుకుంటే టీఆర్‌వోకు సమాచారం ఇవ్వాలట. ఆయన సంతృప్తి చెందితేనే లావాదేవీలు జరుగుతాయని ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 50, 51లో ప్రభుత్వం పొందుపరిచింది. టీఆర్‌వోను సంతృప్తిపరచడం అంటే అవినీతి, అక్రమాలకు గేట్లెత్తడమే. ఒకవేళ సమాచారం అందించేందుకు ఎవరైనా నిరాకరించినా, విఫలమైనా సదరు వ్యక్తికి ఆర్నెళ్ల వరకూ జైలుశిక్షగానీ 50 వేల రుపాయల వరకూ జరిమానాగానీ, లేదంటే రెండూ విధించవచ్చని సెక్షన్‌ 64లో పేర్కొన్నారు. ఐతే ఆ అధికారాన్ని అధికారులకు కట్టబెట్టారు.

సహజంగా జైలుశిక్షలు వేసే జ్యుడీషియల్‌ అధికారాలు న్యాయస్థానాలకు ఉంటుంది. కానీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌లో జైలు శిక్ష విధించే అధికారం టీఆర్‌వోకు ఇస్తారా, ఎల్​టీఏఓ కు ఇస్తారా? ఏపీ ల్యాండ్‌ అథారిటీకి ఇస్తారా? అనేది చట్టంలో పేర్కొనలేదు. ఈ సెక్షన్‌ను ఆసరాగా తీసుకొని కక్షసాధించేందుకు కూడా ఏ వ్యక్తినైనా సమాచారం కోరే ప్రమాదం లేకపోలేదు. ఈ సెక్షన్లన్నీ చూస్తే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూతమ స్థిరాస్తి వివరాలను టైటిల్‌ రిజిస్టర్లో నమోదు చేయించుకోవాల్సిందే. ఈ విధానంలో అక్రమార్కులు అధికారుల్ని లోబర్చుకుని ప్రభుత్వ, దేవదాయ భూముల్ని కాజేయడం ఖాయమనే ఆందోళన వ్యక్తమవుతోంది. రెవెన్యూ అధికారులు తప్పు చేస్తే ఇప్పటిదాకా కోర్టు గడపతొక్కేవాళ్లం. అలాంటి వారికే భూ యాజమాన్య హక్కుల చట్టం పేరిట అపరిమిత అధికారాలు కట్టబెట్టడం వల్ల రెవెన్యూ అధికారుల మాటే శాసనం కాబోతోంది.

2023 అక్టోబరు 31 నుంచే ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం అమల్లోకి వచ్చినట్లు వైఎస్సార్సీపీ సర్కార్‌ జీవో జారీ చేసేసింది. 'ఏపీ ల్యాండ్‌ అథారిటీ'ని ఏర్పాటు చేసి, దానికి ఛైర్‌పర్సన్, కమిషనర్, సభ్యుల్ని గతేడాది డిసెంబరు 29నే ఉత్తర్వులిచ్చింది. ఇది అత్యంత ప్రమాదకర చట్టమంటూ ఏపీ న్యాయవాదుల మండలి హైకోర్టులో పిటిషన్‌ వేసింది. న్యాయవాదుల అభ్యంతరాలతో ఇప్పుడే ఈ చట్టాన్ని అమలు చేయడం లేదంటూ మభ్యపెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే పూర్తి చేయాల్సి ఉందని, చట్టం అమలుకు నిబంధనలు కూడా ఇంకా తయారు చేయలేని కల్లబొల్లి కబుర్లు చెప్తోంది. న్యాయనిపుణులు, న్యాయవాదులు, ప్రజాసంఘాల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుంటామంటూ బురిడీ వేస్తోంది. ఆ ఉద్దేశమే ప్రభుత్వానికి ఉంటే చట్టం అమల్లోకి తెస్తున్నట్లు ఉత్తర్వులు ఎందుకు ఇస్తుందని న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు.

ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం: బార్ కౌన్సిల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.