ETV Bharat / state

ఐదేళ్ల వైసీపీ పాలనలో ఉద్యోగులకు అవమానాలు - జీతాల కోసం నిరసనలు - Jagan Govt Games with Employees

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 22, 2024, 12:35 PM IST

Updated : Apr 22, 2024, 12:43 PM IST

jagan_govt_games_with_employees
jagan_govt_games_with_employees

Jagan Govt Games with Employees: వైసీపీ హయాంలో ఉద్యోగులకు ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. ప్రభుత్వ ఉద్యోగులు వేతనాల కోసం రోడ్డెక్కుతున్నారు. సమయానికి ఇచ్చేలా చట్టం చేయాలని గవర్నర్‌కు వినతి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం పీఆర్సీలో తీవ్ర మోసం చేసి, బకాయిలు ఇవ్వకుండా ఉత్తుత్తి చర్చలతో కాలయాపన చేసింది. పెన్షన్లు అందక పండుటాకులు అల్లాడుతున్నారు.

ఐదేళ్ల వైసీపీ పాలనలో ఉద్యోగులకు అవమానాలు - జీతాల కోసం నిరసనలు

Jagan Government Games with Employees : ప్రభుత్వ ఉద్యోగులకు కాళ్లు పట్టుకునే నేర్పు ఉండాలంటూ ఓ సీనియర్‌ మంత్రి హెచ్చరిక లాంటి హితబోధ చేశారు. నిధుల్ని ప్రజలకు పంచాలా, లేక ఉద్యోగులకు ఇవ్వాలా అంటూ మరో మంత్రి ప్రశ్న. ఇక సకల శాఖల మంత్రి అయితే, పైవారికి తానేం తీసిపోననేలా కంట్రోల్‌లో ఉండండి’ అంటూ ఉచిత సలహాలాంటి బెదిరింపులకు పాల్పడ్డారు.

ఈ మాటలూ, కూతలూ అన్నీ కూడా సకాలంలో జీతాలు ఇవ్వాలనీ, పీఆర్సీ అమలు చేయాలనీ అడిగినందుకే. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులకు నిత్యం ఇలాంటి అవమానాలే ఎదురయ్యాయి. జీతాలు ఇవ్వాలంటూ ప్రభుత్వ ఉద్యోగులు నిరసనలు, ర్యాలీలు నిర్వహించిన పరిస్థితి గతంలో ఎప్పుడైనా వచ్చిందా? అసలు పీఆర్సీ సక్రమంగా అమలు చేయలేదనీ, ఉన్న ప్రయోజనాలనే ప్రభుత్వం తొలగించిందని ఉద్యోగులు నిరసన తెలిపిన పరిస్థితి ఎప్పుడైనా కనిపించిందా? ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు రాక ఉద్యోగులు తమ పిల్లల పెళ్లిళ్లు వాయిదాలు వేసుకున్న దుస్థితిని ఎప్పుడైనా చూశారా? జగన్‌ ‘ఫ్రెండ్లీ ఉద్యోగుల ప్రభుత్వం’లో ఇవి నిత్యకృత్యం అయ్యాయి.

చేసింది దగా-దాన్నే సాయమని ప్రచారం! సమాన పనికి సమాన వేతనమంటూ జగన్ మోసం - Jagan Cheat Outsourcing Employees

జీతాలు ఇప్పించండి మహాప్రభో: తన అనుచరగణానికి సలహాదారుల పదవులు కట్టబెట్టి కోట్లు దోచిపెట్టిన జగన్‌, ఉద్యోగులను వారి సమస్యలను మాత్రం గాలికి వదిలేశారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా జీతం వచ్చింది అంటూ నెల తొలిరోజే ఆనందంతో వాట్సప్‌ గ్రూపుల్లో పెట్టడమనేది జగన్‌ పాలనలో ఊహించుకోవటానికే సాధ్యం కాని పరిస్థితి! ప్రభుత్వం దివాలా తీసినట్లుగా కొన్నిసార్లు 12వ తేదీ వరకూ వేతనాలు ఇవ్వలేని దుస్థితి ఏర్పడింది. జీతాల కోసం పొరుగుసేవల సిబ్బంది, ఒప్పంద ఉద్యోగులు ఇబ్బందులు పడటం లాంటివి ఒకటీ అరా చూసుంటాం. రెగ్యులర్‌ ప్రభుత్వ ఉద్యోగులు సైతం జీతాలు ఇప్పించండి మహాప్రభో అంటూ వేడుకునే పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు.

అందుకే ఈ ఘనత వహించిన జగన్‌ పాలనలో జీతాల కోసం ఉద్యోగులు రోడ్డెక్కారు. ఉద్యోగుల సంఘం ఏకంగా జీతాలు ఇప్పించేందుకు చట్టం చేయాలంటూ గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వినతిపత్రం ఇచ్చినందుకు ఆ నాయకుడిని సర్కార్​ తీవ్ర వేధింపులకు గురి చేసింది. ఈ నెల మనకు జీతం అందుతుందా అంటూ ఉద్యోగులు సామాజిక మాధ్యమాల్లో చర్చలు పెట్టిన దుస్థితి జగన్‌ మోహన్ రెడ్డి పాలనలో కొనసాగింది. జీతం వస్తే పండగే అనే పరిస్థితి కనిపించింది. ఇక పెన్షనర్ల పరిస్థితైతే మరీ దారుణం. పెన్షన్లు రాక, మందులు కొనుక్కోలేక పండుటాకులు అల్లాడిపోయారు. ఆర్థిక ప్రయోజనాల మాట దేవుడెరుగు, 1వ తేదీన జీతం, పెన్షన్లు ఇస్తే చాలు అనే దుస్థితిని తీసుకొచ్చారు.

రాష్ట్రంలో ఐదేళ్లుగా బానిసల్లా ఉద్యోగ, ఉపాధ్యాయుల జీవితాలు - United form Round Table Meeting

పండగ పూట పస్తులు ఉండలేక: ఇక సమగ్ర శిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయం. తమకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదని, అప్పుల కోసం ప్రయత్నించినా పుట్టలేదని, దీంతో దసరా పూట పస్తులు ఉండలేక పిల్లల డిబ్బీని పగలగొట్టి డబ్బులు వాడుకుంటున్నామంటూ ఓ ఉద్యోగి తన బాధను గతేడాది వీడియో తీసి, సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఎస్‌ఎస్‌ఏకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు ఇస్తుంది. వీటిని ట్యాబ్‌లు, స్మార్ట్‌టీవీలు, విద్యాకానుకలు, ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌, నాడు-నేడుకు మళ్లిస్తున్న ప్రభుత్వం, ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతోంది.

అంతే కాకుండా పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగులు చాలామంది జీతాలు సకాలంలో రాక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పని చేస్తున్న సిబ్బందికి రెండు నెలలుగా, డీఅడిక్షన్‌ కేంద్రాల్లో పని చేస్తున్న సిబ్బందికి తొమ్మిది నెలలుగా జీతాలు లేవంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా అనేక మంది ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు, ఇప్పటికీ పడుతూనే ఉన్నారు.

సీఎం నమ్మక ద్రోహం - జగన్‌ దెబ్బకు విలవిల్లాడుతున్న ఆర్టీసీ ఉద్యోగులు - cm ys jagan cheated rtc employees

పీఆర్సీలో మోసం: జగన్‌ సర్కార్ 11వ పీఆర్సీలో ఉద్యోగులను మోసం చేసింది. ఎప్పుడూ లేనివిధంగా మధ్యంతర భృతి(ఐఆర్‌) 27 శాతం ఉంటే 4 శాతం తగ్గించి 23 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చింది. పీఆర్సీ చరిత్రలో ఇలా ఇవ్వడం ఇదే మొదటిసారి కాగా, ఐఆర్‌తో తీసుకున్న జీతం కంటే ఫిట్‌మెంట్‌తో తీసుకున్న జీతం తగ్గిపోయింది. అదే విధంగా ఇంటి అద్దె భత్యంలో కూడా కోత వేసింది. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు టీడీపీ ప్రభుత్వంలో 30 శాతం హెచ్‌ఆర్‌ఏ ఉంటే దానిని 24 శాతానికి, జిల్లా కేంద్రాల్లో 20 శాతం ఉంటే దీన్ని 16 శాతానికి కుదించేశారు.

పీఆర్సీ సిఫార్సు చేసిన పేస్కేళ్లను పూర్తిస్థాయిలో అమలు చేయకుండానే 12వ పీఆర్సీ కమిషన్‌ను సర్కారు వేసింది. పీఆర్సీ పేస్కేళ్లను పట్టించుకోకుండా ప్రభుత్వం కరస్పాండింగ్‌ స్కేల్స్‌ను ఇచ్చేసింది. ఏ పేస్కేళ్లను ప్రామాణికంగా తీసుకొని 12వ పీఆర్సీ కమిషనర్‌ కొత్తవి నిర్ణయిస్తారు అనేదే ఇక్కడ ప్రధాన ప్రశ్న. 12వ పీఆర్సీ కమిషన్‌ వేసినా ఇది ఇంతవరకు ఎలాంటి కార్యకలాపాలను చేపట్టలేదు. నిబంధనల ప్రకారం 2023 జులై నుంచి కొత్త పీఆర్సీ అమలు కావాలి, అయితే పీఆర్సీ నివేదిక వచ్చేలోపు ఆలస్యమవుతుందని ఐఆర్‌ ఇస్తారు. ఈసారి ఐఆర్‌కు సైకం జగన్‌ సర్కారు మంగళం పాడేసింది.

అస్తిత్వంపై ప్రభుత్వ ఉద్యోగుల మేథోమదనం- సమస్యలపై పార్టీలు విధాన నిర్ణయాన్ని ప్రకటించాలంటూ విన్నపాలు - APGEA Meeting in Vizianagaram

జగన్‌ పాలనలో ఎడతెరిపిలేని చర్చలు: ఉద్యోగుల సమస్యలపై సంఘాల నాయకులను చర్చలకు పిలవడం, ఏమీ తేల్చకుండా పంపించడం. ఇదీ జగన్‌ పాలనలో సాగిన ఎడతెరిపిలేని చర్చల సారాంశం. ప్రభుత్వ ఉద్యోగులకు కాళ్లు పట్టుకునే నేర్పు ఉండాలంటూ మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. కంట్రోల్‌లో ఉండండంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీఎన్జీఓ సంఘం నాయకుడిని ఫోన్‌లో బెదిరించారు. నిధుల్ని 90 శాతం ప్రజలకు పంచాలా లేదంటే ఉద్యోగులకు ఇవ్వాలా అంటూ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు.

అపాయింట్​మెంట్ దక్కని దుస్థితి: ఇలా వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉద్యోగులను హెచ్చరించారు. జగన్‌ ముఖ్యమంత్రి పీఠం ఎక్కినప్పటి నుంచి ఉద్యోగులను ముప్పుతిప్పలు పెట్టారు. సీఎంను కలిసి సమస్యలు విన్నవించుకుందామన్నా అపాయింట్​మెంట్ దక్కని దుస్థితి. 2019 ఎన్నికల ముందు ఉద్యోగులపై ప్రేమ కురిపించిన జగన్, అధికారంలోకి వచ్చాక వారిని దగ్గరకు సైతం రానివ్వలేదు. సర్వం సలహాలదారుడు సజ్జలనే అన్నట్లుగా తయారు చేశారు. 11వ పీఆర్సీ కమిషన్‌ నివేదిక కోసం ఉద్యోగులు సచివాలయంలో నిరసన చేపట్టాల్సి వచ్చింది. బీఆర్టీఎస్‌ రోడ్డు ముట్టడించిన వరకూ పీఆర్సీ నివేదిక ఇవ్వలేదు. అందులో కూడా కొన్ని పేజీలను తొలగించి ఇచ్చారు.

ఒప్పంద ఉద్యోగులను నమ్మించి మోసం చేసిన జగన్‌- నాలుగేళ్లు నిద్రపోయి! - Contract Employees Regularization

ప్రభుత్వాన్ని గడగడలాడించి: పీఆర్సీ అమల్లో జగన్‌ సర్కార్‌ చేసిన అన్యాయంపై ఉద్యోగులు 2022 ఫిబ్రవరి 3న నిర్వహించిన గర్జన ముఖ్యమంత్రి జగన్‌కు ముచ్చెమటలు పట్టించింది. బీఆర్టీఎస్‌ రోడ్డు దిగ్బంధాన్ని విఫలం చేయడానికి పోలీసులను ప్రయోగించినా ఉద్యోగులు లెక్క చేయలేదు. నిర్బంధాల్ని ఛేదించి, అడ్డంకుల్ని అధిగమించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమాల పురిటిగడ్డ బెజవాడకు భారీగా వచ్చారు. దాదాపు 4 కి.మీ. పొడవున్న బీఆర్టీఎస్‌ రహదారి మొత్తం వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పింఛనుదారులతో కిక్కిరిసిపోయింది. చీకటి పీఆర్సీ జీవోలను రద్దు చేయాలంటూ నినదించారు.

దీంతో దిగొచ్చిన సర్కారు కొన్ని సదుపాయాలను కల్పించింది. ఈ ఉద్యమం తర్వాత విభజించు, పాలించు సూత్రాన్ని జగన్‌ సర్కార్ అమలు చేసింది. సంఘాలను విడగొట్టి నిరసనలు జరగకుండా అణచి వేసింది. జగన్‌ చెప్పినట్లు వైసీపీది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అయితే ‘చలో విజయవాడ’ లాంటి భారీ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టాల్సి వచ్చింది. సలహాదారులంటూ తన అనుచరగణానికి దోచిపెడుతూ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెట్టిన ఫలితమే ఉద్యోగుల నిరసనలు.

ఉద్యోగుల ఓట్ల కోసం డీఏల ఎర - పాత బకాయిలను గాలికి వదిలి ఓట్ల కోసం జగన్ నటన

బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తుందా: ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు 19 వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇంత మొత్తాన్ని ఈ ప్రభుత్వం చెల్లిస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. పదవీ విరమణ తర్వాత ఇస్తామన్న డీఏ, పీఆర్సీ బకాయిలు 7 వేల 500 కోట్లు ఉన్నాయి. వీటిని రాబోయే ప్రభుత్వంపైకి నెట్టేశారు. 2027లోగా చెల్లిస్తామని నోటి మాటగా చెప్పడం తప్ప ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదు. ఉద్యోగుల టీఏ, డీఏ బకాయిలు 274 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. సరెండర్‌ లీవుల బకాయిలు 2 వేల 250 కోట్లు, ఇవికాకుండా 2021-22 నాటికి చెల్లించాల్సిన బకాయిలు మరో 300 కోట్ల రూపాయలు ఉన్నాయి.

మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు 118 కోట్లు రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవికాకుండా కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన సీపీఎస్‌ మొత్తాన్ని ప్రాన్‌ అకౌంట్​కి జమ చేయలేదు. ఇలా అనేక బిల్లులను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచింది. ప్రస్తుతం పదవీ విరమణలు కొనసాగుతున్నాయి. పాత బకాయిలే ఇవ్వలేదు, ఇక ఈ చెల్లింపులు చేస్తుందా, పదవీ విరమణ పొందితే ప్రయోజనాలు ఎలా? అని ఉద్యోగులు మదనపడే దుస్థితి వచ్చింది.

గత ఎన్నికల్లో ప్రైవేట్​ టీచర్లపై ఎక్కడ లేని ప్రేమ - పదవీకాలం ముగుస్తున్నా పట్టించుకోని జగన్​ - Jagan Govt Cheated Private Teachers

Last Updated :Apr 22, 2024, 12:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.