నేటినుంచి వేసవి సెలవులు - పిల్లలు జర భద్రం - తల్లిదండ్రులు ఇవి తప్పక చేయండి! - How to Keep Children Safe in Summer

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 24, 2024, 10:04 AM IST

summer vacation for students
summer vacation for students ()

children Safety Measures in Summer Holidays : ఏడాదిపాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన పిల్లలు.. ఇప్పుడు ఆకాశాన్ని తాకేంత ఉత్సాహంతో ఉంటారు. ఇన్నాళ్లూ నాలుగు గోడల మధ్య ఊపిరి ఆడలేదని ఫీలవుతూ.. స్వేచ్ఛగా గాలి పీల్చుకునేందుకు పరిగెడుతుంటారు. ఈ క్రమంలో ఎటు వెళ్తున్నారో కూడా తెలియకుండా తిరిగేసి, ప్రమాదాలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి.. తల్లిదండ్రులు కచ్చితంగా ఓ కంట కనిపెడుతూ ఉండాల్సిందే!

Summer Vacation For Students : కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం అనుకుంటూ కొందరు, చాలా కష్టంగా పిల్లలందరూ స్కూల్​కు వెళ్తుంటారు. సంవత్సరం పాటు టీచర్ల తన్నులు, హోం వర్కుల భారాలు, స్కూల్ రూల్స్ భరించలేక విసిగిపోయిన వారంతా.. ఇవాళ్టి నుంచి "ఫ్రీ బర్డ్స్" అయిపోతారు. స్వేచ్ఛగా విహరించేందుకు ఎంతగానో ఉవ్విళ్లూరుతుంటారు. కొందరు బంధువుల ఇళ్లకు పయనమైతే, మరికొందరు సమ్మర్ క్యాంపుల్లో చేరిపోతారు. ఇంకొందరు ఇంట్లోనే సందడి చేస్తుంటారు. అయితే.. ఎవరు ఎక్కడ ఉన్నా సరే, ప్రమాదాల తీవ్రత తెలియని పిల్లలు అపాయాల బారిన పడే అవకాశం ఉంటుంది. అందుకే.. పెద్దలు వారిని కనిపెట్టుకుంటూ ఉండి తీరాల్సిందే. స్వేచ్ఛ ఇస్తూనే కాస్త కట్టడి చేయాల్సిందే. లేదంటే.. ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఎంతగా బాధపడినా ప్రయోజనం ఉండదు. అందుకే.. వేసవి సెలవుల్లో పిల్లలు ప్రమాదాల బారిన పడకుండా ఉండటానికి తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి.

చెరువుల్లో, బావుల్లో ఈతకు పంపించవద్దు :

గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లోని పిల్లలు బావుల్లో, చెరువుల్లో ఈతకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎండ వేడిని తట్టుకోలేక కొందరు పెద్దలు వెళ్తుంటే.. వారి వెంట పిల్లలు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. పక్కన ఉన్నవాళ్లు వీరిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారనేది చెప్పలేం. ఒకవేళ చూసుకున్నా.. ఈత రాకుండా బావుల్లోకి, చెరువుల్లోకి దిగడం అత్యంత ప్రమాదం. కాబట్టి.. ఈత రాని మీ పిల్లలను పంపకండి. అవకాశం ఉంటే మీరే తీసుకెళ్లండి. ఈత నేర్పండి. అది అవసరం కూడా. కానీ ఒంటరిగా పంపొద్దు.

బైక్​ ఇవ్వకండి :

పట్టణాలు, నగరాల్లోని పిల్లలు వాహనాలతో ఎక్కువగా అటాచ్​ మెంట్ కలిగి ఉంటారు. పక్కవారిలా తామూ రయ్య్​మంటూ దూసుకెళ్లాలని ఆశపడుతుంటారు. అందుకే ఈ సెలవుల్లో ఎలాగైనా బైక్ నడపడం నేర్చుకోవాలని మారాం చేస్తుంటారు. అవకాశం ఉంటే మీరే నేర్పండి. లేదంటే తర్వాత నేర్పిస్తానని చెప్పండి. అంతేగానీ మీరు లేకుండా బండి చేతికి ఇవ్వకండి.

చెప్పి వెళ్లమనండి :

ఈ రోజుల్లో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? అనేది తల్లిదండ్రులకు పెద్దగా తెలియట్లేదు. కాబట్టి.. ఫ్రెండ్స్​తో వెళ్తామంటే ఎక్కడికి వెళ్తున్నారో కనుక్కోండి. ఎప్పుడు వస్తారో అడగండి. మానిటర్ చేస్తున్నారని తెలిస్తేనే కాస్త జాగ్రత్తగా ఉంటారు. అలాగని అథారిటీ ఉపయోగించకండి. ఫ్రెండ్లీగా ఉంటూనే విషయాలు తెలుసుకోవాలి.

ఎండకు వద్దు :

ఎండలో గడపడం అనేది ఎంత ప్రమాదమో పిల్లలకు తెలియదు. వడ దెబ్బ ఏకంగా ప్రాణాలనే మిగేస్తుంది. కాబట్టి.. మధ్యాహ్నం ఎండలో ఆడనివ్వకండి. నీడలోనే ఆడేలా చూడండి. తప్పకుండా తగినన్ని నీళ్లు తాగేలా చూడాల్సిన బాధ్యత పెద్దలదే. ఇది కేవలం సమ్మర్​ కోసమే కాదు.. భవిష్యత్తులో కిడ్నీ సమస్యలు రాకుండా కూడా కాపాడుతుంది.

మొబైల్ ఫోన్లు :

ఎటూ వెళ్లనివ్వట్లేదని కొందరు.. ఎటూ వెళ్లేది లేదని ఇంకొందరు.. ఫోన్లో మునిగిపోయే అవకాశం ఎక్కువ. కాబట్టి.. వాటికి ఎడిక్ట్ కాకుండా చూడండి. ఫోన్ వాడటానికి టైమ్ పెట్టండి. ఇంత సేపే వాడాలని, ఆ తర్వాత బొమ్మలు వేసుకోవడమో, ఇండోర్ గేమ్స్ ఆడుకోవడమో చేయాలని చెప్పండి.

అగ్ని ప్రమాద వస్తువులు :

చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే అన్నీ గెలికేస్తుంటారు. కాబట్టి.. ప్రమాదకరమైన వస్తువులు వారి చేతికి అందకుండా చూడండి. అగ్గిపెట్టెలు, లైటర్లు వంటి అగ్నిప్రమాద కారక వస్తువులను దూరంగా ఉంచండి.

విషపూరితాలు : ఇంటిని శుభ్రపరిచే మందులు కావొచ్చు, పంటల కోసం వాడే మందులు కావొచ్చు.. ఇంట్లో విషపూరిత పదార్థాలు ఏవైనా ఉంటే వాటిని పిల్లలకు అందుబాటులో లేకుండా చూసుకోండి. లేదంటే.. వాటిని తినే ఛాన్స్ ఉంటుంది.

కిటికీలు, తలుపులకు లాక్‌ : పిల్లలు ఇంట్లో కిటికీలు, తలుపులు పట్టుకొని వేళాడుతుంటారు. మరికొందరు బాల్కనీలోనూ ఆడుతుంటారు. ఈ క్రమంలో కాళ్లు, చేతులకు దెబ్బలు తగలడం.. లేదంటే పై నుంచి కిందపడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి.. తలుపులు, కిటికీలు లాక్ చేయండి.

వారితో గడపండి: ఏడాది పొడవునా వారు స్కూళ్లో, పెద్దలు ఆఫీసులో, ఇంట్లో ఉండిపోతారు. ఇప్పుడు వారితో గడిపే టైమ్ వచ్చింది. కాబట్టి.. వారిని అలా వదిలేయకుండా ప్రేమగా వారితో గడపండి. టైమ్ లేదని చెప్పకండి. మనసుంటే మార్గం ఉంటుంది. వారితో ప్రేమగా ఉంటేనే.. పెద్దలతో బంధం బలపడుతుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తూ.. ఈ సమ్మర్​లో పిల్లలతో ఎంజాయ్ చేయండి. సేఫ్​గా ఉండండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.