ETV Bharat / state

పీవీ రాజకీయ జీవితంలో ఆ ఐదేళ్ల కాలం ఎంతో కీలకం, చరిత్రాత్మకం

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 9, 2024, 3:37 PM IST

PV Narasimha Rao bharat ratna
PV Narasimha Rao

Bharat Ratna for Former PM PV Narasimha Rao : పీవీ రాజకీయ జీవితంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఐదేళ్లు కీలకమైనవే కాదు చరిత్రాత్మకమైనవి కూడా. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక ఆయన 6వ ప్రధాని. దేశం ఆర్థికంగా, రాజకీయంగా అత్యంత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో ఆయనను ఈ పదవి వరించింది. ఈ బాధ్యతను ఆయన భారం అనుకోలేదు. మేధస్సుతో, ప్రతిభా పాటవాలతో, బహు భాషా పాండిత్యంతో, అద్వితీయ రాజనీతితో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వెలుగొందారు పీవీ. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థల్లో ఎన్నో గొప్ప మలుపులు, పరిణామాలు చోటుచేసుకున్నాయి. సవాళ్లు, సమస్యలను పరిష్కరించిన తీరు అపర చాణక్యుడు అనే బిరుదు తెచ్చి పెట్టింది.

Bharat Ratna for Former PM PV Narasimha Rao : తత్వవేత్తలు దేశాన్ని పరిపాలిస్తే ప్రజలందరికీ సరైన న్యాయం జరుగుతుందని సమాజ స్థితిగతులు వారికే క్షుణ్ణంగా అర్థమవుతాయన్నది ప్లేటో మాట. మంచి చెడు విచక్షణ తెలుసుకుని తనంతట తానుగా ఆలోచించి తరతరాలకు ఆదర్శప్రాయంగా నిలిచే నిర్ణయం తీసుకునేవాళ్లే అసలైన పాలకులు అన్నాడు చాణక్యుడు. ఈ లక్షణాలు అన్నీ పీవీ నరసింహారావులో కనిపిస్తాయనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పాలి.

అయితే ప్రధాని పదవి పీవీ(PV Narasimha Rao)ని అనుకోకుండా వరించిందనే చెప్పాలి. ఎందుకంటే 1991 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా, దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు. కానీ ఆ సమయంలో రాజీవ్​ గాంధీ హత్య కారణంగా కాంగ్రెస్​ పార్టీకి నాయకుడు లేకుండా పోయాడు. ఈ సమయంలో పీవీ నరసింహారావు వానప్రస్థం నుంచి తిరిగి వచ్చి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్​లోని నంద్యాల లోక్​సభ నియోజకవర్గం నుంచి గంగుల ప్రతాపరెడ్డితో రాజీనామా చేయించిన కాంగ్రెస్​, అక్కడి ఉప ఎన్నికల్లో పీవీ గెలిచి లోక్​సభలో అడుగుపెట్టారు.

అయితే ఆ సమయం ప్రభుత్వానికి, కాంగ్రెస్​ పార్టీకి చాలా క్లిష్టమనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేని పరిస్థితి అది. సహజ సిద్ధంగా ఉన్న తెలివితేటలు, కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో పని చేసిన అపార అనుభవం పీవీకి ఈ కష్టకాలంలో తోడ్పడ్డాయి. ఈ క్రమంలో ఐదేళ్ల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ, గాంధీ కుటుంబాల తర్వాత మొదటి వ్యక్తి తెలుగుతేజం పీపీ నరసింహారావునే. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా, ఇది సాధించడం ఆయన రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. అందుకే ఆయనను అపర చాణుక్యుడు అని అన్నారు. ప్రధానిగా ఉండగా మన్మోహన్​ సింగ్(Manmohan Singh)ను ఆర్థిక మంత్రిగా తీసుకురావడం దేశ ప్రగతిలో కీలక మార్పునకు నాంది పలికింది.

సాధారణ ఎన్నికల్లో ఓటమి నుంచి దేశ ప్రధానిగా - పీవీ ప్రస్థానం సాగిందిలా

Bharat Ratna PV Narasimha Rao : రాజకీయాల్లో ఉన్న వారు సాధారణంగా తన వారికి, బంధుమిత్రులకు ముఖ్యమైన పదవులు ఇవ్వాలని భావిస్తారు. అందుకు భిన్నమైన మనస్తత్వం పీవీది. జెనీవాలో ఐక్య రాజ్య సమితి సమావేశాల్లో భారత ప్రతినిధిగా ప్రతిపక్ష నాయకుడు వాజ్‌పేయీ(Vajpayee)ని పంపించటం అరుదైన విషయం. లాతూరు భూకంపం ఘటనలో ప్రధానిగా పీవీ స్వయంగా తీసుకున్న చొరవ వేలాది మంది ప్రాణాలు కాపాడింది.

1993లో జరిగిన ఈ ఘటనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించటం ద్వారా బాధితుల కుటుంబాలకు సత్వరమే ఉపశమనం కలిగించారు. బాధితుల పునరావాసం కోసం ఆయన రూపొందించిన విధానం ప్రశంసలందుకుంది. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆయన చేపట్టిన చర్యలూ తక్కువేమీ కాదు. ఉగ్రవాద నిరోధక చట్టం- టీఏడీఏ రూపొందించి అమలు చేశారు.

పంజాబ్​ తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ ప్రభుత్వానిదే. కశ్మీరు తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినపుడు వారి డిమాండ్లకు లొంగకుండా విడిపించిన ఘనత కూడా పీవీ నరసింహరావుకే సాధ్యం. పీవీ ప్రభుత్వంలోనే 1998 అణు పరీక్షలకు సంబంధించిన బాంబు తయారైంది. అది వాజపేయి ప్రభుత్వంలో విజయవంతంగా పూర్తి అయింది. ఈ విషయాన్ని స్వయంగా వాజపేయే ప్రకటించారు. పీవీ తన వాక్‌ చాతుర్యం, రాజకీయ అనుభవంతో అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని వారి సహకారంతో ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపించ గలిగారు. దేశ ఆర్థిక పరిస్థితిని, విదేశీ సంబంధాలను మరింత మెరుగుపర్చారు. సభలో మెజారిటీ ఉన్నా లేకపోయినా అన్ని పార్టీలు, ప్రజల మద్దతుతో అందర్ని కలుపుకొని పోవడమే ఒక విధానంగా అనుసరించారు.

PV Narasimha Rao : ప్రధానిగా పనిచేసిన 5ఏళ్ల కాలంలో పీవీ పెనుమార్పులకు శ్రీకారం చుట్టారు. కొన్ని సందర్భాల్లో ఆయన మెతకగా వ్యవహరిస్తారని, మౌనంగా ఉంటారనే అభిప్రాయాలే తప్ప ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా ఏ ఒక్క విమర్శ రాకపోవడం ఆయన పాలన తీరుకు నిదర్శనం. గతాన్ని, రాబోయే భవిష్యత్తును ఏ మాత్రం ఆలోచించకుండా ప్రస్తుతం ఏం చేస్తే దేశానికి, ప్రజలకు మేలు జరుగుతుందనే అజెండాతోనే పీవీ ముందుకు వెళ్లారని ఆయన సన్నిహితులు, దగ్గర నుంచి చూసినవారు చెప్తుంటారు.

మార్పు వల్ల సమాజంలో మంచి జరగాలని ఆయన కోరుకునేవారు. అయితే పదవీకాలంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. పదవి నుంచి దిగి పోయాక కూడా వాటిపై జరిగిన విచారణలు ఆయనను వెంటాడాయి. కానీ ఈ ఆరోపణలన్నీ న్యాయస్థానాలలో వీగిపోయాయి. చివరి కేసు అతను మరణానికి సరిగ్గా సంవత్సరం ముందు వీగిపోయింది.

చరిత్రను మేలు మలుపు తిప్పిన రాజనీతిజ్ఞుడు 'పీవీ నరసింహారావు'

సంస్కరణల రుషికి భారతరత్న - అప్పుల భారతాన్ని ప్రగతివైపు నడిపిన 'పీవీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.