చరిత్రను మేలు మలుపు తిప్పిన రాజనీతిజ్ఞుడు 'పీవీ నరసింహారావు'

author img

By ETV Bharat Telangana Desk

Published : Feb 9, 2024, 2:25 PM IST

PV Narasimha Rao Political Career

PV Narasimha Rao Profile : దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించి, నవభారత నిర్మాతగా ఖ్యాతిగాంచిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆదర్శనీయుడు. భారతదేశ విదేశాంగ, దౌత్య విధానాల్లో అనేక మార్పులు తీసుకొచ్చిన పీవీ దార్శనికుడు. అపర చాణక్యుడు, ఆర్థికవేత్త, బహుభాషా కోవిదుడు, ప్రజాస్వామ్య రక్షకుడు, భావిగతిని మార్చిన గొప్ప సంస్కర్తగా వెలుగొందిన పీవీ జీవితం ఓ తెరచిన పుస్తకం. అయితే ఆయన సాధించిన విజయాలకు రాజకీయపరంగా సముచితమైన గుర్తింపు దక్కలేదన్నది జగమెరిగిన సత్యం.

PV Narasimha Rao Profile : చరిత్రకు ఓ చెడ్డపేరుంది- అదెప్పుడూ విజేతల పక్షమేనని! అలాగని విజేతలందరూ చరిత్ర చల్లనిచూపునకు పాత్రులు కాలేరు. పాములపర్తి వెంకట నరసింహారావు సైతం అటువంటి దురదృష్టవంతులే! ప్రజల కుత్తుకలను ఉత్తరించిన రాచరిక ప్రభువులు, పట్టుపట్టి పౌరహక్కులను హత్యచేసిన ప్రజాస్వామ్య ఏలికలెందరినో సగర్వంగా తన ఒడిలోకి తీసుకున్న చరిత్ర- భారతదేశాన్ని పునర్నిర్మించిన నిజమైన నాయకుడు, దార్శనికుడైన పీవీ పట్ల మాత్రం ఉద్దేశపూర్వక ఉపేక్షను ప్రదర్శించింది. ఆర్థిక రంగం నుంచి అణుశక్తి కార్యక్రమం వరకు, అంతర్గత భద్రత నుంచి విదేశాంగ విధానం వరకు అన్నింటిపైనా తనదైన ముద్రవేసిన తెలుగుబిడ్డ పీవీ- ఆధునిక భారత చరిత్రను మేలు మలుపు తిప్పిన రాజనీతిజ్ఞుడు.

'రామాయణం నుంచి మొదలు పెడితే 1991 దాకా ఒక్కరూ లేరు'

మూస పద్ధతులకు చరమగీతం

PV Narasimha Rao Bharat Ratna : పీవీ ప్రధాని(PV Narasimha Rao) అయ్యే సమయానికి దేశం ఆర్థికంగా దివాలా తీసే స్థితిలో ఉంది. దశాబ్దాల తరబడి మనం అనుసరించిన విధానాలకు తోడు అనుకోకుండా వచ్చిపడిన గల్ఫ్‌ యుద్ధంతో పరిస్థితులు చెయ్యి దాటిపోయాయి. 1982-84 మధ్యలో ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ప్రవేశపెట్టిన బడ్జెట్లు, 1987లో ప్రధాని రాజీవ్‌ గాంధీ ప్రకటించిన కొత్త ఆర్థిక విధానంతో ద్రవ్యలోటు పెరిగిపోయింది. నాలుగు వందల మందికి పైగా ఎంపీల బలమున్న రాజీవ్‌ గాంధీ ప్రభుత్వానికి భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు గురించి, అప్పటికే పడుతున్న ఒత్తిడి గురించి ముందస్తు సమాచారం ఉన్నా మార్పులకు మొగ్గు చూపలేదు. ఆ తరవాత వచ్చిన వీపీ సింగ్‌ సైతం ఈ విషయంలో ఏమీ చేయలేకపోయారు. ఫలితంగా 72 బిలియన్‌ డాలర్ల మేరకు పేరుకుపోయిన విదేశీ రుణాలతో అతి ఎక్కువ అప్పులున్న దేశాల జాబితాలో భారత్‌ మూడో స్థానంలోకి చేరింది. అప్పటికి కొత్త రుణాలను మంజూరు చేయడానికి విదేశీ సంస్థలేవీ ముందుకు రావడం లేదు. చంద్రశేఖర్‌ జమానా నాటికి విదేశ మారకద్రవ్యం నిల్వలు నిండుకునే పరిస్థితి వచ్చింది. ఈ గండంనుంచి గట్టెక్కడానికి 67 మెట్రిక్‌ టన్నుల బంగారాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ స్విట్జర్లాండ్‌లలో తాకట్టు పెట్టి 607 మిలియన్‌ డాలర్ల అప్పు తెచ్చుకోవాల్సిన దుస్థితిలో పడ్డాం!

అలాంటి సమయంలో ప్రధాని అయిన పీవీ- మన్మోహన్‌ను తోడు చేసుకుని సంస్కరణల రథాన్ని పరుగులు తీయించారు. లైసెన్స్‌ రాజ్‌ను బద్దలుకొట్టి, విశ్వవిపణికి భారత్‌ను అనుసంధానం చేశారు. 1992 కల్లా ఆర్థిక సంక్షోభాన్ని అదుపు చేసి, తాను దిగిపోయే నాటికి జీడీపీ వృద్ధిని 7.6 శాతానికి చేర్చారు. 'ఆర్థిక సంస్కరణల అమలుకు రాజకీయంగా తోడ్పాటునివ్వడానికి తగిన దార్శనికతా ధైర్యమూ పీవీ నరసింహారావు కనబరచారు. ఆ ధీమా ఉన్న ప్రధానమంత్రిగా పీవీ చరిత్రలో అందరికన్నా మిన్నగా నిలిచిపోతారు' అన్న ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ వై.వేణుగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు అక్షరసత్యాలు!

పీవీ జీవితం: సాధారణ ఎన్నికల్లో ఓటమి నుంచి దేశ ప్రధానిగా

ఇన్ఫోసిస్‌ తదితర మేటి సంస్థల నుంచి భారతీయులందరి చేతుల్లోని మొబైల్‌ ఫోన్లు, ఇళ్లలోని శాటిలైట్‌ టీవీఛానళ్ల వరకు అన్నీ పీవీ పాలనా కాలంలో పట్టాలెక్కిన సంస్కరణల మధురఫలాలే! పీవీయే స్వయంగా చెప్పినట్టు 'ప్రజలకేమీ తెలియదు; తెలివితేటలన్నీ.. ప్రభుత్వం దగ్గరే ఉన్నాయనుకునే మూస పాలనా పద్ధతులన్నీ' ఆ అయిదేళ్లలో శాశ్వతంగా కనుమరుగైపోయాయి.

యాక్ట్ ఈస్ట్..

ఆర్థిక వ్యవస్థను సంస్కరించే క్రమంలో ఏ ఒక్క ఉద్యోగిని, కార్మికుణ్ని తొలగించకూడదన్న భావనతోనే పీవీ వ్యవహరించారు. దీనితో పాటు పేదలకు ప్రభుత్వమే వంద రోజుల పాటు పని కల్పించే ఉపాధి హామీ పథక రచన సైతం చేశారు. పదేళ్ల తరవాత యూపీఏ పాలనలో అమలులోకి వచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకానికి మూలాలు పీవీ మేధామథనంలో ఉన్నాయి. ప్రజాపంపిణీ వ్యవస్థ సంస్కరణ నుంచి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు పర్యవేక్షణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు వరకు అన్నింటా పీవీ వినూత్న ధోరణులనే అనుసరించారు. దేశీయ విధానాల్లో మార్పులు చేస్తూనే విదేశాంగ విధానాన్నీ నూతన పథంలో నడిపించారు. నేటి 'యాక్ట్‌ ఈస్ట్‌' విధానానికి మాతృక అయిన 'తూర్పువైపు చూపు'(లుక్‌ఈస్ట్‌)నకు పీవీయే ప్రాణంపోశారు. తద్వారా ఆసియాలో చైనా ప్రాబల్యానికి పగ్గాలు వేయడంతో పాటు ఇండియాకు కొత్త మిత్రులను సంపాదించిపెట్టారు. అలాగే.. టెల్‌అవీవ్‌లో భారత రాయబార కార్యాలయాన్ని ప్రారంభించడం ద్వారా ఇజ్రాయెల్‌తో అనుబంధానికి అంకురారోపణ చేశారు.

ఒకప్పుడు పాకిస్థాన్‌కు అన్ని విధాలా సాయం చేసిన ఇరాన్‌ను భారత్‌కు మిత్రదేశంగా మార్చారు. అణ్వస్త్ర నిరోధ ఒప్పందంపై సంతకం చేయాలన్న అమెరికా ఒత్తిడిని తట్టుకుంటూనే దేశీయంగా అణు కార్యక్రమాన్ని సజావుగా ముందుకు తీసుకెళ్ళారు. చైనా, పాకిస్థాన్‌ల రూపంలో ఇరుపక్కలా శత్రువులు పొంచి ఉన్న భారత్‌కు అణ్వస్త్ర బలాన్ని అందించి అజేయ శక్తిగా మార్చారు. తన ఏలుబడిలోనే అణు పరీక్షలు నిర్వహించినా- ఆ ఘనత మొత్తం పీవీదేనని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ(Atal Bihari Vajpayee) అందుకే వినమ్రంగా అంగీకరించారు. పంజాబ్‌లో శాంతిని సుస్థిరం చేయడం, ఈశాన్య రాష్ట్రాల్లో సామరస్య వాతావరణాన్ని నెల్పకొనడానికి శ్రమించడం, జమ్మూ కశ్మీర్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు చిత్తశుద్ధితో కృషి చేయడం.. ఇలా అంతర్గత భద్రతకు పెనుసవాలుగా మారిన సమస్యల పరిష్కారంలో పీవీ కృషి ఎనలేనిది.

భావిగతిని మార్చిన భారతరత్న పీవీ నరసింహా రావు - రాజకీయ ప్రస్థానం సాగిందిలా

దేశభక్తుడైన రాజకీయవేత్త

అంతకు ముందు పరిస్థితులతో పోలిస్తే దేశాన్ని అన్ని విధాలా అభివృద్ధి బాటలో నడిపించినా- పీవీ ప్రభుత్వం 1996 ఎన్నికల్లో అపజయం పాలు కావడం పట్ల ప్రపంచ దేశాల్లో విస్మయం వ్యక్తమైంది. 'పీవీ వల్ల తమకు జరిగిన మేలును భారతీయ ఓటర్లు మరిచిపోయారు' అని సింగపూర్‌ ఉన్నతస్థాయి నాయకులు బహిరంగంగానే నిరుత్సాహం వ్యక్తం చేశారు. బాబ్రీ మసీదు ధ్వంసం కావడం.. ఆ తరవాత చెలరేగిన మతఘర్షణలు ఆయన పాలన కాలానికి కళంకాలైనా వాటిని నివారించడానికి పీవీ చేతనైన ప్రయత్నాలన్నీ చేశారు. అయిదు దశాబ్దాల రాజకీయ జీవితంలో వ్యక్తిగతంగా ఎక్కడా ఎలాంటి అవినీతి మకిలీ అంటకపోయినా, ప్రధానిగా దిగిపోయిన తరవాత పీవీని కోర్టు కేసులు చుట్టుముట్టాయి. వాటన్నింటి నుంచి పులుకడిగిన ముత్యంలా ఆయన బయటపడ్డారు. ఆయా కేసుల్లో తన తరఫున వాదించిన న్యాయవాదులకు డబ్బు చెల్లించడానికి హైదరాబాద్‌లోని తన ఇంటిని అమ్మకానికి పెట్టారు! మాజీ రాష్ట్రపతి, 'భారతరత్న' అబ్దుల్‌ కలాం అభివర్ణించినట్టు పీవీ- 'రాజకీయవ్యవస్థ కన్నా దేశం గొప్పదని విశ్వసించే దేశభక్తుడైన రాజకీయవేత్త'!

సంక్షేమానికీ అంతే ప్రాధాన్యం

ఎన్ని సంస్కరణలు చేసినా విద్య, వైద్య రంగాలను మాత్రం ప్రభుత్వమే నిర్వహించాలని పీవీ ఎప్పుడూ చెప్పేవారు. నోబెల్‌ బహుమతి పొందిన ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ తదితరులదీ ఇదే అభిప్రాయం. 1990లో విద్యపై కేంద్రం కేవలం రూ.951 కోట్లలను ఖర్చు చేస్తే, 1995 నాటికి పీవీ ప్రభుత్వం ఆ మొత్తాన్ని రెట్టింపునకు పైగా (రూ.2042 కోట్లు) పెంచింది. అలాగే, ఆరోగ్య రంగానికి కేటాయింపులు, ఖర్చు సైతం ఈ అయిదేళ్లలో రెండింతలు అయ్యింది. ప్రైవేటు రంగాన్ని ఇతోధికంగా ప్రోత్సహించి, తద్వారా సమకూరిన ఆదాయాన్ని ప్రజా సంక్షేమానికి వెచ్చించడమనే కొత్త మార్గాన్ని భారతదేశానికి పీవీ పరిచయం చేశారు. 1991లో ఆయన ప్రధాని పదవి చేపట్టిన సమయానికి భారత స్థూల దేశీయోత్పత్తి విలువ సుమారు 26 వేల కోట్ల డాలర్లు. 2021నాటికి అది సుమారు మూడు లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది. దేశం వేగవంతమైన వృద్ధిని సాధించడం వెనక పీవీ హయాములో చేపట్టిన ఆర్థిక సంస్కరణల పాత్ర కీలకం.

పీవీ దేశాన్ని సమూలంగా మార్చిన తపస్వి: వెంకయ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.