ETV Bharat / state

భూ వివాదంలో గ్రామంపై దండయాత్ర - ఆస్తుల విధ్వంసం, ముగ్గురికి తీవ్ర గాయాలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 4, 2024, 4:30 PM IST

Updated : Feb 4, 2024, 10:59 PM IST

attack_on_village_in_land_issue
attack_on_village_in_land_issue

Attack on Village in Land Issue: భూ తగాదా విషయంలో ఓ గ్రామంలోకి చొరబడిన మరో గ్రామానికి చెందిన ప్రజలు ఆస్తుల విధ్వంసానికి పూనుకున్నారు. అడ్డుకునేందుకు యత్నించిన వారిపైనా దాడి చేయడంతో ముగ్గురు ఆస్పత్రి పాలయ్యారు.

Attack on Village in Land Issue: ఓ భూ తగాదా అల్లూరి జిల్లాలోని గ్రామాల మధ్య చిచ్చు పెట్టింది. వివాదాలకు కారణమైన ఈ తగాదా ఇప్పుడు ఏకంగా ఓ గ్రామ ధ్వంసానికి దారి తీసింది. ఆ భూమి మాదంటే మాది అని ఆ గ్రామాలు వాదించుకుంటున్నాయి. ఈ వాదనలపై ఆ గ్రామాలు న్యాయస్థానాలను సైతం ఆశ్రయించాయి. సాగు చేసుకుంటున్న గ్రామాస్థులు పోలీసులను ఆశ్రయించడంతో అక్కడకు వచ్చారు. పక్కనే కోడిపందాలు జరుగుతున్న విషయం తెలిసి ఆపడానికి పోలీసులు వెళ్లగా, ఇదే అదనుగా భావించి ఓ వర్గం గ్రామస్థులు, పోలీసులను ఆశ్రయించిన గ్రామంపై దాడికి తెగబడ్డారు. గ్రామంలో చొరబడి దొరికిన దానిని దొరికినట్లుగా ధ్వంసం చేశారు.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం అల్లూరు సీతారామరాజు జిల్లాలోని పెద్దబయలు మండలంలోని ఎర్రబయలు గ్రామస్థులు, గ్రామ పక్కనే ఉన్న భూమిని సాగు చేసుకుంటున్నారు. 29 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ భూమిలో ఎర్రబయలు గ్రామస్థులు పంటలు సాగు చేసుకుంటున్నారు. అయితే పక్కనే ఉన్న జి మాడుగుల మండాలానికి చెందిన గొందిపల్లి, తులం, పెదబయలు మండలంలోని లిచ్చాబు, వనగరాయి గ్రామానికి చెందిన ప్రజలు ఈ భూమిపై తిరుగుబాటు చేస్తున్నారు.

కార్పోరేటర్ భర్త కిరాతకం - భూకబ్జా అడ్డుకున్నరని సీపీఐ నేతలపై దాడి

భూమి తమదని గతంలో నుంచే ఇరు వర్గాల వారు వాదిస్తున్నారు. ఎర్రబయలు గ్రామస్థులు పంటలు పండించగా, మిగిలిన గ్రామాల ప్రజలు వచ్చి పంటలను ధ్వంసం చేస్తున్నారు. ఈ విధంగా సంవత్సరాల తరబడి వివాదం నడుస్తూనే ఉంది. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, హైకోర్టులో ఈ భూమిపై స్టే నడుస్తోంది.

ఎర్రబయలు గ్రామస్థులకు సదరు భూమి సంబంధించిన పత్రాలు ఉన్నాయి. అయితే ఆ భూమిలో జి మాడుగుల మండలానికి కొందరు పలు నిర్మాణాలకు పూనుకున్నారు. నిర్మాణాలను గమనించిన ఎర్రబయలు గ్రామస్థులు స్పందనలో పోలీసులకు పిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు ఎర్రబయలు పక్కనున్న భూమి వద్దకు చేరుకున్నారు. ఇదే సమయంలో సమీపంలో కోడి పందాలు నిర్వహిస్తున్న సమాచారం పోలీసులకు తెలిసింది. కోడిపందేలను ఆపి తిరిగిరావాలనుకుని పోలీసులు అక్కడి నుంచి వెళ్లారు.

టీడీపీ బూత్ కన్వీనర్​పై వైసీపీ సర్పంచ్ దాడి- చంపుతామని బెదిరింపులు

పోలీసులు అక్కడ నుంచి కదిలిన విషయం తెలుసుకున్న మరో వర్గమైన గ్రామస్థులు, ఎర్రబయలు గ్రామంపై దాడికి దిగారు. కర్రలు, రాళ్లు ఇలా చేతికి ఏది దొరికితే అది పట్టుకుని దాడికి తెగబడ్డారు. గ్రామంలోని ఇళ్లను ధ్వంసం చేశారు. ఇళ్ల పై కప్పు, ఇంటి ముందు ఉన్న వస్తువులను ఈ దాడిలో నాశనం చేశారు. ఈ క్రమంలో ఎర్రబయలు గ్రామస్థులు భయంతో ఊరి నుంచి పారిపోయారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ముగ్గురు ఎర్రబయలు గ్రామస్థులు గాయాలపాలవగా, వారు ప్రస్తుతం పాడేరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఎవరి అండదండలతో ఈ చర్యలకు వారు దిగుతున్నారో తెలియడం లేదంటూ ఎర్రబయలు గ్రామస్థులు వాపోతున్నారు. భూమిపై అన్ని హక్కులు కలిగి ఉండి, న్యాయస్థానాలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా తమపై ఇలా దాడులు ఏమిటనీ ప్రశ్నిస్తున్నారు. భూమి కోసం తమ ప్రాణాలైనా తీసేందుకు వారు వెనకాడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ జనాభా ఉన్న తామ గ్రామానికి రక్షణ లేకుండా పోయిందని ఆందోళన చెందుతున్నారు.

దున్నపోతు హల్​చల్​ - గుర్తు పెట్టుకుని వచ్చి మరీ దాడి! భయంతో వణికిపోతున్న ప్రజలు

భూ వివాదంలో గ్రామంపై దండయాత్ర - ఆస్తుల విధ్వంసం, ముగ్గురికి తీవ్ర గాయాలు
Last Updated :Feb 4, 2024, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.