ETV Bharat / state

దురుద్దేశంతో వ్యవహరిస్తోంది ఎవరు సీఎస్ సార్? - వైసీపీ 'బంటు'ల పేర్లు ఈసీకి పంపింది మీరు కాదా? - AP CS Jawahar Reddy

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 6, 2024, 7:09 AM IST

AP CS Jawahar Reddy: శుక్రవారం 'ఈనాడు'లో 'వీళ్లా కొత్త ఎస్పీలు?' శీర్షికన వచ్చిన కథనంపై సీఎస్‌ ఉలిక్కిపడ్డారు. ఇదే అంశాన్ని ఖండిస్తూ, సుదీర్ఘ వివరణ ఇస్తూ శుక్రవారం లేఖ విడుదల చేశారు. అలాంటి కథనాల వల్ల అధికారుల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని, నైతిక స్థైర్యం దెబ్బతింటుందని, ప్రజాస్వామ్య వ్యవస్థకే అది ప్రమాదమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీఎస్‌ విడుదల చేసిన ఆ లేఖలోని అంశాలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

AP CS Jawahar Reddy
AP CS Jawahar Reddy

AP CS Jawahar Reddy : వైసీపీ వంతపాడుతున్నారని ఈసీ వేటేసిన 9 మంది ఎస్పీలు, కలెక్టర్ల స్థానంలో మళ్లీ అలాంటి వారినే ప్రతిపాదించడాన్ని ఈనాడు ప్రశ్నిండంపై, సీఎస్‌ ఉలిక్కిపడ్డారు. మళ్లీ వైసీపీతో అంటకాగుతున్న అధికారులనే ఎలా ప్రతిపాదిస్తారంటూ, 'వీళ్లా కొత్త ఎస్పీలు' అంటూ రాసిన కథనాన్ని, జవహర్‌రెడ్డి ఆక్షేపించారు. కథనాన్ని ఖండిస్తూ లేఖ విడుదల చేసిన ఆయన, దానివల్ల అధికారుల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని సెలవిచ్చారు. పైపెచ్చు సీఎస్‌ ప్రతిపాదనను ప్రశ్నిస్తే దాన్ని వక్రీకరిస్తూ ఈసీ నిర్ణయాన్ని ఎలా ప్రశ్నిస్తారంటూ లేఖలో పేర్కొన్నారు.

'మేం చేసేది చేసేస్తాం, మా ఇష్టానుసారం ప్రవర్తిస్తాం, అధికార పార్టీకి కొమ్ముకాస్తాం, అయినా మీరెవరు మమ్మల్ని ప్రశ్నించడానికి?' అన్నట్టు ఉంది, సీఎస్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి తీరు! తాజాగా ఎన్నికల సంఘం బదిలీ చేసిన కొన్ని జిల్లాల ఎస్పీల స్థానంలో మళ్లీ వివాదాస్పద అధికారుల పేర్లను సీఎస్‌ ప్రతిపాదించడం, వారిని జిల్లా ఎస్పీలుగా ఈసీ నియమించడంపై శుక్రవారం 'ఈనాడు' లో 'వీళ్లా కొత్త ఎస్పీలు?' శీర్షికన వచ్చిన కథనంపై సీఎస్‌ ఉలిక్కిపడ్డారు. దాన్ని ఖండిస్తూ, సుదీర్ఘ వివరణ ఇస్తూ శుక్రవారం లేఖ విడుదల చేశారు. అలాంటి కథనాల వల్ల అధికారుల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని, నైతిక స్థైర్యం దెబ్బతింటుందని, ప్రజాస్వామ్య వ్యవస్థకే అది ప్రమాదమని తెగ బాధపడిపోయారు. 'ఈనాడు' కథనానికి దురుద్దేశాలను ఆపాదించేందుకు ప్రయత్నించారు. పైగా ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఎలా ప్రశ్నిస్తారంటూ, పసలేని వాదనను తెరపైకి తెచ్చారు. సీఎస్‌ విడుదల చేసిన ఆ లేఖను లోతుగా పరిశీలిస్తే ఆయన వాదనలోని డొల్లతనం బయటపడుతుంది.

మళ్లీ వైఎస్సార్సీపీ 'బంటు'లకే పట్టం - స్వామి భక్తి చాటిన సీఎస్ జవహర్ రెడ్డి - ECI Appoints IPS Officers in Andhra

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక వివిధ కారణాల వల్ల బదిలీ చేసిన వారి స్థానంలో నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారుల పేర్లను మాత్రమే సూచిస్తుందని, వారిలో ఎవరిని నియమించాలన్నది పూర్తిగా ఈసీ అధికారమని సీఎస్‌ సెలవిచ్చారు. సీనియారిటీ, అనుభవం వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుని అధికారుల ప్యానల్‌ను ప్రతిపాదించడం వరకే రాష్ట్ర ప్రభుత్వ పాత్ర పరిమితమని తెలిపారు. అంతవరకు సీఎస్‌ చెప్పింది నిజమే అయినా, ఒక్కో పోస్టుకు ముగ్గురు అధికారుల పేర్లు జవహర్‌రెడ్డే ప్రతిపాదిస్తారు కదా. వారిలో ఒకరినే ఎన్నికల సంఘం ఎంపిక చేస్తుంది. ఎలాంటి అధికారుల పేర్లు సీఎస్‌ పంపించారన్నదే ఇక్కడ చర్చనీయాంశం. ఒక్క నెల్లూరు ఉదాహరణనే తీసుకుంటే అక్కడ ఎస్పీగా నియమితులైన అరిఫ్‌ హఫీజ్‌ ఎంత వివాదాస్పద అధికారో, ఆయన గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు అధికార పార్టీకి ఎంతగా కొమ్ముకాశారో అందరికీ తెలుసు.

ఎన్నికల సమయంలో అలాంటి అధికారి పేరును ఒక జిల్లా ఎస్పీ పోస్టుకు సీఎస్‌ ఎలా ప్రతిపాదిస్తారు? అరిఫ్‌తో పాటు సీఎస్‌ ప్రతిపాదించిన మిగతా ఇద్దరూ కన్‌ఫర్డ్‌ ఐపీఎస్‌ అధికారులు. వారికి గతంలో ఏ జిల్లాకూ ఎస్పీగా పనిచేసిన అనుభవం లేదు. విధిలేని పరిస్థితుల్లో ఆ ముగ్గురిలోను అరిఫ్‌ను నెల్లూరు ఎస్పీగా ఈసీ ఎంపిక చేసింది. ఈసీకి ప్రతి రాష్ట్రంలోనూ సొంతంగా విస్తృత యంత్రాంగమేమీ ఉండదు కదా? సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై, ముఖ్యంగా సీఎస్‌లపైనే కదా ఆధారపడుతుంది? కలెక్టర్లు, ఎస్పీల వంటి కీలకమైన పోస్టుల్లో నియమించేందుకు వివాదాలకు అతీతంగా ఉండే అధికారులను ప్రతిపాదించాల్సిన బాధ్యతను సీఎస్‌ ఉద్దేశపూర్వకంగానే విస్మరించారని, జిల్లాల ఎస్పీలుగా నియమించేందుకు ఆయన పంపించిన పేర్లను చూస్తేనే అర్థమవుతుంది. ఆ ఎస్పీల నియామకంతో తనకేమీ సంబంధమే లేనట్టుగా సీఎస్‌ చెప్పడం విస్తుగొలుపుతోంది.

పింఛన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకోండి - సీఎస్​కు లేఖరాసిన నిమ్మగడ్డ - Nimmagadda writes letter to CS

కేంద్ర ఎన్నికల సంఘం కీలకమైన అధికారులను ఎంపిక చేసిన తీరును ప్రశ్నించడం ప్రమాదకరమైన సంప్రదాయానికి దారితీస్తుందని, ప్యానల్‌లోని అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడం వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని లేఖలో సీఎస్‌ ఆక్షేపించారు. ఎన్నికల సంఘం వంటి సంస్థలు తీసుకునే నిర్ణయాలపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులను దెబ్బతీస్తుందనీ తెలిపారు. ఇది చూస్తే ఈనాడు కథనం ఏదో ఈసీ అస్తిత్వాన్నే దెబ్బతీసేదిగా ఉన్నట్టుగా సీఎస్‌ వక్రీకరించేందుకు ప్రయత్నించారు. ఆ కథనంలో ‘ఈనాడు ’ ఎక్కడా ఈసీ నిర్ణయాలను ప్రశ్నించలేదు. ఈసీపై తప్పుడు సమాచారం ప్రచురించలేదు. వివాదాస్పద అధికారులను ఎస్పీలుగా సీఎస్‌ ఎలా ప్రతిపాదించారని మాత్రమే ఆ కథనం ప్రశ్నించింది. ఎన్నికల సంఘాన్ని తప్పుదారి పట్టిస్తున్నారన్నదే దాని సారాంశం.

అఖిల భారత సర్వీసు అధికారుల నియామకంపై చీఫ్‌ సెక్రటరీకి దురుద్దేశాల్ని ఆపాదించడం స్వార్థ ప్రయోజనాల కోసమేనని సీఎస్‌ మరో ఆరోపణ చేశారు. కీలకమైన ఎన్నికల వేళ వివాదాస్పద ఎస్పీలను బదిలీ చేసి వారి స్థానంలో సమర్థులను, నిష్పాక్షికంగా వ్యవహరించేవారిని ప్రతిపాదించమని ఈసీ కోరితే.. అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న అధికారుల పేర్లు పంపించడం దురుద్దేశం కాదా? ఈసీ కళ్లకు గంతలు కట్టడం దురుద్దేశం కాదా? పండుటాకుల్లాంటి వృద్ధులకు ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలన్న బాధ్యతను విస్మరించి మండుటెండల్లో వారిని గ్రామ, వార్డు సచివాలయాలకు రప్పించడం దురుద్దేశం కాదా? ఆ నెపాన్ని విపక్షాలపై నెట్టేసి రాజకీయ ప్రయోజనం పొందేందుకు అధికార వైసీపీ వేసిన పన్నాగానికి సహకరించేలా వ్యవహరించడం దురుద్దేశం కాదా? అధికార పార్టీ ఎక్కడికక్కడ వృద్ధులను, వికలాంగులను మంచాలు, వీల్‌ఛైర్‌లపై సచివాలయాల వద్దకు తీసుకెళుతూ, ప్రతిపక్షాలపై బురద జల్లుతుంటే తగిన చర్యలు తీసుకోకుండా చోద్యం చూడటం దురుద్దేశం కాదా? రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండి ఇటీవల చిలకలూరిపేటలో సాక్షాత్తు ప్రధాని పాల్గొన్న ఎన్డీయే సభకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం దురుద్దేశం కాదా? రాష్ట్రంలో పలువురు అధికారులు ఇప్పటికీ వైసీపీతో అంటకాగుతున్నా చర్యలు తీసుకోకపోవడాన్ని ఏమంటారు? దురుద్దేశం అనరా? సీఎస్‌ జవహర్‌రెడ్డి గారూ.

వైఎస్సార్సీపీ ముసుగులో సీఎస్ జవహర్ రెడ్డి! - పింఛను సొమ్ము ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేయకుండా కుట్ర? - Door To Door Pension Distribution

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.