ETV Bharat / politics

వైఎస్సార్సీపీ ముసుగులో సీఎస్ జవహర్ రెడ్డి! - పింఛను సొమ్ము ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేయకుండా కుట్ర? - Door To Door Pension Distribution

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 3, 2024, 8:20 AM IST

Jawahar Reddy on Door to Door Pension Distribution: పింఛను సొమ్ము ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేయకుండా లబ్ధిదారులను ఇబ్బందిపెట్టి ప్రతిపక్ష పార్టీని అందుకు బాధ్యులను చేయాలనే వైఎస్సార్సీపీ కుట్రకు వారంతా వంతపాడారా? ఈసీ ఆదేశాలను ఓ పథకం ప్రకారం అధికార పార్టీకి మేలు చేసేలా మర్చారా? పాలనలో స్వతంత్రంగా వ్యవహరించే అవకాశమున్నా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ జగన్‌ సేవలో తరిస్తున్నారా? అంటే అవుననే ప్రతిపక్షాల అనుమానమే నిజమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకూడదని వైఎస్సార్సీపీ పెద్దల కుట్రకు సీఎస్‌ సహా ధనుంజయరెడ్డి, మురళీధర్‌రెడ్డిలు సహకరించారనేది తాజాగా ఇచ్చిన ఆదేశాల్లో తేటతెల్లమైంది.

Jawahar_Reddy_on_Door_to_Door_Pension_Distribution
Jawahar_Reddy_on_Door_to_Door_Pension_Distribution

వైఎస్సార్సీపీ ముసుగులో సీఎస్ జవహర్ రెడ్డి! - పింఛను సొమ్ము ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేయకుండా కుట్ర?

Jawahar Reddy on Door to Door Pension Distribution : ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకూడదని వైఎస్సార్సీపీ కుట్ర. ఈ పరిస్థితికి కారణం టీడీపీనే అని విషం చిమ్మే ప్రయత్నం. ముఖ్యమంత్రి కార్యాలయంలో నంబర్‌ 1గా వెలిగే ధనుంజయరెడ్డి కనుసన్నల్లో ఈ కుట్ర సాగింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛనుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేసేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని కలెక్టర్లు కట్టకట్టుకుని చెప్పినా జగన్‌ కేసులో సహనిందితుడైన సెర్ప్‌ సీఈవో మురళీధరరెడ్డి (Serp CEO Muralidhar Reddy) అడ్డుకున్నారు. ఎన్నికల సమయంలో స్వతంత్రంగా వ్యవహరించే అవకాశమున్నా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి కూడా వంతపాడారు.

సచివాలయాల వద్ద పంపిణీ చేస్తే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర పింఛనుదారులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావని తెలిసీ ప్రభుత్వ పాలనాధిపతిగా ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నివారించాల్సిన ఆయన వైఎస్సార్సీపీ కుట్రకు వత్తాసు పలికారు. అంతా కలిసి పింఛనుదారులను ఇక్కట్లపాలు చేసే నిర్ణయానికే మొగ్గుచూపారు. వైఎస్సార్సీపీ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలను శిరసావహిస్తూ దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు, వీల్‌ఛైర్‌లో ఉన్న వారు మినహా మిగతా పింఛనుదారులందరూ సచివాలయాల వద్దకే వచ్చి పింఛను తీసుకోవాలని స్పష్టం చేస్తూ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర 86.33 శాతం మంది పింఛనుదారులను ఇళ్ల నుంచి బయటికి రప్పించి సచివాలయాల వద్దే పంపిణీ చేయాలని నిర్ణయించారు.

సీఎస్‌ జవహర్‌రెడ్డి పాలనా విభాగాధిపతి. ప్రస్తుతం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పనిచేస్తున్నా కీలక నిర్ణయాలు ఆయనే తీసుకోవాలి. ప్రజలకు ఇబ్బందుల ఎదురయ్యే పరిస్థితులు ఉత్పన్నమయినప్పుడు వారికి సానుకూలంగా ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలి. ఐఏఎస్‌లకు శిక్షణ ఇచ్చేటప్పుడు అదే నేర్పిస్తారు. ఆనాడు నేర్చిన పాఠాలు మరిచిపోయి వైఎస్సార్సీపీ పాఠాలే ఒంటబట్టినట్లు జవహర్‌రెడ్డి వాటినే అమలు చేస్తున్నారు. ప్రజలకు మేలు చేసే నిర్ణయం చేయకుండా వింత వాదనలను తెరమీదకు తెచ్చారు. ఇవి చూస్తే పింఛనుదారుల ఇళ్ల వద్ద పింఛను పంపిణీ చేయాలనే ఆలోచన కంటే వారిని సచివాలయాలకు రప్పించి ఎలా ఇబ్బంది పెట్టాలనే విధంగానే కసరత్తు చేసినట్టు స్పష్టంగా తెలుస్తుంది.

బుధవారం నుంచి పింఛన్ల పంపిణీ - వారికి ఇంటి వద్దకే సొమ్ము - Pensions Distribution in AP

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు లక్షా 27 వేల మంది ఉంటే వీరిలో వైద్య సేవలు అందించే ఏఎన్‌ఎంలు, వార్డు ఆరోగ్య కార్యదర్శులు 12వేల 770 మంది, వ్యవసాయ అనుబంధ సేవలు అందించే వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య సహాయకులు 14వేల 232 మంది, విద్యుత్‌ పనులు చేసే ఎనర్జీ అసిస్టెంట్లు, వార్డు ఎనర్జీ సెక్రటరీలు 6వేల 754 మంది సేవలను పింఛన్ల పంపిణీకి వినియోగించుకోవడం సాధ్యం కాదన్నారు. ఒకవేళ వారికి ముఖ్యమైన పనులే ఉన్నా మూడు రోజుల పాటు ఈ పనికి వినియోగిస్తే కొంపలు మునిగిపోయేదేముందనేని ప్రశ్న.

ఇప్పుడు వేసవి కాలం. పంటలు లేవు. వ్యవసాయ పనులు ఉండవు. మరి వ్యవసాయ అనుబంధ రంగాల ఉద్యోగులు మూడు రోజుల పాటు ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తే అంతగా వచ్చే ఇబ్బందేంటో. ఏ పంటలు ఎండిపోతాయో? ఏ వ్యవసాయ పనులకు ఇబ్బందులు వస్తాయో సీఎస్‌ చెప్పగలరా. ఎనర్జీ అసిస్టెంట్లు, వార్డు ఎనర్జీ కార్యదర్శులు 6వేల 754 మంది. ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్తు వినియోగమూ పెద్దగా లేదు. అంత అత్యవసరంగా చేసే పనులేమీ లేవు. వీళ్లు పింఛన్ల పంపిణీలో పాల్గొంటే తలెత్తే లోటు ఏంటో సీఎస్‌ వివరించగలరా. ఏఎన్‌ఎంలు, ఆరోగ్య కార్యదర్శులు 12వేల770 మంది. పింఛనుదారుల ఇళ్ల దగ్గరకు వీరు వెళితే వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే అవకాశం ఉంటుంది.

పింఛనుదారుల్లో అత్యధికంగా ఉండేది వృద్ధులే. వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు తెలుసుకునేందుకు పింఛన్ల పంపిణీ ఉపయోగపడుతుంది కూడా. మరి ఈ ఉద్యోగులు పింఛన్లు పంపిణీ చేస్తే వచ్చే సమస్యలేంటో సీఎస్ చెప్పగలగా అనేది ప్రశ్న. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉండి 24 గంటలు కసరత్తు చేసి ఇచ్చే ఆదేశాలివా. మొత్తం పింఛనుదారులు 65లక్షల 92 వేల మంది ఉంటే వారిలో ఇంటి వద్దకే పంపిణీ చేసే పింఛనుదారుల సంఖ్య 8లక్షల 60 వేలే. అంటే మొత్తం పింఛనుదారుల్లో ఇది 13 శాతమే. ఇక సచివాలయాల దగ్గరకే రప్పించే పింఛనుదారుల సంఖ్య 56లక్షల 91 వేల మంది. ఇళ్ల నుంచి పింఛను తీసుకునేందుకు బయటికి రప్పిస్తున్నారు. వీరి సంఖ్య మొత్తం పింఛన్లలో 86.33 శాతం. ఇంతమందిని సచివాలయాల దగ్గరకు రప్పించడమంటే దీనికి తెదేపానే కారణమని చూపించేందుకు వైఎస్సార్సీపీ అమలు చేస్తున్న కుట్రకు సహకరించడం కాక మరేంటనేది ప్రశ్న.

పింఛన్ల పంపిణీపై సోమవారం సీఎస్‌ అధ్యక్షతన జిల్లా కలెక్టర్లతో సమావేశం జరిగింది. అందులో అత్యధిక శాతం కలెక్టర్లు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛనుదారుల ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేయొచ్చని స్పష్టంగా చెప్పారు. పింఛనుదారులను సచివాలయాలకు రప్పించడమంటే వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేయడమేనని పలువురు కలెక్టర్లు ఘంటాపథంగా చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో ఎదురయ్యే సమస్యలనూ ప్రస్తావించారు. అక్కడ ఇళ్ల వద్దనే పంపిణీ చేయాలనే నిర్ణయానికి అందరు కలెక్టర్లు ముక్తకంఠంతో ఆమోదించారు. సచివాలయమున్న గ్రామాలకు 3, 4 కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రామాలకు సచివాలయ ఉద్యోగులను పంపి పింఛనుదారు ఇళ్ల వద్దనే పంపిణీ చేయాలని సూచించారు. వాలంటీర్లకు ప్రభుత్వం గౌరవ వేతనం మే నెలలో కూడా ఇస్తున్నందున పంపిణీకి వీలుగా పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల ఇళ్లను సచివాలయ ఉద్యోగులకు చూపించేందుకు మాత్రమే పరిమితం చేసి వారి సేవలను వినియోగించుకోవచ్చనే సూచనను పలువురు చేశారు. గ్రామాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండబోదని కూడా తెలిపారు.

పింఛన్ల పంపిణీ అంశంపై రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు లేఖ - Chandrababu Fight on Pensions

పట్టణాల్లో కొంతమేర ఇబ్బంది తలెత్తె అవకాశమున్నా అధిగమించవచ్చని సూచించారు. ఇద్దరు, ముగ్గురు కలెక్టర్లు మాత్రమే కొన్ని సమస్యలను ప్రస్తావించారు. ఇలా కలెక్టర్లు చెప్పిన అంశాలన్నింటినీ కాదనేలా అదే సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా పింఛనుదారుల ఇళ్ల వద్ద పంపిణీ సాధ్యపడదని మురళీధరరెడ్డి తేల్చి చెప్పారు. మొత్తానికి పింఛనుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా పంపిణీ చేసే నిర్ణయాన్ని కలెక్టర్లకే వదిలిపెడుతూ సమావేశం అనంతరం నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగానే సవరించిన ఉత్తర్వులు జారీ చేయాలని సెర్ప్, గ్రామ, వార్డు సచివాలయ శాఖలను సీఎస్‌ ఆదేశించారు. ఆ మేరకు సోమవారం సాయంత్రానికే ఆదేశాలు సిద్ధం చేశారు కూడా. కానీ అవి విడుదల కాకుండా తొక్కిపెట్టారు. ఇక్కడే ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యంతో మురళీధరరెడ్డి చక్రం తిప్పినట్టు తెలిసింది.

పింఛనుదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను అందించాలనే విధంగా సోమవారం తయారు చేసిన ఆదేశాలను తిరిగి సవరించి వైఎస్సార్సీపీకు అనుకూలంగా మార్చేందుకు మంగళవారం ఉదయం నుంచి తీవ్ర కసరత్తు జరిగింది. ఇందులో మురళీధరరెడ్డితోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ కూడా భాగస్వాములయ్యారు. ఆయనే సెర్ప్‌ కార్యాలయానికి వచ్చి మురళీధరరెడ్డితో ఏకాంతంగా భేటీ అయ్యారు. మురళీధరరెడ్డి రాజసం ఎలా ఉందో, ఆయన ఎంత ప్రభావితం చేస్తున్నారో ఇక్కడే తెలిసిపోతుంది. చివరకు తీవ్ర మధనం చేసి కలెక్టర్లు ఇచ్చిన సూచనలన్నీ పక్కనపెట్టి వైఎస్సార్సీపీకు మేలు జరిగేలా ఉత్తర్వులిచ్చారు. పింఛను పంపిణీని పర్యవేక్షణ చేయాల్సింది గ్రామ, వార్డు సచివాలయశాఖ. ఇళ్ల వద్దనే అందించేందుకు సరిపడా ఉద్యోగులు ఉన్నారా? లేదా అనేది ఆ శాఖే చూసుకుంటుంది. జిల్లాల్లో ఇళ్ల వద్ద పంపిణీ సాఫీగా జరిగేలా చూసుకునేందుకు కలెక్టర్లు ఉన్నారు. వారందరూ ఇళ్ల వద్ద పంపిణీకి సుముఖత వ్యక్తం చేసినా ఇక మురళీధరరెడ్డికి, శశిభూషణ్‌కుమార్‌కు ఇక్కడ వచ్చిన ఇబ్బందేంటి అనేది ప్రశ్న. ఇది కచ్చితంగా వైఎస్సార్సీపీకు అనుకూలంగా వ్యవహరించడమే అని స్పష్టమవుతోంది.

రాష్ట్రంలో 65.92 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారు. ఇందులో అత్యధికంగా 34.18 లక్షలమంది వృద్ధులున్నారు. పింఛనుదారుల్లో దాదాపుగా సగం వారే. ఎండలు ఎంతగా మండిపోతున్నాయో ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి, ఆదేశాలిచ్చిన శశిభూషణ్‌కుమార్‌కు దీని వెనుక కుతంత్రాన్ని నడిపిన మురళీధరరెడ్డికి తెలియదా. 42 డిగ్రీలకు చేరి ఎండలు ఠారెత్తిస్తుంటే వృద్ధులు ఇళ్లు దాటి బయటకు రాగలరా? సచివాలయాల వద్ద గంటల తరబడి వేచి ఉండగలరా? అయినా అలా రప్పించేందుకే నిర్ణయం తీసుకున్నారంటే వారిని ప్రమాదంలోకి నెట్టడమే. పొరపాటున వారికి ఏదైనా జరిగితే దీనికి బాధ్యత వహించాల్సింది వీరు కాదా? అన్ని తెలిసీ ఇలాంటి ఆదేశాలిచ్చారంటే వైఎస్సార్సీపీకు, జగన్‌కు ఎంతగా భజన చేస్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది. వృద్ధుల తర్వాత వితంతువులు 15.90 లక్షల మంది ఉన్నారు. ఒంటరి మహిళలు 1.79 లక్షల మంది ఉన్నారు. వీరు కాకుండా చేనేత కార్మికులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, చర్మకారులు, కల్లుగీత కార్మికులు ఉంటారు. వీరంతా ఎండల్లో సచివాలయాలకు ఎలా రాగలరు.

తాజాగా ఇచ్చిన ఆదేశాల్లో ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేయాలని అధికారులు చూపించిన వారి సంఖ్య నామమాత్రమే. ఎలా ఆదేశాలిస్తే వైఎస్సార్సీపీకు మేలు జరుగుతుందో అన్ని లెక్కలు వేసుకునే పక్కాగా జారీ చేశారు. మొత్తంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారు, వీల్‌చైర్‌లో ఉన్న వారు, సైనిక పింఛన్లు పొందుతున్న వారు అంతా కలిపినా 8.61 లక్షల మంది పింఛనుదారులే. అయినా తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారికి, వీల్‌ఛైర్‌లో ఉన్న వారికి ఇళ్ల దగ్గరే ఇస్తామని చెప్పడం అదేమన్నా ప్రత్యేక వెసులుబాటా? ఇలాంటి వారికి ఏళ్లుగా ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.

సైనిక పింఛన్లు తీసుకున్నంటున్నదీ 421 మందే. ఈ కేటగిరీలోనూ వృద్ధులకే ఇళ్ల వద్ద ఇస్తారట. వీటిని చూస్తే ఎంత దుర్మారంగా ఆదేశాలిచ్చారో దీని వెనుక ఎన్ని కుయుక్తులు పన్నారో అవగతమవుతుంది. ఇక గిరిజనుల పట్ల మరింత కర్కశంగా వ్యవహరించారు. కొన్ని చోట్ల వారు నివసిస్తున్న ప్రాంతం నుంచి గ్రామ, వార్డు సచివాలయాలకు రావాలంటే కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటాలి. వీరికి కూడా ఇళ్ల వద్ద పంపిణీ చేసేందుకు అనుమతివ్వలేదు. వారికి సమీపంలో ఉండే గ్రామ, వార్డు సచివాలయాలను ఎంపిక చేసి అక్కడికి రప్పించి అందించాలని ఆదేశాలిచ్చారు. ఎంపిక బాధ్యతను కలెక్టర్లపై నెట్టేశారు.

అనుయాయులకే బిల్లులు- పింఛన్లకూ డబ్బుల్లేకుండా ఊడ్చేసిన వైసీపీ సర్కార్ - Payment Of Bills During Elections

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.