ETV Bharat / state

అనుయాయులకే బిల్లులు- పింఛన్లకూ డబ్బుల్లేకుండా ఊడ్చేసిన వైసీపీ సర్కార్ - Payment Of Bills During Elections

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 3, 2024, 6:44 AM IST

Updated : Apr 3, 2024, 9:18 AM IST

Payment Of Bills During Elections: వైసీపీ ప్రభుత్వం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేసుకుంటోంది. తన అనుయాయులకే పెద్ద మొత్తంలో బిల్లులు చెల్లిస్తోంది. ఆర్థిక సంవత్సరం చివరి నెలలో ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత కూడా ఇతర ప్రాధాన్యాంశాలన్నింటినీ విస్మరించి ఎలాంటి నిబంధనలూ పాటించకుండా ఏకంగా రూ.14 వేల కోట్ల చెల్లింపులు పూర్తి చేసేసింది.

Payment_of_Bills_During_Elections
Payment_of_Bills_During_Elections

అనుయాయులకే బిల్లులు- పింఛన్లకూ డబ్బుల్లేకుండా ఊడ్చేసిన వైసీపీ సర్కార్

Payment Of Bills During Elections: ఎందరో గుత్తేదారులు, సరఫరాదారులు ఆర్థికశాఖ అధికారుల చుట్టూ తిరిగి విన్నవించుకున్నా, మొదట వచ్చిన బిల్లు మొదటే చెల్లించే విధానం అనుసరించాలని కోరినా చెవిటి వాడి ముందు శంఖం ఊదిన చందంగా మారిపోయింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శి నేతృత్వంలోనే ఆర్థికశాఖ కార్యదర్శి కె.వి.వి.సత్యనారాయణ ప్రభుత్వ పెద్దలకు కావల్సినవారికే బిల్లులు చెల్లిస్తున్నారని గుత్తేదారులు మండిపడుతున్నారు.

ఈ క్రమంలోనే కార్పొరేషన్‌ ద్వారా 4 వేల కోట్ల అప్పులు తెచ్చి మరీ కావాల్సిన వారికి అధికారులు బిల్లులు చెల్లించేశారు. ప్రతిపక్ష నాయకులు ఈ అతిక్రమణలపై ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. ఏ క్షణమైనా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వస్తే మళ్లీ తమ వారికి బిల్లుల చెల్లింపులు కష్టమవుతాయనే భావనతో త్వరత్వరగా ఈ కార్యక్రమం కానిచ్చేశారు. ఆర్థిక సంవత్సరం చివరి రోజు 12 వందల కోట్ల బిల్లులు చెల్లించడం దీనికి నిదర్శనం.

రేపు ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వంలో తమవారికి బిల్లుల చెల్లింపులు సాధ్యం కావేమోననే భయంతోనే ఇలా చేస్తున్నారని కొందరు గుత్తేదారులు వాపోతున్నారు. పాత ప్రభుత్వ హయాంలో మొదట పెన్షన్లు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు చెల్లించేవరకు ఇతర బిల్లులు ఏమీ ఇచ్చేవారు కాదు. ప్రతి నెలా చివరి వారం నుంచే అన్ని ఇతర బిల్లులు నిలిపేసేవారు.

సొంత పార్టీ పాలక వర్గాలకు జగన్​ సర్కార్​ బుజ్జగింపు - రూ. 530 కోట్లు ఎర - Payment of Bills Before Election

వైసీపీ ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు ఏప్రిల్‌ 1న సామాజిక పెన్షన్లు చెల్లించాలన్న సంగతి తెలుసు. లక్షల మంది పేదలు పెన్షన్ల కోసం ఎదురుచూస్తుంటారనీ తెలుసు. అందుకు తగ్గట్టుగా నెల చివర్లో వచ్చిన ఆదాయాన్ని సర్దుబాటు చేసుకుని ఇతర బిల్లులు పెండింగులో ఉంచుకోవచ్చు. వైసీపీ ప్రభుత్వం సామాజిక పింఛన్లకు కూడా నిధులు కేటాయించకుండా అనుయాయులకు బిల్లుల చెల్లింపులకే ప్రాధాన్యమివ్వడం పేదల ప్రభుత్వమన్న వారి మాటలకు, చేతలకు పొంతన లేదని స్పష్టం చేస్తోంది.

ఇప్పుడు పింఛను సొమ్ముల కోసం బహిరంగ మార్కెట్‌ రుణం కోసం వెళ్లాల్సి వచ్చింది. ఆ రుణం జమయిన తర్వాత సామాజిక పింఛన్లు మూడు రోజుల పాటు చెల్లించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. కొత్త ఆర్థిక సంవత్సరాన్ని రాష్ట్రం అప్పులతోనే ప్రారంభించింది. రిజర్వు బ్యాంకు కల్పించిన వివిధ వెసులుబాటు అప్పుల్లో భాగంగా ప్రత్యేక డ్రాయింగ్‌ సదుపాయం కింద వెయ్యి కోట్లు వాడేసింది. మరోవైపు రాబడుల కన్నా తొలి వారంలో రుణాల ఆధారిత చెల్లింపులకే ప్రాధాన్యం ఇస్తోంది.

పరిశీలన, పారదర్శకత లేకుండానే చెల్లింపులు - అధికార పార్టీ అనుయాయులకే బిల్లులు - Payment of Bills Without Screening

మంగళవారం రిజర్వుబ్యాంకు నుంచి బహిరంగ మార్కెట్‌ రుణం తీసుకుంది. మొత్తం 4 వేల కోట్ల అప్పులకు కేంద్రం అడ్‌హాక్‌ అనుమతులు ఇచ్చింది. ఆ మేరకు 500 కోట్లు 7.39 శాతం వడ్డీ రేటుకు 6 ఏళ్ల కాలపరిమితితో మరో 500 కోట్లు 7.46 శాతం వడ్డీతో 18 ఏళ్ల కాలపరిమితితో తీర్చేలా తీసుకున్నారు. 17, 18, 20 ఏళ్ల కాలపరిమితితో తీర్చేలా మరో వెయ్యేసి కోట్ల రూపాయల రుణాలు తెచ్చారు. ఈ నిధులన్నీ నేడు ఖజానాకు చేరనున్నాయి. వీటితోపాటు ఇతరత్రా చేబదుళ్లతో తొలుత సామాజిక పింఛన్లు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమవుతుంది.

వైసీపీ సర్కారు ఏనాడూ ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తేదీన జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వలేదు. ఆఖరికి ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత కూడా ఈ పరిస్థితి మారలేదు. రెండో తేదీ దాటినా ఎవరికీ జీతాలు, పెన్షన్లు ఇవ్వలేదు. మార్చి చివర్లో సొమ్ములన్నీ అయిన వారికి బిల్లులివ్వడానికే సరిపోయాయి. ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి దాదాపు 25 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. వాటిలో అతి కొద్ది మొత్తంలో కొందరికి జీపీఎఫ్, ఏపీ జీఎల్‌ఐ మాత్రమే ఇచ్చారు. కరవు భత్యం బకాయిలు, సరెండర్‌ లీవు, పదవీ విరమణ ప్రయోజనాలు, ఇతర రుణాల రూపంలో ఇవ్వాల్సిన మొత్తాలు, గ్రాట్యుటీ ఇలా ఎన్నో పెండింగులోనే ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

Last Updated : Apr 3, 2024, 9:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.