ETV Bharat / state

భాగ్యనగరంలో శ్రీరామనవమి శోభాయాత్రకు సర్వం సిద్ధం - ఆయా ప్రాంతాల్లో వాహనాల మళ్లింపు - arrangements on SriRama Shoba yatra

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 16, 2024, 8:39 PM IST

Updated : Apr 16, 2024, 10:49 PM IST

All arrangements set for Shobha Yatra on Sri Rama Navami : శ్రీరామనవమి వేళ ఏటా భాగ్యనగరంలో జరిగే శోభాయాత్ర ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. యాత్ర కొనసాగే మార్గాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో తాగునీటితో పాటు నిమ్మరసం, మజ్జిగ, అల్పాహారం అందించనున్నారు. పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో మద్యం దుకాణాలు మూసివేయనున్నారు.

Etv Bharat
Etv Bharat

All arrangements set for Shobha Yatra on Sri Rama Navami : శ్రీరామనవమి పురస్కరించుకొని ఏటా హైదరాబాద్‌లో అంగరంగా వైభవంగా శోభయాత్ర సాగుతుంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన నేపథ్యంలో ఈసారి మరింత ఘనంగా జరగనుంది. శోభాయాత్ర కొనసాగే అన్ని మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించిన పోలీసులు, పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్ననారు.

ఇప్పటికే జీహెచ్​ఎంసీ(GHMC), రెవెన్యూ, జలమండలి, విద్యుత్‌ తదితర శాఖల అధికారులతో హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. శోభాయాత్ర సీతారాంబాగ్‌ శ్రీరాముడి ఆలయం వద్ద మొదలై మంగళ్‌హాట్‌, జాలీ హనుమాన్‌, ధూల్‌పేట్‌, పూరానాపూల్‌, జుమ్మేరాత్‌ బజార్‌, చుడీ బజార్‌, బర్తన్‌ బజార్‌, బేగంబజార్‌ ఛత్రి, సిద్యంబర్‌ బజార్‌, గౌలిగూడ చమన్‌, గురుద్వార, పుత్లిబౌలి, కోఠి మీదగా సుల్తాన్‌బజార్‌ హనుమాన్‌ వ్యాయామశాలకు చేరుకుని ముగియనుంది.

Arrangements for Sri Rama Shobha Yatra in Hyderabad : శోభాయాత్ర నేపథ్యంలో మూడు కమిషనరేట్ల పరిధిలో 17వ తేదీ నుంచి 18 వరకు బార్లు, మద్యం దుకాణాలు మూసివేయనున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. గోషామహల్‌, సుల్తాన్‌బజార్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో వాహనాలను దారి మళ్లించనున్నారు. ఊరేగింపు ప్రారంభమయ్యాక ఆసిఫ్‌నగర్‌ నుంచి వచ్చే వాహనాలను బోయిగూడ కమాన్‌ మీదగా మల్లేపల్లి చౌరస్తా, విజయ్‌నగర్‌ కాలనీ, నాంపల్లి మీదగా మెహిదీపట్నం వైపు మళ్లించనున్నారు.

శోభా యాత్ర ఫ్రెండ్స్‌ కేఫ్‌ వద్దకు చేరుకోగానే ఆఘాపుర, హబీబ్‌నగర్‌, బోయిగూడ కమాన్‌ మీదగా మళ్లిస్తారు. బోయిగూడ కమాన్‌ వద్దకు యాత్ర సమీపించగానే దారుస్సలాం నుంచి వచ్చే వాహనాలను ఆఘాపుర, చార్‌కండిల్‌ చౌరస్తా, నాంపల్లి మీదగా మళ్లించనున్నారు. శోభాయాత్ర చేరుకునే ప్రాంతాల ఆధారంగా వాహనాల మళ్లింపు ఉంటుందని పోలీసులు తెలిపారు.

శోభాయాత్ర సాఫీగా సాగేలా సహకారించాలి : తూర్పు మండలంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి పదకొండున్నర వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. వాహనదారులు, ప్రజలు పోలీసులు విధించిన ట్రాఫిక్‌ ఆంక్షలు పాటించి శోభాయాత్ర సాఫీగా కొనసాగేలా సహకరించాలని పోలీసు ఉన్నతాధికారులు కోరారు.

'నాలుగైదు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఈ సందర్భంగా శోభా యాత్రలోగానీ, ఇతర కార్యక్రమంలోగానీ రాజకీయానికి సంబంధం ఉండకూడదు. ఇదీ మొదటి ఆంక్షలుగా విధించాలని ఎన్నికల సంఘం సూచించింది. దాని ప్రకారం అన్నీ ఏర్పాటు చేశాం. శోభాయాత్రలో కూడా రాజకీయ ప్రసంగాలకు తావివ్వకుండా, అలాంటి వారిని ఆహ్వానించకపోవడమే మేలు.'- ​కొత్త కోట శ్రీనివాస్‌రెడ్డి, సీపీ హైదరాబాద్‌

భద్రాద్రి రాముడు పెళ్లి కొడుకాయెనే, ఏప్రిల్ 17న కల్యాణానికి భారీ ఏర్పాట్లు - Bhadradri Ramayya Kalyanam 2024

భద్రాద్రి రామయ్య కల్యాణానికి ముహూర్తం ఫిక్స్ - ఏప్రిల్‌ 9 నుంచి బ్రహ్మోత్సవాలు

Last Updated : Apr 16, 2024, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.