ETV Bharat / state

అన్నదాతలకు గుడ్ న్యూస్ - జులై నుంచి రైతు భరోసా అమలు - RYTHU BHAROSA SCHEME FROM JULY

author img

By ETV Bharat Telangana Team

Published : May 26, 2024, 8:38 AM IST

Updated : May 26, 2024, 9:05 AM IST

Minister Thummala Interview 2024 : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని, వాటిని కచ్చితంగా అమలు చేసి తీరుతామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గత ఐదు నెలలుగా రైతు సంక్షేమ పథకాల అమలుపైనే దృష్టి సారించామని పేర్కొన్నారు. ప్రతిరోజు సమీక్షలు జరిపి ఎప్పటికప్పుడు ఆదేశాలిచ్చామని తెలిపారు. పంద్రాగస్టులోపు అన్నదాతలకు రూ.2 లక్షల రుణమాఫీ చేయడం ఖాయమని అన్నారు. వానాకాలం సీజన్‌ నుంచే పంట సాగు చేసేవారందరికీ రైతు భరోసా అమలు చేయనున్నట్లు, జులైలో ఎకరానికి రూ.7500 చొప్పున పెట్టుబడి సాయం అందుతుందని ‘ఈనాడు - ఈటీవీ భారత్‌కు' ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

Thummala Nageswara Rao Interview 2024
Thummala Nageswara Rao Interview 2024 (ETV Bharat)

  • మీరు అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో వ్యవసాయరంగం ఎలా ఉంది?

జవాబు : మేం వచ్చేనాటికి వానాకాలం పంట ముగిసి యాసంగి మొదలైంది. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీళ్లు లేవు. వానాకాలం పంటకు అప్పటి సర్కార్ నీరివ్వలేదు. కొనుగోలుకు సైతం కరెంట్ అందుబాటులో లేదు. కష్టమైనా సరే విద్యుత్ కొనుగోలు చేసి పంటలు కాపాడాం. భూగర్భజలాలు అడుగంటిన చోట ఇబ్బంది ఏర్పడింది. ఐనా గత యాసంగి కంటే ఈసారి ఎక్కువ పంటలు పండాయి. వర్షాకాలం పంటకు నీరివ్వకుండా బీఆర్ఎస్ నాయకులు మామీద నెపం మోపారు. భూగర్భ జలాలున్నాయని పంటలు పండుతాయనే ఆశతో అన్నదాతలు సాగు చేసినా ఈసారి అవి తగ్గిపోయి చివరి భూములకు నీరందలేదు.

  • రైతుల కోసం భారీ హామీలిచ్చారు, వాటి అమలు తీరు ఎలా ఉంది?

జవాబు : అన్నదాతలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో హస్తం పార్టీ ఎన్నికల ప్రణాళికలో హామీలు ఇచ్చింది. వాటికి భారీగా నిధులు అవసరం. రూ.2 లక్షల రుణమాఫీకే రూ.40,000ల కోట్లకు పైగా కావాలి. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దృష్ట్యా రుణం రాదు. తెలంగాణ ఆదాయం తగ్గింది. వీటిని అధిగమించి రుణమాఫీ చేయాలి. రైతుభరోసా, పంటల బీమా విధివిధానాలపై ఫోకస్ పెట్టాం. ధాన్యానికి బోనస్‌ను ప్రకటించాం.

Minister Thummala Interview 2024
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (ETV Bharat)
  • పంద్రాగస్టుకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌ హామీ ఇచ్చారు కదా?

జవాబు : బీఆర్ఎస్ సర్కార్ రూ.లక్ష మాఫీయే సరిగా చేయలేదు. మేం రూ.2 లక్షల మాఫీ కచ్చితంగా అమలు చేయాలనే సంకల్పంతోనే ఉన్నాం. ఒకే దఫా మొత్తం రుణమాఫీ చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. నిధుల సమీకరణకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుపై ఫోకస్ పెట్టాం. దీంతోబాటు మార్గదర్శకాలు తయారుచేస్తున్నాం. తెలంగాణలో అన్నదాతలు తీసుకున్న రూ.2 లక్షలలోపు పంట రుణాలపై వాస్తవ గణాంకాలు ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించాం. ఎన్నికల కోడ్‌ ముగిశాక దీని కటాఫ్‌ తేదీపై కెబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. దీన్ని సీఎం ప్రకటిస్తారు.

  • రైతుబంధును ఐదెకరాలలోపు వారికి ఇస్తామన్నారు. అందరికీ వేశారు. రైతుభరోసా అందరికీ వర్తింపచేస్తారా?

జవాబు : సంక్షేమం నిరుపేదకు వెళ్లాలి. చేయూత అర్హులకు అందాలి. గత సర్కార్ హయాంలో రైతుబంధుకు ఆరేళ్లలో రూ.80,450 కోట్లు అందిస్తే, అందులో పంటలు వేయని వారికి రూ.25,000ల కోట్లు ఇచ్చారు. రైతుభరోసా ఐదెకరాల్లోపు వారికి సాయం అందించాలనే సూచనలు వస్తున్నాయి. రైతుబంధు కొనసాగుతున్న పథకం కాబట్టి దానిని యథాతథంగా అమలు చేద్దామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రైతుభరోసాలో మార్పులు చేయాలనుకుంటున్నాం. ఎన్ని ఎకరాల వారికి వర్తింపచేయాలనే దానిపై కేబినెట్‌ నిర్ణయం తీసుకుంటుంది. పరిమితి విధిస్తే భారీగా భూములున్న వారికి సాయం రాదు. నాకు కూడా సాయం అందదు. నేను అందుకు సిద్ధంగానే ఉన్నాను.

  • పంటల బీమా అమలుకు మార్గదర్శకాలు సిద్ధమయ్యాయా?

జవాబు : అకాల వానలు, వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలతో పాటు తెగుళ్లు, కరవు వల్ల పంటలు నష్టపోయిన వారిని ఆదుకునేలా ఈ పథకం ఉంటుంది. పంట దిగుబడులు తగ్గినా, పంట వేయలేని పరిస్థితులున్నా సాయం అందాలి. ఈ పథకానికి రూ.3500 కోట్ల మేర ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యాం. దీనిపై టెండర్‌ డాక్యుమెంట్ తయారవుతోంది. బీమా కంపెనీల కోసం కాకుండా అన్నదాతలకు మేలు జరిగేలా విధివిధానాలు ఉంటాయి. గతంలో అప్పు తీసుకున్న వారికే సాయం అందేది. ఇది బీమా కంపెనీలకు లాభం తెచ్చింది. కొత్త పథకం అలా ఉండదు. దీనిపై మేం పెట్టిన షరతులకు అంగీకరించే కంపెనీలనే ఎంపిక చేస్తాం.

  • వరికి బోనస్‌ ఇస్తామన్నారు, కానీ సన్న రకాలకే ప్రకటించి, దొడ్డు వడ్లకు ఎందుకు మినహాయించారు?

జవాబు : తెలంగాణలో భవిష్యత్‌లో సన్నరకం బియ్యం ఉత్పత్తి చేసి, రేషన్‌షాపుల ద్వారా పేదలకు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచిస్తున్నారు. దీనికోసం వాటి ఉత్పత్తిని పెంచాలి. ఇందుకు పెట్టుబడి ఎక్కువవుతుంది. దిగుబడి తక్కువ వస్తుంది. దీంతో అన్నదాతలు సాగుకు వెనుకాడుతున్నారు. ఎక్కువ దిగుబడి వస్తుందని దొడ్డు వడ్లనే వేస్తున్నారు. వారిని ప్రోత్సహించేందుకు ప్రాథమికంగా సన్నవడ్లకు బోనస్‌ ప్రకటించాం. అవసరాన్నిబట్టి దొడ్లు వడ్లకూ వర్తింపజేస్తాం.

  • వానాకాలం సీజన్‌ సన్నద్ధత ఎలా ఉంది

జవాబు : తెలంగాణలో వ్యవసాయం సుసంపన్నం కావాలి. వర్షాకాలం సీజన్‌కు కార్యాచరణ సిద్ధం చేశాం. వర్షాలు బాగుంటాయని వాతావరణశాఖ నివేదించింది. నీటి సమస్య ఉండదు. ఎరువులు, విత్తనాలు సరిపడా ఉన్నాయి.

  • పంటల వైవిధ్యీకరణలో రాష్ట్రం వెనుకంజలో ఉంది కదా?

జవాబు : రాష్ట్రంలో పప్పుదినుసులు, కూరగాయలు, ఆయిల్‌పామ్ వంటి ఉద్యాన పంటలకు బాగా డిమాండ్‌ ఉంది. ఏటా లక్ష ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు పెంచాలని ప్రయత్నిస్తున్నాం. వరికి అనుకూలం కాని భూముల్లో మిగిలిన పంటలు వేయించాలని అధికారులను ఆదేశించాం.

  • నకిలీ విత్తనాల నియంత్రణ ఎందుకు సాధ్యం కావడం లేదు?

జవాబు : నకిలీ విత్తనాల వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతున్నాం. రోజువారీ తనిఖీలు, దాడులు విస్తృతంగా జరుగుతున్నాయి. నకిలీ విత్తనాలు విక్రయించిన వారి లైసెన్స్‌లు రద్దు చేస్తున్నాం. క్రిమినల్‌ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నాం. పీడీ చట్టం ప్రయోగిస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న నకిలీ విత్తనాలను కట్టడి చేసేందుకు పోలీసు, టాస్క్‌ఫోర్స్‌ యంత్రాంగం పనిచేస్తున్నాయి. అన్నదాతలు అధీకృత డీలర్ల వద్ద విత్తనాలు కొనాలి. వాటి బిల్లు తీసుకోవాలి. అది ఉంటే పంట నష్టపోయిన సందర్భంలో కంపెనీల నుంచి పరిహారం వసూలు చేసేందుకు అవకాశం ఉంటుంది. విత్తనాలకు డిమాండ్‌ను బట్టి వాటిని ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించాం. విత్తనాల విక్రయాలపై రోజువారీ నిఘా ప్రారంభించాం. తెలంగాణ వ్యాప్తంగా ప్రతీషాపు నుంచి ఆన్‌లైన్‌ నివేదికలను హైదరాబాద్‌కు పంపాలని ఆదేశించాం. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు లైసెన్సింగ్‌ విధానంలో మార్పులు చేయనున్నాం.

  • వానాకాలం సీజన్‌కు రైతు భరోసా ఇస్తారా?

జవాబు : మేం వచ్చేనాటికి రైతుబంధు అమల్లో ఉంది. దానిని కొనసాగించాం. వర్షాకాలం సీజన్‌ నుంచి రైతు భరోసా అమలు చేస్తాం. వాస్తవంగా పంట వేసుకున్న వారికే దీనిని ఇస్తాం. జూన్‌లో ఎన్నికల కోడ్‌ ముగియగానే, దీనిపై అఖిలపక్షంతో పాటు అన్నదాతలు, రైతు సంఘాల అభిప్రాయాలు తీసుకుంటాం. అసెంబ్లీలో, మంత్రిమండలిలో దీనిపై చర్చిస్తాం.

  • కౌలు రైతులు, రైతు కూలీలకు సాయం చేస్తామని హామీ ఇచ్చారు?

జవాబు : పంట సాగుచేసిన వారికి రైతుభరోసా అందుతుంది. కౌలుదార్లు సాగు చేస్తే వారికే నిధులిస్తాం. మార్గదర్శకాలు రూపొందిస్తున్నాం. భూములను కౌలుకు తీసుకునే సమయంలో అన్నదాతల నుంచి అఫిడవిట్లు తీసుకున్న కౌలుదార్లకే రైతుభరోసా సొమ్ము ఇస్తాం. రైతు కూలీల గుర్తింపు అంశాన్ని పంచాయతీరాజ్‌కు అప్పగించాం.

బీఆర్​ఎస్​ను దింపడానికి ప్రజలకు పదేళ్లు పట్టింది - కాంగ్రెస్ విషయంలో అంత సమయం పట్టదు : ప్రధాని మోదీ - PM Modi Interview 2024

భారతదేశం ఓ ప్రపంచ శక్తిగా ఆవిర్భవిస్తోంది - అందుకే మా చూపు మరింతగా ఇటువైపు : ఎరిక్‌ గార్సెట్టి - US ENVOY ERIC GARCETTI INTERVIEW

Last Updated : May 26, 2024, 9:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.