ETV Bharat / sports

భారత్xఇంగ్లాండ్ రాంచీ టెస్టు- సిరీస్​పై టీమ్ఇండియా కన్ను- బుమ్రా స్థానంలో ఎవరంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2024, 9:01 PM IST

Ind vs Eng 4Th Test 2024: భారత్- ఇంగ్లాండ్‌ మధ్య నాలుగో టెస్టుకు రంగం సిద్ధమైంది. రాంచీ వేదికగా శుక్రవారం ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. మూడో టెస్టులో 434 పరుగుల భారీ తేడాతో గెలిచి జోరు మీదున్న భారత్ నాలుగో టెస్టులోనూ విజయం సాధించి సిరీస్ దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో ఎలానైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని ఇంగ్లండ్ ఆశిస్తోంది.

Ind vs Eng 4Th Test 2024
Ind vs Eng 4Th Test 2024

Ind vs Eng 4Th Test 2024: భారత్- ఇంగ్లాండ్‌ మధ్య శుక్రవారం రాంచీ వేదికగా నాలుగో టెస్టు మొదలు కానుంది. తొలి టెస్టు పరాభవం తర్వాత గాడిలో పడ్డ భారత్ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి జోరు మీదుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని తహతహలాడుతోంది. ఈ సిరీస్ గెలిస్తే స్వదేశంలో వరుసగా 17 టెస్టు సిరీస్‌ విజయాలు భారత్‌ ఖాతాలో చేరతాయి. స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లేనప్పటికీ యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తుండటం భారత్‌కు సానుకూల అంశంగా మారింది.

మూడో టెస్టులో ద్విశతకంతో అదరగొట్టిన యశస్వీ జైశ్వాల్‌ ఈ మ్యాచ్‌లోనూ కెప్టెన్ రోహిత్‌తో ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. వన్‌ డౌన్‌లో గిల్‌, తర్వాత రజత్ పటిదార్ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశముంది. సీనియర్ ఆల్‌రౌండర్‌ జడేజా, అరంగేంట్ర టెస్టులోనే అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్ మళ్లీ రాణించాలని జట్టు భావిస్తోంది. వర్క్‌లోడ్‌తో పాటు భవిష్యత్ మ్యాచ్‌లను దృష్టిలో ఉంచుకుని స్టార్ బౌలర్ బుమ్రాకు విశ్రాంతినివ్వడం వల్ల ఈ మ్యాచ్‌లో అతడి స్థానంలో ఎవరు ఆడతారనేది ఆసక్తిగా మారింది.

వైజాగ్‌ టెస్టులో ఆడిన ముకేశ్ కుమార్‌ను మళ్లీ తీసుకుంటారా లేదా అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న ఆకాశ్ దీప్‌ను ఆడిస్తారా అనేది ఆసక్తి కలిగిస్తోంది. బుమ్రా గైర్హాజరీలో జడేజా, అశ్విన్‌, కుల్దీప్‌లతో కూడిన బౌలింగ్ విభాగాన్ని సిరాజ్ ముందుండి నడపనున్నాడు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో నాలుగో స్పిన్నర్‌తో బరిలోకి దిగితే అక్షర్‌ పటేల్‌, సుందర్‌లలో ఒకరికి అవకాశం దక్కనుంది. ఝార్ఖండ్‌లో గతంలో జరిగిన మ్యాచ్‌ల్లో ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో కూడిన కూర్పు మంచి ఫలితాలు ఇవ్వడం వల్ల భారత్ అదే తరహా జట్టును కొనసాగించేలా కనిపిస్తోంది.

మరోవైపు భారత్​పై 'బజ్‌బాల్' వ్యూహం పనిచేయకపోవడం ఇంగ్లాండ్‌ను కలవరపెడుతోంది. తొలి టెస్టు తర్వాత ఇంగ్లాండ్ అభిమానులు ఆశించిన మేర ఆ జట్టు ఆకట్టుకోలేకపోయింది. ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలిచి సిరీస్‌లో నిలవాలని భావిస్తున్న ఇంగ్లీష్ జట్టు కొన్ని మార్పులతో బరిలోకి దిగనుంది. రెహాన్ అహ్మద్ స్థానంలో షోయబ్ బషీర్‌ను తీసుకుంది. స్పిన్ విభాగంలో టామ్ హర్ట్‌లీతో పాటు , సీనియర్ ఆటగాడు జోరూట్ బౌలింగ్ వేసే అవకాశముంది. బ్యాటింగ్‌లో జాక్ క్రాలీ, బెన్ డకెట్, కెప్టెన్‌ స్టోక్స్ రాణిస్తున్నప్పటికీ జో రూట్, బెయిర్‌స్టో బాగా ఆడాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. సీమ్ విభాగంలో సీనియర్ ఆటగాడు జేమ్స్ ఆండర్సన్‌తో కలిసి ఓలీ రాబిన్‌సన్ బౌలింగ్ చేయనున్నాడు. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-1 తేడాతో భారత్ ముందంజలో ఉంది.

బజ్​బాల్- ఇంగ్లీష్ జట్టుకు ఇప్పుడిది భారమా? వరమా?

రాంచీ టెస్టుకు బుమ్రా దూరం!- 'ఈటీవీ భారత్' చిట్​చాట్​లో బీసీసీఐ మెంబర్ క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.