ETV Bharat / sports

రంజీ వేదికగా రికార్డు - అరుదైన మైల్​స్టోన్​ను దాటిన పుజారా

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 21, 2024, 4:33 PM IST

Cheteshwar Pujara First Class Cricket : రంజీ ట్రోఫీ వేదికగా టీమ్ఇండియా నయా వాల్​ ఛతేశ్వర్​ పుజారా ఓ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఆ విశేషాలు మీ కోసం

Cheteshwar Pujara First Class Cricket
Cheteshwar Pujara First Class Cricket

Cheteshwar Pujara First Class Cricket : టీమ్ఇండియా స్టార్ క్రికెటర్​ ఛతేశ్వర్‌ పుజారా తాజాగా ఓ అరుదైన ఘనతను సాధించాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 20 వేల పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. రంజీ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్‌లో విద‌ర్భ‌ జట్టుతో జ‌రిగిన మ్యాచ్‌లో పుజారా 20 వేల ప‌రుగుల మైల్​స్టోన్​ను దాటాడు. అంతర్జాతీయ టెస్ట్‌లు, దేశవాలీ టోర్నీలు కలిసి మొత్తం 260 మ్యాచ్‌లు ఆడిన ఈ నయా వాల్​, ఇప్పటి వరకు 61 శతకాలు, 77 అర్ధశతకాలతో 51.96 సగటున 20,013 పరుగలు చేశాడు.

అయితే పుజారాకు ముందు ఈ జాబితాలో టీమ్ఇండియాకు చెందిన పలువురు ప్లేయర్లు స్థానాన్ని సంపాదించుకున్నారు. అందులో 25, 834 పరుగులతో మాజీ స్టార్ సునీల్‌ గావస్కర్‌ ఉన్నారు. ఆ తర్వాత ఈ లిస్ట్​లో సచిన్‌ తెందూల్కర్‌ (25,396), రాహుల్‌ ద్రవిడ్‌ (23,794) ఉన్నారు. పూజారా కాకుండా వీరు ముగ్గురు మాత్రమే ఇప్పటి వరకు భారత్‌ తరఫున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 20,000 పరుగుల మార్కును దాటారు. ఇక అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇంగ్లాండ్​ మాజీ ఆటగాడు జాక్‌ హాబ్స్‌ పేరిట ఉంది. హాబ్స్‌ 1905-34 మధ్య కాలంలో ఏకంగా 61,760 పరుగులు చేసి ఈ రికార్డులో టాప్​లో ఉన్నాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్​కు దిగిన సౌరాష్ట్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 206 పరుగులకు స్కోర్​ చేసి ఆలౌటైంది. ఉమేశ్‌ యాదవ్‌ (4/56), సర్వటే (2/22), హర్ష్‌ దూబే (2/15), ఆధిత్య థాక్రే (1/51), యశ్‌ ఠాకూర్‌ (1/57) సౌరాష్ట్రను తమ బౌలింగ్​ స్కిల్స్​తో చెలరేగిపోయారు. ఇక సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో హార్విక్‌ దేశాయ్‌ (68) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన విదర్భ జట్టును ఉనద్కత్‌ (2/46), చిరాగ్‌ జానీ (4/14), ప్రేరక్‌ మన్కడ్‌ (2/5), ఆదిత్య జడేజా (1/12) ఓడించారు. దీంతో విదర్భ జట్టు తొలి ఇన్నింగ్స్‌లోనే 78 పరుగులకే ఆలౌటైంది.

ఆ తర్వాత సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌరాష్ట్ర జట్టులో పుజారాతో పాటు కెవిన్‌ జివ్‌రజనీ (57), విశ్వరాజ్‌ జడేజా (79) రాణించడం వల్ల 244 పరుగులు చేసి ఆ జట్టు ఆలౌటైంది. ఉమేశ్‌ యాదవ్‌, ఆదిత్య తారే చెరో 3 వికెట్లు, యశ్‌ ఠాకూర్‌, హర్ష్‌ దూబే తలో 2 వికెట్లు తీశారు. అలా 373 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విదర్భ జట్టు మూడో రోజు రెండో సెషన్‌ ముగిసే సమయానికి సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 75 పరుగులు మాత్రమే చేయగలిగింది. అథర్వ తైడే (42), హర్ష్‌ దూబే (0) క్రీజ్‌లో ఉన్నారు. చిరాగ్‌ జానీ, ప్రేరక్‌ మన్కడ్‌ తలో 2 వికెట్లు, ఉనద్కత్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.