ETV Bharat / spiritual

పెద్ద పండుగకు 'నర్మదా' నది సిద్ధం- పుష్కరాలు ఏడాది అంతా ఉంటాయా? - Narmada Pushkaralu 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 28, 2024, 5:31 AM IST

Narmada Pushkaralu 2024 : భారతదేశంలోని 12 పుణ్య నదుల్లో నర్మదా నది ఒకటి. ఈ నదులకు పుష్కరాలు ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి వస్తాయి. బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి. ఈ ఏడాది మే 1వ తేదీ నుంచి నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభం కానున్న శుభ సందర్భంలో, అసలు పుష్కరాలంటే ఏమిటి? నదులకు పుష్కరాలు ఎందుకు వస్తాయి? పుష్కరాల వెనుక ఉన్న ఇతిహాసాల గురించి తెలుసుకుందాం.

Narmada Pushkaralu 2024
Narmada Pushkaralu 2024

Narmada Pushkaralu 2024 : ప్రతి నదికి పన్నెండేళ్లకు ఓసారి వచ్చే అతి పెద్ద పండుగ పుష్కరాలు. దేశంలోని 12 ప్రధాన పుణ్య నదులకు ఒక్కో నదికి ఒక్కో ఏడాది పుష్కరాలు జరుగుతాయి. 2024 మే 1వ తేదీ నుంచి నర్మదా నదికి పుష్కరాలు జరగనున్నాయి.

నదికి పుష్కరాలు ఎందుకు వస్తాయి?
మానవులు తాము చేసిన పాపాలను పోగొట్టుకోడానికి పవిత్ర నదుల్లో స్నానం చేస్తుంటారు! ఆ పాపాలన్నీ నదులలో కలియడం వల్ల నదులు అపవిత్రం అవుతున్నాయి! ఈ విధంగా నదులన్నీ అపవిత్రమై బాధపడుతుంటే చూడలేని పుష్కరుడు అనే మహానుభావుడు, బ్రహ్మ గురించి తపస్సు చేసి తనను ఒక పవిత్రమైన క్షేత్రంగా మార్చమని వేడుకుంటాడు. అప్పుడు బ్రహ్మ సంతసించి దేవ గురువైన బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశికి అనుసంధానమై ఉన్న నదిలో ప్రవేశించి ఏడాది పాటు ఆ నదిలో ఉండమని చెప్తాడు. అందుకు సంతసించిన పుష్కరుడు బ్రహ్మకు నమస్కరించి కార్యార్థియై బయలుదేరుతాడు.

పుష్కరుని రాకతో నదులకు ప్రవిత్రత
మానవుల పాపాలతో అపవిత్రమైన నదీజలాలు పుష్కరుని రాకతో పవిత్రతను పొందుతాయి. పుష్కరుడు నదిలో చేరగానే ఆయనకు ఆతిథ్యం ఇవ్వడానికి సప్త మహా ఋషులు ఆ నదికి చేరుకుంటారని శాస్త్ర వచనం. వారంతా సూక్ష్మ శరీరాలతో నదికి వచ్చి స్నానాదికాలు ఆచరిస్తారు. కాబట్టి ఈ ఏడాది కాలంలో ఎవరైతే ఆ నదిలో స్నానం చేస్తారో వారి సమస్త పాపాలు పోయి పునర్జన్మ లేకుండా శివ సన్నిధికి చేరుకుంటారని విశ్వాసం.

బృహస్పతి ఏ రాశిలో ఉంటే ఏ నదికి పుష్కరాలు వస్తాయి?
జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకు మొత్తం 12 రాశులు ఉన్నాయి. బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు భారత దేశంలోని 12 పుణ్య నదులకు ఒక్కో ఏడాది ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి.

  • బృహస్పతి మేష రాశిలో ప్రవేశించినప్పుడు గంగా నదికి పుష్కరాలు వస్తాయి.
  • బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి.
  • బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి.
  • బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు యమునా నదికి పుష్కరాలు వస్తాయి.
  • బృహస్పతి సింహ రాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి.
  • బృహస్పతి కన్యా రాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణా నదికి పుష్కరాలు వస్తాయి.
  • బృహస్పతి తులా రాశిలో ప్రవేశించినప్పుడు కావేరి నదికి పుష్కరాలు వస్తాయి.

బృహస్పతి వృశ్చికరాశిలో ప్రవేశించినప్పుడు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో ఉన్న భీమా అమరాజ నదికి పుష్కరాలు వస్తాయని కొందరు అంటారు. మరికొందరు తమిళనాడులో తిరునల్వేలి వద్ద ఉన్న తామ్రపర్ణి నదికి పుష్కరాలు వస్తాయని అంటారు. ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్న మాట వాస్తవం.

బృహస్పతి ధనుస్సు రాశిలో ప్రవేశించినప్పుడు రాజస్థాన్​లో ఉన్న తపతి నదికి పుష్కరాలు వస్తాయి. ఇదే సమయంలో అసోంలో ఉన్న బ్రహ్మపుత్ర నది ఒడ్డున కూడా పుష్కర పండుగ వైభవంగా జరుగుతుంది.

  • బృహస్పతి మకర రాశిలో ప్రవేశించినప్పుడు తుంగ భద్రా నదికి పుష్కరాలు వస్తాయి.
  • బృహస్పతి కుంభ రాశిలో ప్రవేశించినప్పుడు సింధు నదికి పుష్కరాలు వస్తాయి.
  • బృహస్పతి మీన రాశిలో ప్రవేశించినప్పుడు ప్రాణహిత నదికి పుష్కరాలు వస్తాయి.
  • ఈ ఏడాది బృహస్పతి వృషభరాశిలో ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి.

పుష్కరాలు ఏడాది పాటు ఉంటాయా?
సాధారణంగా పుష్కరుడు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నదికి ఏడాది పాటు పుష్కర వైభవం ఉంటుంది. ఆ ఏడాదంతా ఆ నదిలో స్నానం చేసిన వారికి పుష్కర స్నానం చేసిన ఫలితం దక్కుతుందని శాస్త్ర వచనం. అయితే మొదటి 12 రోజులు, చివరి పన్నెండు రోజులు దేవతలు, గంధర్వులు, సప్తఋషులు ఆయా నదుల్లో స్నానం చేసి పుష్కరానికి ఆతిథ్యం ఇవ్వడానికి వస్తారని అందుకే మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు శ్రేష్ఠమైనవని పెద్దలు, గురువులు చెబుతారు. ఏది ఏమైనా భారత దేశానికి మాత్రమే ప్రత్యేకమైన ఈ పుష్కర పండుగల్లో మనమందరం కూడా పాలుపంచుకుని కృతార్థులం అవుదాం.

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.