ETV Bharat / spiritual

పంచ సూత్రాలే మోక్ష మార్గాలు- ఎవరీ మహావీరుడు? జయంతి రోజు ఏం చేస్తారు? - Who Is Lord Mahavir

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 20, 2024, 4:07 PM IST

Mahavir Jayanti 2024
Mahavir Jayanti 2024

Mahavir Jayanti 2024 : మహావీర్ జయంతి శుభ సందర్భాన్ని పురస్కరించుని అసలు ఆయనెవరు? ఆయన ప్రచారం చేసిన సిద్ధాంతాలు, సూచించిన ఐదు ముఖ్య సూత్రాలు గురించి తెలుసుకుందాం

Mahavir Jayanthi 2024 : హిందూ పంచాంగం ప్రకారం ఛైత్ర మాసంలోని శుక్ల పక్షంలోని త్రయోదశి తిథి రోజున మహావీర్ జయంతిని జరుపుకుంటారు. జైన మతస్థులకు చెందిన ధర్మ ప్రచార గురుడు మహావీరుడు. అందుకే ఆయన జయంతి రోజు జైన మతస్తులకు పరమ పవిత్రమైన దినం. మహావీర్ జయంతి రోజున జైన మతస్తులు ఆయన గౌరవార్ధం ప్రభాత్ ఫేరీ, ఊరేగింపు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

పంచ సూత్రాలే మోక్ష మార్గాలు
మానవునిగా పుట్టిన ప్రతి ఒక్కరూ మోక్షాన్ని పొందాలంటే ఐదు సూత్రాలను తప్పక పాటించాలని మహావీరుడు బోధించాడు.

పంచ సిద్ధాంతం పరమోధర్మః
మహావీరుడు బోధించిన అహింస, అస్తేయ, బ్రహ్మచర్యం, సత్యం, అపరిగ్రహం అనే ఈ ఐదు సూత్రాలను మహావీర్ జయంతి రోజున ప్రజలందరూ స్మరించుకుంటూ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంతేకాకుండా ఈ పవిత్రమైన రోజున కఠినమైన ఉపవాస వ్రతాన్ని కూడా ఆచరిస్తారు.

ఎవరీ మహావీరుడు?
క్రీస్తుపూర్వం 599 బీసీ కాలంలో బిహార్​లో లార్డ్ మహావీర్ రాజు సిద్ధార్థ, రాణి త్రిసాల దంపతులకు జన్మించిన వర్ధమాన్ అనే మహావీరునికి 28 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తండ్రి మరణించగా రాజ్య బాధ్యతలు స్వీకరిస్తారు. యశోధర అనే కన్యను వివాహం చేసుకుంటారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంటుంది.

ఐహిక సుఖాలపై వైరాగ్యం, మోక్షం కోసం అడవుల బాట
రాజ కుటుంబంలో పుట్టిన మహావీరునికి రాజ భోగాలపై కానీ, విలాసాలపై కానీ ఎలాంటి ఆసక్తి ఉండేది కాదు. ఎప్పుడు కూడా తన ఉనికిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఇదే క్రమంలో మహావీరుడు వైరాగ్యంతో తన 36వ ఏట రాజ్యాన్ని, ఐహిక సుఖాలను వదిలివేసి అంతర్గత శాంతి కోసం, ప్రశాంతం కోసం అడవులకు వెళ్లి దాదాపు 12 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు.

జ్ఞానోదయం
12 సంవత్సరాల కఠిన తపస్సు తర్వాత మహావీరునికి జ్ఞానోదయం కలిగి మహావీరుడిగా మారాడు. తాను సంపాదించిన జ్ఞానాన్ని నలుగురికి పంచి పెట్టడానికి మగధ రాజ్యంతో పాటు తూర్పునకు వెళ్లి తన సిద్ధాంతాలను బోధించాడు. బింబిసారుడు, అజాత శత్రువు తదితర రాజులను కలుసుకున్నాడు.

మహావీరుడు బోధించిన సిద్ధాంతాలు

  • మిమ్మల్ని మీరు జయించండి. ఎందుకంటే కోటి మంది శత్రువులను జయించడం కంటే ఈ ఒక్కటి ఉత్తమ విషయం.
  • ప్రతి ఆత్మ తనంతట తాను ఆనందమయుడు, సర్వజ్ఞుడు. ఆనందం అనేది మనలోనే ఉంటుంది. దాన్ని బయట వెతుక్కునేందుకు ప్రయత్నించొద్దు.
  • దేవునికి ప్రత్యేక ఉనికి అంటూ ఏమీ లేదు. మనం సరైన ప్రయత్నాలు చేస్తే దైవత్వాన్ని పొందొచ్చు.
  • అన్ని జీవుల పట్ల అహింసా వాదంతో ఉండాలి. మనసుతో, మాటలతో, శరీరంతో ఎవరినీ హింసించకపోవడమే నిజమైన ఆత్మ నిగ్రహం.
  • విజయం సాధిస్తే పొంగిపోవద్దు. ఓటమి వల్ల కుంగిపోవద్దు. భయాన్ని జయించిన వారు మాత్రమే ప్రశాంతంగా జీవించగలరు.

మహావీరుడు అస్తమయం
దేశం నలుమూల తిరిగి తన సిద్ధాంతాలను వ్యాప్తి చేసిన మహావీరుడు తన 72వ ఏట తుది శ్వాస విడిచారు. ఇంతకు మునుపు 23 మంది తీర్ధంకరులు ఉన్న మహావీరుని హయాంలోనే జైన మతానికి విశేషమైన గుర్తింపు వచ్చింది. అందుకే 32 సంవత్సరాల పాటు అహింస, ధర్మం గురించి ప్రచారం చేసిన మహావీరుడు జైనులకు ఆరాధ్య దైవమయ్యారు. ఆయన జయంతి ప్రతి ఏటా ఒక ఉత్సవంలా జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చింది.

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.